అస్తమించని కవితా ‘ప్రభాకరు’డు

ABN , First Publish Date - 2021-01-12T06:22:21+05:30 IST

ఆరుపాదాల ఒక పొట్టి కవిత ఇప్పటికీ మరో కవి దాటలేని కోటగోడలా నిలబడి ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు. ఆ కవిత పేరు ‘వేశ్య’. రాసినవాడు...

అస్తమించని కవితా ‘ప్రభాకరు’డు

ఆరుపాదాల ఒక పొట్టి కవిత ఇప్పటికీ మరో కవి దాటలేని కోటగోడలా నిలబడి ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు. ఆ కవిత పేరు ‘వేశ్య’. రాసినవాడు అలిశెట్టి ప్రభాకర్. ఆ పంక్తులు ఇలా సాగుతాయి. ‘తను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై... ఒకరికి పండై... ఎప్పుడూ ఎడారై... ఎందరికో ఒయాసిస్సై...’. పడుపు వృత్తిలోని పడతి దుర్భర బతుకును పది పదాల్లోకి కుదించిన కవి ప్రతిభ అసామాన్యం.


‘ఈ కవితను ఎప్పుడో చదివాను, ఎన్నోసార్లు దీన్ని కోట్ చేయగా చూశాను, సినిమాల్లో వచ్చింది, సీరియల్లో వాడారు’ అనేవాళ్లే ఎక్కువ. అమెరికాలోని డల్లాస్‌లో తెలుగు సాహిత్యాభిమానులు జరిపే అలిశెట్టి ప్రభాకర్ సంస్మరణ సభలో ‘వేశ్య’ కవితను చదివి విశ్లేషించడానికి పోటీ పడతారట. ఈ కవిత రచనాకాలం 1975. అలిశెట్టి ప్రభాకర్ 1976లో వెలువరించిన తొలి కవితా సంపుటి ‘ఎర్ర పావురాలు’లో ఈ కవిత ఉంది.


39 ఏళ్ల వయసులోనే అనారోగ్య పీడితుడై మరణించిన అలిశెట్టి తన 19వ ఏటనే కలం పట్టాడు. ‘మరణం నా చివరి చరణం కాదు’ అంటూ తుదిక్షణాల వరకు పట్టిన కలాన్ని వదిలిపెట్టలేదు. ఆయన ప్రతిభాప్రభలు గత యాభై ఏళ్లుగా మూడు తరాల వారిని ప్రభావితం చేస్తున్నాయడం అతిశయోక్తి కానేకాదు. 1954 జనవరి 12న జన్మించిన ప్రభాకర్ 1993లో అదే రోజున మరణించాడు. రెండువేలకు పైగా ఆయన రాసిన కవితల్లో ఫలానాది మామూలుగా ఉంది, ఇది అలిశెట్టి స్థాయికి సరి తూగదు అనేదాన్ని పట్టుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే తన ప్రతిభకు గీటురాయిగా నిలువని రచనల్ని ఎప్పటికప్పుడు చించేసేవాడు. ఆయన బయటపెట్టిన వాటికన్నా రాసి తృప్తి చెందక చించేసినవి రెట్టింపు ఉంటాయని అలిశెట్టి మిత్రులు అంటారు.


అయితే ఇన్ని విశేషాలున్న అలిశెట్టి కవిత్వం తెలుగు గడప దాటకపోవడం విచారకరమే. వాస్తవానికి తెలుగు సాహిత్యమే అనువాదానికి దూరంగా కాలం వెళ్లదీస్తోందని అనవచ్చు. తెలుగు రచనలు విరివిగా బయటి భాషల్లోకి వెళ్లకపోవడానికి ప్రధాన కారణం అవి ఇంగ్లీషులోకి అనువాదం కాకపోవడమే అని సి.నారాయణరెడ్డి పదే పదే అనేవారు. కొందరి కథలు, నవలలు, కవితలు తమిళం, కన్నడంతో సహా మరిన్ని భాషలలోకి వెళుతున్నా అవి ఆయా భాషీయులకు ఎంతవరకు చేరుతున్నాయో చెప్పలేం. రెండు భాషలు తెలిసిన రాష్ట్ర సరిహద్దు ప్రాంత రచయితలు లేదా ఆయా భాషలను ఇష్టంగా నేర్చుకున్న మనవారు వాటిని అనువదిస్తున్నారు. ఇతర భాషకు చెందిన రచయితలతో, పత్రికలతో కనీస పరిచయమైనా ఉంటే తప్ప మన అనువాదాలను గీత దాటించలేము.


