ఆయన.. పెద్దాయన!

Dec 5 2021 @ 03:31AM

  • విలక్షణ నాయకుడు రోశయ్య
  • ఎన్జీరంగా శిష్యుడిగా రాజకీయ ప్రస్థానం
  • మండలి నుంచి సీఎం దాకా పదవులు
  • కాంగ్రెస్‌ సీఎంలందరికీ ఆంతరంగికుడు
  • గవర్నర్‌ పదవీకాలం తర్వాత సొంత ఇంట్లోనే ప్రశాంత జీవనం
  • 88 ఏళ్ల జీవితంలో ఎన్నెన్నో విశేషాలు
  • మర్యాదకు మారు పేరు
  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సంతాపం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)  

అది... హైదరాబాద్‌ అమీర్‌పేటలోని ధరమ్‌కరమ్‌ రోడ్డులోని ఒక ఇల్లు! ఉదయాన్నే బాల్కనీలోని కుర్చీలో ఓ పెద్దాయన కూర్చుంటారు! అలా సేద తీరుతూ, టీ తాగుతూ దారిన వెళ్తున్న వారిని చూస్తూ కూర్చుంటారు. ఇరుగు పొరుగున ఉన్న వారు కనిపిస్తే... పలకరిస్తారు! కొన్నేళ్లుగా ఇది ఆయన నిత్యకృత్యం! ఇకపై... ఆ బాల్కనీ బోసిపోతుంది! పలకరింపులు కరువైపోతాయి. ఎందుకంటే... ఆ పెద్దాయన ఇక లేరు! ఆ యన మరెవరో కాదు... మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌, అనేక పదవులు నిర్వహించిన యోధుడు, మరీ ముఖ్యంగా ‘ఆర్థిక చాణక్యుడు’... కొణిజేటి రోశయ్య! రాజకీయ వారసత్వం లేకున్నా, రాజకీయాల్లో తనకంటూ ఏ వర్గమూ లేకున్నా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన జీవన ప్రస్థానం ఇది..


రోశయ్య గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4న జన్మించారు. తల్లిదండ్రులు... ఆదెమ్మ, సుబ్బయ్య! పెరవలి, కొల్లూరులో పాఠశాల విద్య పూర్తయింది.


చదువుకుంటున్న రోజుల్లోనే ఆయనకు తెనాలికి చెందినబంధువుల అమ్మాయి శివలక్ష్మినిచ్చి వివాహం చేశారు. అప్పటికి రోశయ్య వయసు 17 సంవత్సరాలే. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌లో డిగ్రీ చేశారు. అప్పట్లో ఆయన విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. రోశయ్య తన స్నేహితుడు తిమ్మారెడ్డితో కలసి స్వాతంత్య్ర సమరయోధుడు, కర్షక నేత ఎన్జీ రంగా వద్ద శిష్యరికం చేశారు. రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారు. రంగాతో పరిచయమే ఆయన రాజకీయంగా ఉన్నతంగా ఎదగడానికి బాటలు వేసింది. కావూరు వినయాశ్రమంలో... భావసారూప్యత ఉన్న వారంతా సమకాలీన అంశాలపై చర్చించుకునేవారు.


1968లో తొలిసారి ‘మండలి’కి!

శాసన మండలి... అంటే పెద్దల సభ! కానీ... 35 ఏళ్ల వయసులోనే 1968లో రోశయ్య తొలిసారి మండలిలో అడుగు పెట్టారు. తొలిసారి సభ్యుడైనా... తన మాట, అవగాహనతో సభలోని పెద్దలను కట్టిపడేసేవారు. 1974, 1980లలోనూ వరుసగా మండలికి ఎన్నికయ్యారు. రాజకీయ జీవితంలో ఐదు సార్లు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. రెండు సార్లు చీరాల నుంచి ఎమ్మెల్యేగా, ఒకసారి నరసరావుపేట నుంచి ఎంపీగా నెగ్గారు. 1994లో చీరాల నుంచి, 99లో తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. 2009 ఎన్నికలకు ముందు రోశయ్య ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే.. ముఖ్యమంత్రిగా ఎవరున్నా మంత్రివర్గంలో రోశయ్య ఉండాల్సిందే! అంతగా అందరికీ అభిమాన పాత్రుడయ్యారు. 2009 సెప్టెంబరు 2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ గల్లంతైనట్లు తెలియగానే... కేబినెట్‌లో సీనియర్‌గా రోశయ్య యంత్రాంగాన్నీ, మంత్రులనూ నడిపించారు. ఆ తర్వాత ఆయన్నే అధిష్ఠానం ముఖ్యమంత్రిని చేసింది. 


