ప్రధాని ప్రసంగంలో ప్రతిఫలించని సత్యం

Jun 16 2021 @ 01:00AM

ఓటమి ఎదురుకాగానే క్రుంగిపోయేవారు, అస్త్ర సన్యాసం చేసేవారు, రాజకీయనాయకులు కారు. నిజమైన రాజకీయ నాయకులు జయాపజయాలతో సంబంధం లేకుండా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. ఎన్నికలు సమీపిస్తుంటే వేగంగా పావులు కదుపుతారు. అవతలి పార్టీలో పరిణామాలను గమనిస్తుంటారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి రాజకీయాలు స్పష్టంగా కనపడేవి. ఏఐసిసి కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శుల గదుల ముందు వందలాదిమంది నిత్యం తచ్చాడుతూ కనపడేవారు. అక్బర్ రోడ్‌లోని పార్టీ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ నేతలు తెల్లటి పక్షుల్లా వాలుతూ ఉండేవారు. కాని ఇప్పుడు అక్కడ బూడిద రంగు పావురాలు, చెట్లనుంచి రాలిపోతున్న ఆకులు తప్ప మనుషులు కనపడడం లేదు. రాష్ట్రాలనుంచి వచ్చే నేతలకు ఎవర్ని కలుసుకోవాలో ఎవరితో మాట్లాడాలో తెలియదు. పాత కాంగ్రెస్ సంస్కృతికి అలవాటుపడ్డ వారు ఢిల్లీ వచ్చి ఒకటి రెండు రోజులు ఉండి నిరాశగా తిరిగి వెళిపోతున్నారు.


భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో అనుకున్న ఫలితాలు రాలేదని, హిందూత్వ కోటలైన అయోధ్య, గోరఖ్ పూర్, మథుర, ప్రయాగ్ రాజ్, వారణాసిలలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ పరాజయం చెందిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా ఖంగుతిన్న మాట నిజం కావచ్చు కాని వారు మరుసటి రోజునుంచే దూకుడుగా రాజకీయాలు ప్రారంభించారు. ఎటువంటి రాజకీయ ఎదురుగాలులు వీచినా తన శైలికి భంగం కాకుండా చూసుకునే స్వభావం మోదీది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని మొదటి రోజునుంచే సమస్యల్లో చిక్కుకునేలా చేసిన తర్వాత బిజెపి నేతల దృష్టి ఉత్తర ప్రదేశ్‌పై మళ్లింది. కరోనా సమయంలో స్వంత పార్టీ ఎంపీలనుంచి, కేంద్ర మంత్రులనుంచి తీవ్రవిమర్శలు ఎదుర్కొన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్‌ను వ్యూహాత్మకంగా తమ అదుపులోకి తెచ్చుకున్నారు. ఒక దశలో యోగీ ఆదిత్యనాథ్ తన పదవి కోల్పోతానేమోనని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంఘ్ పెద్దలు, పార్టీ నేతలు కలుగ చేసుకున్న తర్వాత యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ వచ్చి మోదీ, అమిత్ షాలతో సంధి కుదుర్చుకోవాల్సి వచ్చింది. 9 నెలల తర్వాత 2022 ఫిబ్రవరిలో జరిగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయానికి, తన సారథ్యానికి డోకా లేకుండా చేసుకోవడమే కాదు, 2024 ఎన్నికలకు కూడా మోదీ సన్నాహాలు ప్రారంభించారనడంలో అతిశయోక్తి లేదు. మరో సారి హోంమంత్రి అమిత్ షా నివాసం రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. ఆయన నిత్యం పార్టీ నేతలు, ఎంపీలతోనే కాదు, వివిధ రాష్ట్రాల నేతలతో, ముఖ్యమంత్రులతో సమావేశాలు జరుపుతున్నారు. కేంద్రంలో పలువురు మంత్రుల పనితీరుపై సమీక్ష సాగుతోంది. మోదీ తన మంత్రివర్గ టీమ్‌ను పునర్వ్యవస్థీకరిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. సరిగా పాలన చేయకపోతే, ఎమ్మెల్యేలలో అసంతృప్తిని అరికట్టకపోతే పదవి కోల్పోవాల్సి వస్తుందని కర్ణాటకలో ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కూడా హెచ్చరికలు వెళ్లాయి. బిహార్‌లో తలనొప్పిగా పరిణమిస్తున్న చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ చీలిపోయి మెజారిటీ నేతలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు. ప్రతి రాష్ట్రంలోనూ బిజెపి కోర్ కమిటీలు క్రియాశీలకంగా పనిచేస్తూ ఆయా రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపమని ఢిల్లీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అవసరమైన చోట్ల రాష్ట్రాల్లో పార్టీ పదవుల్లో నియామకాలు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలు మొదలయ్యాయి. బిజెపి బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి నేతలను, అసంతృప్తులను ఆకర్షించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. సున్నాకు ఒకటి చేరినా తమకు లాభమేనన్నది బిజెపి ప్రస్తుత విధానంగా కనపడుతోంది. అందులో భాగంగానే టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ నిష్క్రమించగానే వెంటనే బిజెపిలో చేర్చుకునేందుకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వెళ్లడం, కేంద్రం ఆమోదించడం వేగంగా జరిగింది. పెద్ద ఎత్తున మందీమార్బలంతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చిన ఈటల రాజేందర్‌కు ఆయన స్థాయి, అవసరానికి తగ్గ ప్రాధాన్యత లభించింది. ఉత్తర ప్రదేశ్ లో జితిన్ ప్రసాద కాంగ్రెస్ నుంచి అనేక సార్లు పోటీ చేసి ఓడిపోయి ఉండవచ్చు కాని ఆయన అమిత్ షాను కలిసిన తర్వాతే బిజెపిలో చేరారంటే ప్రస్తుత యుపి రాజకీయాల్లోనే కాదు, బిజెపి రాజకీయాల్లో కూడా జితిన్ ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.


