హల్‌చలే!

ABN , First Publish Date - 2022-01-29T08:11:37+05:30 IST

శీతాకాలంలో ఇంట్లోంచి బయటకొస్తే చలి భయానికి చేతులు కట్టుకుంటాం! ఇంట్లో ఉంటేనేమో నిండా దుప్పటి కప్పుకొంటాం.

హల్‌చలే!

  • సంక్రాంతి దాటి పక్షమైనా తగ్గని చలి 
  • రాష్ట్రంలో గత 20 ఏళ్లలో లేని స్థితి
  • అర్లి(టి)లో 5.7 డిగ్రీలు
  • 14 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌..
  • ఇరాన్‌, ఇరాక్‌ నుంచి శీతల గాలులు
  • మరో రెండు రోజులు ఇదే తీవ్రత

హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): శీతాకాలంలో ఇంట్లోంచి బయటకొస్తే చలి భయానికి చేతులు కట్టుకుంటాం! ఇంట్లో ఉంటేనేమో నిండా దుప్పటి కప్పుకొంటాం. కొన్నిసార్లు దవడలు వణుకుతుంటే నోటమాట కూడా రాదు! ఇలా జనాలను వణికించే చలి, సాధారణంగానైతే సంక్రాంతి తర్వాత తుర్రుమనాలి. ఈసారి పండుగ గడిచి 15 రోజులు దాటుతున్నా పాడు చలి పోవట్లేదు! ఫిబ్రవరి వచ్చేస్తున్నా తగ్గేదేలే అంటూ  హడలెత్తిస్తోంది.  ఎముకలు కొరికే చలి కారణంగా శివార్లలో ఉదయం, సాయంత్రాల్లో  రైతులు, కూలీలు, పశువుల కాపర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడే కరోనా రోగులైతే ఈ మాయదారి చలి కారణంగా మరింత బాధపడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ చలి ప్రభావం తీవ్రంగా ఉంది. ఆదిలాబాద్‌లో 5 డిగ్రీల నుంచి 8 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ 14 జిల్లాల్లో ‘ఆరెంజ్‌ అలర్ట్‌’ ప్రకటించింది. మరో రెండు రోజులు ఇదే తరహా చలి వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరి.. ‘కాలానికి’ అతీతంగా ఇంతలా చలి విజృంభించేందుకు కారణాలేమిటి? అంటే ఇరాన్‌, ఇరాక్‌.. గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్న అతి శీతల ఉపరితల గాలుల ప్రభావంతో హిమాలయా పర్వత ప్రాంతాల్లో ‘పశ్చిమ అస్థిరత’(వెస్ట్రన్‌ డిస్టమెన్స్‌) ఏర్పడటమేనంటున్నారు వాతావరణ శాఖ అఽధికారులు. 


హిమాలయాల్లో కేంద్రీకృతమైన గాలులతో దాని వెంబ డి ఉన్న గాలులు కూడా చల్లగా మారుతున్నాయి. ఉత్తర భారతం నుంచి దక్షిణాదిలోకి ఉపరితల శీతల గాలులు ప్రయాణిస్తూ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పశ్చిమ అస్థిరత ఎక్కువ ఎత్తులో ఏర్పడితే చలి ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది. కానీ తక్కువ ఎత్తులో ఏర్పడటంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీనికితోడుగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి తక్కువఎత్తులో ఉపరితల గాలులు వీస్తుండటంతో చలి ఎక్కువగా ఉంది.  ఇదంతా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల ఫలితమేనని వాతావరణ శాస్త్రవేత్త నరేందర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మెరుపు వర్షాలు, అధిక చలి, అకా ల వర్షాలు, చలికాలంలో వడగండ్లు.. అన్నీ వాతావరణంలో సమతుల్యత లేకపోవటంతోనే వస్తున్నట్లు వెల్లడించారు. గత 15- 20 ఏండ్లలో కూడా ఇలాంటి పరిస్థితి రాలేదని పేర్కొన్నారు. సాధారణంగా ఈ సమయంలో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీల మధ్య నమోదవుతుంటాయి. అందుకు పూర్తిభిన్నంగా 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట కూడా తీవ్రమైన చలి ఉంటోంది. ఉత్తరాది నుంచి వచ్చే అతిశీతల గాలులు, ఉపరితల ఆవర్తన ద్రోణి, పశ్చిమ అస్థిరత ప్రభావంతో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. పొగమంచుతో  ఎండ ప్రభావం లేకుండా పోవడంతో చలి తగ్గడం లేదు.  ఆదిలాబాద్‌ జిల్లా అర్లి(టి)లో 5.7 డిగ్రీల అతి తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌ జిల్లా సగటు కనిష్ట ఉష్ణోగ్రత కూడా 7.2 డిగ్రీలు, రామగుండంలో 10.4 డిగ్రీలు, హనుమకొండలో 12 డిగ్రీలు, మెదక్‌లో 12.4 డిగ్రీలు, హైదరాబాద్‌లో 13.4 డిగ్రీలు, నిజామాబాద్‌లో 13.5 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో 15.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  


ఈ జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ 

చలి ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ‘ఆరెంజ్‌ అలర్ట్‌’ ప్రకటించింది. సాధారణంగా 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైతే.. ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటిస్తారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, భూపాలపల్లి, ములు గు, కొత్తగూడెం, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఇవికాకుండా నిజామాబాద్‌, సిద్దిపేట, జనగామ, వరంగల్‌, మహబూబాబాద్‌, సూర్యాపేట, ఖమ్మం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ‘ఎల్లో అలర్ట్‌’ ప్రకటించారు. 

Updated Date - 2022-01-29T08:11:37+05:30 IST