పిచ్చి ముదిరింది

Dec 1 2021 @ 03:57AM

  • కేసీఆర్‌ నాలుకకు, మైండ్‌కు లింక్‌ తెగిపోయింది
  • అందుకే కేంద్ర మంత్రిని దూషించారు
  • అది సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే భాషేనా?
  • యాసంగి ధాన్యం ఎలా కొనరో చూస్తాం
  • మెడ మీద కత్తి పెడితే ఏమైనా చేస్తారా?
  • తెలంగాణను పాకిస్థాన్‌కు రాసిస్తారా?
  • నంబర్‌వన్‌ హంతకుడు కేసీఆర్‌: సంజయ్‌న్యూఢిల్లీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌కు మైండ్‌ దొబ్బిందని, నాలుకకు, మైండ్‌కు లింక్‌ తెగిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత సీఎంకు పిచ్చి ఇంకా ముదిరిందని, అందుకే కేంద్రమంత్రిని దూషించారని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, సోయం బాపురావుతో కలిసి సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సోమవారం హైదరాబాద్‌లో  విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం జాగ్రత్తగా మాట్లాడాలి. మేం కూడా అదే భాష మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోండి. మేం ఇంకా సహనంతో ఉంటున్నాం’’ అని సంజయ్‌ అన్నారు. సీఎం ప్రత్యక్ష ప్రసారాలను మీడియా బంద్‌ చేయాలని సూచించారు. 


తెలంగాణ రైతులు యాసంగిలో పండించే ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొని తీరాల్సిందేనని, ఎలా కొనరో తామూ చూస్తామని హెచ్చరించారు. ‘‘పండించిన ప్రతి గింజనూ నేనే కొంటున్నా అని ఇన్ని రోజులు అన్నవు.. కేంద్రం పెత్తనమేందని అన్నవు కదా? ధాన్యాన్ని పక్కా కొనాల్సిందే. కొనుగోలు కేంద్రాలను బంద్‌ చేస్తావా? బంద్‌ చేయి బిడ్డా చూస్తా’’ అని సంజయ్‌ వ్యాఖ్యానించారు. కొనుగోలు కేంద్రాలను బంద్‌ చేస్తామని గతేడాది డిసెంబరులోనే సీఎం కేసీఆర్‌ ప్రకటించారని, మూసివేతకు అప్పటినుంచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘‘బాయిల్డ్‌ రైస్‌ను ఎక్కడా తినడం లేదు. నువ్వు తింటవా చెప్పు.. నోట్లో కుక్కుతా. నీ ఫామ్‌హౌ్‌సకు లారీలు లారీలు పంపిస్తా’’ అని సీఎం కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. బాయిల్డ్‌ రైస్‌ రాకుండా ఐదు రకాల విత్తనాలు ఉన్నాయని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌కు చెందిన వ్యక్తే చెప్పారని, రాష్ట్రంలో బాయిల్డ్‌ రైస్‌ అనేది సమస్తే కాదని అన్నారు. రాష్ట్రంలో పంట విస్తీర్ణం, ఉత్పత్తిలో తేడా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, ఇదో కుంభకోణమని తెలిపారు. వరంగల్‌లో అక్టోబరు 7న కేంద్ర బృందం స్టాక్‌ ధ్రువీకరణ చేసిందని, అందులో 33,190 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు తేలిందని వెల్లడించారు.

 

మెడమీద కత్తి పెడితే ఏదైనా చేస్తారా?

బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ ఇచ్చిందని సంజయ్‌ గుర్తు చేశారు. మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా, ‘‘మెడ మీద కత్తి పెడితే పాకిస్థాన్‌కో, బంగ్లాదేశ్‌కో తెలంగాణను రాసిస్తారా? మెడ మీద కత్తిపెడితెనే కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు అంగీకరించారా? తనను బెదిరిస్తున్నారని ప్రధాని మోదీకి ఎందుకు చెప్పలేదు? మెడ మీద కత్తిపెడితే నీ ఫామ్‌హౌ్‌సనూ రాసిస్తావా?’’ అని ప్రశ్నించారు. ధాన్యం సేకరణ విషయంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చక్కటి భాషలో మాట్లాడారని, కానీ, సీఎం కేసీఆర్‌ దిగజారి మాట్లాడారని విమర్శించారు. ఈసారి కేంద్రం యాసిడ్‌ టెస్ట్‌ పెట్టిందని, బియ్యంపై యాసిడ్‌ పోస్తే అవి కొత్త బియ్యమా, పాతవా, ఎక్కడినుంచి వచ్చాయి.. అన్నది బయటపడుతుందని సంజయ్‌ తెలివపారు. అందుకే కొనుగోళ్లకు సీఎం భయపడుతున్నారని అన్నారు. ‘‘ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ రేటుకు తీసుకొచ్చి పాత బియ్యాన్ని గోడౌన్లలో నింపి పెట్టారు. యాసిడ్‌ టెస్టు కొంత మంది రైస్‌ మిల్లర్లకు ఇబ్బందికరం కాబట్టి బండారం బయటపడుతుందని సీఎం కొత్త నాటకానికి తెరలేపారు’’ అని ఆరోపించారు. మూడేళ్ల నుంచి ఆడిట్‌ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వరంగల్‌, సూర్యాపేట, నిజామాబాద్‌ వంటి ప్రాంతాల్లో బియ్యం దొరికాయన్నారు. 


పాకిస్థాన్‌తో రహస్య ఒప్పందాలున్నాయా?

సీఎం కేసీఆర్‌ పాకిస్థాన్‌తో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని బండి సంజయ్‌ అన్నారు. ‘‘పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ జనాభా చాలా తక్కువ. అంతర్జాతీయ ఆకలి సూచీ గురించి మాట్లాడే ముందు తెలంగాణ సూచీ బయటపెట్టాలి. ఈ మధ్య సీఎంకు పాకిస్థాన్‌పై ప్రేమ బాగా పడుతోంది. వాళ్లతో సంబంధాలు పెట్టుకున్నావా ఏంది? పాకిస్థాన్‌ తీవ్రవాద సంస్థల శిక్షణ శిబిరాలకు డబ్బులు ఇస్తున్నావా? లేదంటే పాకిస్థాన్‌లో డబ్బులు పెట్టి వ్యాపారం చేస్తున్నావా? కేసీఆర్‌ను నిఘా సంస్థలు జాగ్రత్తగా గమనించాలి’’ అని సంజ య్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీని హంతకుల పార్టీ అనడాన్ని ఖండించారు. నంబర్‌వన్‌ హంతకుడు కేసీఆరేనని ఆరోపించారు. ఆయన పాలనలో రైతులు, విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ విద్యుత్తు సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, రాబోయే రోజుల్లో రాష్ట్రం అంధకారంగా మారే ప్రమాదం ఉందని చెప్పారు. విద్యుత్తు సంస్థలకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.