హిందువులను ముస్లింలు మించిపోతారా?

ABN , First Publish Date - 2022-05-31T00:38:13+05:30 IST

మరింతమంది పిల్లల్ని కంటారా?.. లేదంటే ఇస్లామిక్ దేశంలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తారా?.. వంద కోట్ల మంది

హిందువులను ముస్లింలు మించిపోతారా?

న్యూఢిల్లీ: మరింతమంది పిల్లల్ని కంటారా?.. లేదంటే ఇస్లామిక్ దేశంలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తారా?.. వంద కోట్ల మంది భారతీయులను హెచ్చరిస్తూ యతి నర్సింగానంద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. ముస్లింల జనాభా ఇలాగే పెరిగిపోతూ ఉంటే 2029లో ఈ దేశాన్ని ముస్లిం ప్రధాని పాలిస్తారని ఇటీవల ముగిసిన మత సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. విద్వేష వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన ఆయన ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చారు. హిందువుల జనాభా పెరగకుంటే 50 శాతం మంది మతమార్పిడులకు గురవుతారని, 40 శాతం మందిని చంపేస్తారని ఆయన హెచ్చరించారు. 


ఆయన వ్యాఖ్యలు అలా ఉంటే.. ప్రభుత్వం చేసిన ఓ సర్వేలో వెల్లడైన విషయాలు ఆయన వ్యాఖ్యలను పచ్చి అబద్ధమని స్పష్టం చేస్తున్నాయి. దేశంలో 14 శాతం మంది మాత్రమే ఇస్లాంను అనుసరిస్తున్నట్టు ఈ సర్వే పేర్కొంది. వాస్తవం ఇలా ఉంటే.. నర్సింగానంద్ వంటి వారు  దేశంలోని ఇతర వర్గాలతో పోలిస్తే ముస్లింల సంతానోత్పత్తి విపరీతంగా పెరిగిపోతోందని ప్రచారం చేస్తూ ఆందోళన ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తాజా సర్వే ద్వారా తేలింది.


ఇటీవల న్యూయార్క్‌లోని బఫెలోలో జరిగిన సామూహిక కాల్పుల ఘటన కారణంగా అమెరికా అతివాదులు ‘‘గ్రేట్ రీప్లేస్‌మెంట్ థియరీ’ మరోమారు చర్చకు వచ్చింది. అయితే, తాజాగా వెల్లడైన గణాంకాలు ఇండియా సొంత సిద్ధాంతానికి తూట్లు పొడిచాయి. ముస్లింల జనాభా పెరుగుతోందన్న ఆందోళనకు హిందువులు బాధితులుగా మారుతున్నారన్న వాదనలో పస లేదని తేలిపోయింది.


‘గ్రేట్ రీప్లేస్‌మెంట్ థియరీ’ని ఒక్క ముక్కలో చెప్పాలంటే కుట్ర సిద్ధాంతంగా పేర్కొనొచ్చు.  రాజకీయ ఎజెండాను సాధించేందుకు నాన్ వైట్ (శ్వేతజాతీయులు) ఓటర్లను ‘భర్తీ చేయడానికి అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లోకి శ్వేతజాతీయులను తీసుకురావడమే ఈ సిద్ధాంతం వెనక ఉన్న వ్యూహం.


ఇక, మన దేశం విషయానికి వస్తే.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలోని మిగతా సామాజిక వర్గాలతో పోలిస్తే 2015-16, 2019-20 మధ్య కాలంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోయింది. దేశంలోని మిగతా మతాలతో పోలిస్తే ముస్లింలు ఎక్కువగా ఉన్నప్పటికీ మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే సంతానోత్పత్తి రేటు సగానికి సగం పడిపోయింది. అప్పట్లో ఇది 4.4 శాతంగా ఉండగా, ఇప్పుడు అది 2.36 శాతంగా నమోదైంది.  దీనిని బట్టి భారత్‌లో ముస్లింలు అతిపెద్ద కమ్యూనిటీ కాబోతున్నారన్నది పూర్తి తప్పుడు అభిప్రాయమని తేలిపోయిందని భారత ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఎస్‌వై ఖురేషీ తన ‘పాపులేషన్ మిత్’ పుస్తకంలో రాసుకొచ్చారు. 


ఏప్రిల్‌లో నర్సింగానంద్ చేసిన వ్యాఖ్యలు హిందూ జాతీయవాద టూల్‌కిట్‌లో భాగమైన రెండో భయాన్ని సూచిస్తున్నట్టు విమర్శకులు అంటున్నారు. గతేడాది ప్యూ అధ్యయనానికి నాయకత్వం వహించిన మతపరమైన జనాభా శాస్త్రవేత్త స్టెఫానీ క్రామెర్.. మత విశ్వాసాలను విడిచిపెట్టి ఎక్కువమంది హిందూ మతంలో చేరుతున్నట్టు నిరూపించారు.


ప్యూ అధ్యయనం ప్రకారం.. హిందువులుగా జన్మించిన భారతీయుల్లో 0.7 శాతం మంది ప్రస్తుతం వేరే మతంలో గుర్తింపు పొందారు. 0.8 శాతం మంది వేరే మతంలో పెరిగినప్పటికీ ఇప్పుడు హిందువులుగా గుర్తించబడుతున్నట్టు స్టెఫానీ తెలిపారు. అలాగే, మతమార్పిడి ద్వారా ముస్లింలు ఎంతమందిని పొందుతున్నారో, అంతే సంఖ్యలో కోల్పోతున్నారని కూడా స్టెఫానీ తెలిపారు. అంతేకాకుండా, ఎక్కువమంది ముస్లింలు దేశాన్ని వదిలిపెట్టినట్టు వివరించారు. 


భారతదేశంలో హిందువుల మెజారిటీకి ముప్పు వాటిల్లుతోందనే భయం గత ఎనిమిదేళ్లుగా బాగా పెరిగిందని ఖురేషీ పేర్కొన్నారు. ఎక్కువమంది పిల్లల్ని కనాలంటూ నర్సింగానంద్ మాట్లాడిన రోజే.. బీజేపీ అనుబంధ  విశ్వహిందూ పరిషత్ (VHP) ఫైర్‌బ్రాండ్ నాయకురాలు సాధ్వి రితంబర ఒక్కో హిందూ జంట నలుగురేసి పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు.  ‘గ్రేట్ రీప్లేస్‌మెంట్ థియరీ’ని అమెరికా కాంగ్రెస్ సభ్యులు, ప్రముఖ మీడియా ద్వారా వ్యాప్తి చెందితే, మన దేశంలో పార్లమెంటు సభ్యులు, టెలివిజన్ ఛానెళ్లు హిందువులకు జనాభాపరమైన ముప్పు అనే అబద్ధాన్ని ప్రధాన స్రవంతిలో ప్రసారం చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. 

Updated Date - 2022-05-31T00:38:13+05:30 IST