బిజెపి లాగా మిగతా పార్టీల్లో కూడా కదలికలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌ను బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలు కలుసుకోవడం, పశ్చిమ బెంగాల్‌లో బిజెపి ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ తన అనుచరులతో సహా మళ్లీ తన స్వంత పార్టీ తృణమూల్‌లో చేరాలనుకోవడం, ఆఖరుకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్‌లో కాలూనేందుకు సన్నాహాలు చేయడం వంటివి మొదలయ్యాయి. మరో వైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దేశంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై శరద్ పవార్ లాంటి నేతలతో చర్చలు ప్రారంభించారు.


కాని దేశంలో ఇప్పుడు ఏ సానుకూల కదలికలూ లేని పార్టీ ఏదైనా ఉంటే అది తనకు తాను ఘన చరిత్ర ఉన్నదని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీయే అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేతలు వెళ్లిపోతున్నా పట్టించుకోలేని పరిస్థితి ఆ పార్టీలో నెలకొన్నది. ఆ పార్టీలో కదలికలు ఏవైనా జరుగుతున్నాయంటే అవి అసమ్మతి స్వరాల లుకలుకలు. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, మరో నేత నవజోత్ సింగ్ సిధూకు మధ్య 2017 నుంచి ఘర్షణలు జరుగుతున్నప్పటికీ అధిష్ఠానం పరిష్కరించే పరిస్థితిలో లేదు. ఎన్డీఏ నుంచి అకాలీదళ్ వెళ్లిపోవడంతో పంజాబ్‌లో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ ఇద్దరు నేతలు బహిరంగంగా తిట్టుకుంటూ పార్టీని బలహీనపరుస్తున్నారు. ఈ లోపు జితిన్ ప్రసాద బిజెపిలో చేరడంతో రాజస్థాన్ నేత సచిన్ పైలట్ మనసు మార్చుకోకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాది క్రితం అక్కడ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కూ సచిన్ పైలట్‌కూ మధ్య ఘర్షణలు తీవ్రతరమైనా, వారిద్దరి మధ్య సయోధ్య ఏర్పర్చడంలో అధిష్ఠానం విఫలమైంది. కేరళతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ నేతలు అంతర్గత కుమ్ములాటల్లో సతమతమవుతున్నారు. ఓటమిపై సమీక్షలు లేవు, పార్టీ కార్యకర్తలు నేతలతో రాష్ట్రాల వారీగా సమావేశాలు లేవు. జరగబోయే ఎన్నికల కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించగల సత్తా ఉన్న టీమ్ లేదు. కలిసికట్టుగా కార్యాచరణ చేసి పార్టీని బతికించాలన్న తపన గల వారు లేనే లేరు. జనంలోకి వెళితే విశేషాదరణ పొందగల నాయకులు లేరు. ఒకరికి అవకాశం వస్తే మరొకరు కాళ్లు లాగే పీతలు తప్ప నేతలు కాంగ్రెస్‌లో కనపడడం లేదు.


దేశ రాజకీయాలు ఇప్పుడు సంధి దశలో ఉన్నాయి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలు దుర్భరంగా మారుతున్నాయి. వ్యవస్థలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. అన్నిటికన్నా దారుణం ఏమిటంటే ప్రతిపక్ష పార్టీలు బలహీనం కావడమే కాదు, భారత దేశంలో వందిమాగధ బృందాలు తప్ప బలమైన పౌర సమాజం అనేది లేకుండా పోయింది. జయప్రకాశ్ నారాయణ్ నుంచి అన్నాహజారే వరకు ఉద్యమాలు నిర్వహించిన దేశమేనా ఇది అన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికారంలో ఉన్న వారు పనిగట్టుకుని విమర్శనాత్మకంగా వ్యవహరించే, జవాబుదారీ తనాన్ని కోరే, జరుగుతున్న ఘోరాలను ప్రశ్నించే పౌరసమాజాలు లేకుండా చేశారు. అప్పుడప్పుడు న్యాయస్థానాలు చేసే వ్యాఖ్యలు తప్ప సమాజంలో ఆరోగ్యకరమైన చర్చకు తావు లేకుండా పోయింది. గత వారం జరిగిన జీ-7 దేశాల సమావేశం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, పౌర సమాజ ప్రాధాన్యత, నియంతృత్వ పోకడల గురించి స్పష్టీకరించింది. మనం ఇప్పుడొక సంక్షుభితమైన దశలో ఉన్నామని, ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకూ ముప్పు ఏర్పడిందని హెచ్చరించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ఈ సమావేశంలో ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనపై భారత్ సంతకం చేసింది. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని, భారత దేశం ప్రజాస్వామ్య విలువలకు, దాపరికంలేని పారదర్శకతకు, వాక్ స్వాతంత్ర్యానికి కట్టుబడి ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఈ సమావేశంలో అద్భుతమైన ప్రసంగం చేశారు. కాని భారత దేశంలో జరుగుతున్న దానికీ, ప్రధాని ప్రసంగానికీ మధ్య ఎన్నో వైరుధ్యాలున్నాయని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా మరునాడే ఖండించింది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.