ఇక ఇంగ్లీషు అనువాదాలకొస్తే ఇంగ్లీషులో పుస్తకాలు అధికంగా ప్రచురణకర్తల ద్వారా బయటికొస్తాయి. రచన నచ్చిన పబ్లిషర్ తన సొంత ఖర్చుతో పుస్తకం వేసి మార్కెటింగ్ చేసి రచయితకు కమిషన్, రాయల్టీ రూపంలో ప్రతిఫలాన్ని ఇస్తాడు. నిజానికి ఇదే రచనలకు గౌరవప్రదం, ఆసక్తి గల పాఠకులకు చేరే సుగమమార్గం.


అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం ఇంగ్లీషులోకి వెళ్లాలనే విషయానికొస్తే అనువాదానికి అందులో ఎన్నో అనుకూలతలున్నాయి. భాష, వస్తువు, వ్యక్తీకరణల్లో ఆయన ఎంచుకున్న మార్గాలు అనువాదాన్ని సులువు చేస్తాయనవచ్చు. మచ్చుకు ‘సిటీ లైఫ్’ లోని ఓ పొట్టి కవితను తీసుకుందాం- ‘గుడిసెలే మేడల్ని కడతాయి/ అయినా మేడలే గుడిసెల్ని కొడతాయి’. ఇందులో కవి కేవలం రెండక్షరాల గుణింతం మార్చి లోకం తీరును విప్పి చెప్పాడు. ఈ కవిత ఆంగ్లీకరణకు పెద్ద పాండిత్యం అవసరం లేదని చెప్పవచ్చు. ఇంకో కవిత ‘రాజకీయం’. గత నలభై ఏళ్లుగా పత్రికలు ఎన్నికలు వచ్చినప్పుడల్లా మరువకుండా పలవరిస్తున్న కవిత ఇది. ‘ఒక నక్క ప్రమాణస్వీకారం చేసిందట ఇంకెవర్నీ మోసగించనని / ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు / ఈ కట్టుకథ విని గొఱ్ఱెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయ్’. అంతా సులభగ్రాహ్యం, అనువాదయోగ్యం.


ప్రధానంగా అలిశెట్టి రాసిన దీర్ఘకవితలు ఇంగ్లీషులోకి తప్పక అనువదించ వలసిన అవసరం ఉంది. సమకాలీన దేశ ముఖచిత్రాన్ని వాటిలో అద్భుతంగా అక్షరీకరించాడు. ‘నిజరూపం’ అనే కవితలో -‘వయసుతో పాటు ప్రకృతిసిద్ధంగా అంగాలు ఎదగడం కూడా ఒక రకంగా హత్యే / ఎందుకంటే ఇది మానభంగాల దేశం’ అనే పంక్తులు నేటికీ సాగుతున్న అత్యాచారాల పర్వాన్ని గుర్తు చేస్తాయి. ఇలా ప్రాసంగికత కోల్పోని బాధాతప్త హృదయఘోషలు ఎన్నింటినో చూడవచ్చు. నిజరూపం, డాక్యుమెంటరీతో పాటు ‘సంక్షోభగీతం’ సంపుటిలో వీరుడితో కరచాలనం, ఆయుధాన్ని అధ్యయనం చెయ్, విషాద సాక్షాత్కారం మరిన్ని పెద్ద కవితలు ఉన్నాయి. వీటిలో ‘ధాన్యపు గింజ వొలిస్తే రైతు అస్థిపంజరం రాలిపడే దయనీయ దృశ్యాలు’ ఎన్నింటినో కాంచవచ్చు.


అలిశెట్టి మరణించిన 19 ఏళ్ల తర్వాత అంటే 2013లో ‘అలిశెట్టి మిత్రులు’ ఆయన సమగ్ర కవితా సంపుటిని వెలువరించారు. ‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ ఇప్పటికి ఐదు ముద్రణలు పొందింది. ఈ నేపథ్యంలో విన్నవించుకునే విషయమేమిటంటే అదే అలిశెట్టి మిత్రులు వీలయినన్ని ప్రభాకర్ కవితలతో ఇంగ్లిష్ అనువాదాన్ని తేవాలనే సంకల్పంతో ఉన్నారు. తెలుగు, ఇంగ్లిష్ భాషలలో మంచి పరిజ్ఞానం, అనువాద అనుభవం ఉన్నవారు సహకరిస్తే ఈ కార్యం ముందడుగు వేయవచ్చు. ఏదైనా ఇంగ్లిష్ ప్రచురణ సంస్థ ద్వారా ఈ పుస్తకం తేవాలని వారి ఆలోచన. ఆసక్తిపరుల సహకారంతో ఈ సంకల్పం సిద్ధిస్తే వచ్చే జనవరి 12 నాటికి అలిశెట్టికి నివాళిగా అది నిలుస్తుంది.

బి.నర్సన్ 

(నేడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి)

Updated Date - 2021-01-12T06:22:21+05:30 IST