విభిన్న... విలక్షణ నేత

రాజకీయ నాయకులకు ఉండే సహజ లక్షణాలేవీ రోశయ్యలో లేవు. చుట్టూ మందీ మార్బలం కనిపించరు. పదునైన మాటలు.. ఎదుటి వారి విమర్శలకు చమక్కులతో కూడిన సమాధానాలు చెప్పడం ఆయన శైలి. పరుష పదజాలం వాడకుండానే... అవతలి వారు పదునైన కత్తితో పొడిచినంతగా విలవిల్లాడేలా చేయడం రోశయ్య ప్రత్యేకత. మంత్రిగా ఉంటే సచివాలయంలో... లేదంటే గాంధీభవన్‌లో! తమిళనాడు గవర్నర్‌గా ఎంపికయ్యే దాకా ఆయన జీవితమంతా ఇలాగే సాగింది.  కాంగ్రెస్‌ పార్టీని, నాయకత్వాన్ని ఎవరైనా ఏమైనా అంటే .. రోశయ్య ఏమాత్రమూ సహించేవారు కాదు. అంజయ్య నుంచి వైఎస్‌ వరకు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులందరి కేబినెట్‌లో రోశయ్య ఉన్నారు. వారికి ఆంతరంగికుడిగానూ వ్యవహరిస్తూ వచ్చారు. మర్రి చెన్నారెడ్డికి తెలివైన  ముఖ్యమంత్రిగా పేరుంది. రోశయ్యకు ఆయన ఆర్థిక, విద్యుత్‌, రవాణా శాఖలను అప్పగించారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డికి విద్యారంగంపై అవగాహన ఉంది. ఆయనా విద్యాశాఖను రోశయ్యకు అప్పగించారు. రోశయ్యను ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 
ప్రశాంత జీవనం

రోశయ్య 13 నెలలే ఎంపీగా ఉన్నారు. ఢిల్లీ రాజకీయాల్లో అడుగు పెట్టడం అదే మొదటిసారి.. అదే చివరిసారి. తెలుగు నేలంటేనే ఇష్టం. ‘ఢిల్లీ మనకెందుకు’ అనే వారు. ‘‘తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు, వాళ్ల సమస్యలు... అన్నీ నాకు తెలుసు. రాష్ట్రంలోని అన్ని మండలాలూ తిరిగాను’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత... అధిష్ఠానం ఆయనను తమిళనాడు గవర్నర్‌గా పంపింది. ఆ పదవీ కాలం ముగిసిన అనంతర కాలంలో హైదరాబాద్‌లోనే నివాసముంటూ కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడిపారు. 88 ఏళ్ల జీవిత ప్రయాణాన్ని అంతే ప్రశాంతంగా ముగించారు.


జననం.. వివాహం.. మరణం 4నే!

జననం 1933 జూలై 4.. పెళ్లి 1950 జూన్‌ 4.. మరణం 2021 డిసెంబరు 4.. యాదృచ్ఛికమే అయినా మాజీ సీఎం రోశయ్య జీవితంలో నాలుగో తేదీ ప్రత్యేకతను సంతరించుకుంది. 


ఫిలింనగర్‌తో అనుబంధం

రోశయ్యకు హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌తో మంచి అనుబంధం ఉంది. సినీ పరిశ్రమ తరలివచ్చాక ఆయన అనేక సమస్యలు పరిష్కరించారు. ఫిలింనగర్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక మంత్రిగా 1990 అక్టోబరు 28న కాంప్లెక్స్‌ భవనాన్ని ప్రారంభించారు.


రాజకీయాలకు దూరంగా వారసులు

ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే.. కొడుకులు, మనవళ్లు వారసత్వంగా పదవులు అనుభవించాలనుకుంటారు. కానీ రోశయ్య మాత్రం తన ముగ్గురు కుమారులను, కుమార్తెను రాజకీయాలకు దూరం పెట్టారు. 


బల్కంపేట ఎల్లమ్మకు భక్తుడు

రోశయ్య హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి పరమ భక్తుడు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా ఉన్నప్పుడూ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. రూ.18 లక్షల సొంత డబ్బుతో ఊరేగింపు రథం బహూకరించారు. ఫ్లోరింగ్‌ స్వయంగా చేయించారు. ఉమ్మడి రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఆర్యవైశ్య సంఘాలు నిర్మించిన అనేక సత్రాలు, ఆలయాలను రోశయ్యే ప్రారంభించారు.

వైఎస్‌కు ‘రోశన్న’

రోశయ్యకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి  కూడా ఆర్థిక శాఖను అప్పగించారు. ‘రోశన్నా’ అని ఆప్యాయంగా పిలిచేవారు. వైఎస్‌ సీఎం అయ్యాక.. మంత్రులు, ఇతర నేతలు తొలుత కేవీపీని కలిసేవారు. తర్వాతే వైఎస్‌ అపాయింట్‌మెంట్‌ లభించేది. రోశయ్యకు మాత్రం నేరుగా వైఎస్‌ వద్దకు వెళ్లగలిగే చనువు ఉండేది. వైఎస్‌ జిల్లాల యాత్రలకు వెళ్తానంటే రోశయ్య వద్దని వారించేవారు. ‘మీరు అక్కడ వరాలు కురిపిస్తారు. వాటికి నిధులు కేటాయించలేక నేను ఇబ్బంది పడాలి’ అని బహిరంగంగా వ్యాఖ్యానించేవారు. వైఎస్‌ కూడా ఈ వ్యాఖ్యలను సరదాగా తీసుకునేవారు.

సీఎం కెసీఆర్ నివాళులు..

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.