పట్టణపేదలకు ‘ఉపాధి హామీ’ అవసరం

ABN , First Publish Date - 2022-01-28T08:51:10+05:30 IST

దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు అభిప్రాయపడ్డారు.

పట్టణపేదలకు ‘ఉపాధి హామీ’ అవసరం

బడ్జెట్‌లో ఈ అంశానికి ప్రాధాన్యమివ్వండి

కేంద్రానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ లేఖ 

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు అభిప్రాయపడ్డారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణాల్లోని పేదల కోసం ఓ పథకాన్ని అమలు చేయాలన్నారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ఈ అంశాన్ని పరిశీలించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు గురువారం ఓ లేఖ రాశారు. పట్టణ ప్రాంత పేద ప్రజల జీవన స్థితిగతులు, వారి ఆర్థిక ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో పలు సూచనలు చేశారు. మెరుగైన ఉపాధి కోసం గ్రామీణ ప్రజలు పట్టణాల బాట పడుతున్నారన్నారు. దీంతో పట్టణాల్లో మౌలిక వసతులపై ఒత్తిడి నెలకొంటుందని, రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశముందని కేటీఆర్‌ అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 31 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉంటుందని, 2030 నాటికి 40శాతానికి చేరే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో అది 50శాతం దాటే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. పట్టణ పేదలు చాలా వరకు అసంఘటిత రంగాలపై ఆధారపడుతున్నారని చెప్పారు. కరోనా సంక్షోభం వల్ల పట్టణాల్లో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయాయని, ఈ నేపథ్యంలో  ఓ ఉపాధి హామీ పథకం అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంట్‌ సభ్యుడు భర్తృహరి మహతాబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ, సిఐఐ వంటి సంస్థలు పట్టణ ప్రాంతాల్లోని ప్రజల సామాజిక భద్రతను పెంచేందుకు పట్టణ ఉపాధి హామీ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించిన విషయాన్ని మంత్రి తన లేఖలో ప్రస్తావించారు. జాతీయస్థాయిలో అసంఘటిత రంగంలో భారీ ఎత్తున ఉపాధి కల్పించే అవకాశం కేవలం పట్టణాలకే ఉందన్నారు. పేదలకు నైపుణ్య అభివృద్థి, ఆర్థిక వనరుల కల్పన, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం వంటివి చేపట్టేలా ఉపాధి హామీ కార్యక్రమం ఉండాలని కోరారు. దేశ పౌరులు ఏ పట్టణంలోనైనా ఉపాధి హామీ లబ్థి పొందేలా విధానాలు రూపొందించాలని కేటీఆర్‌ లేఖ ద్వారా కోరారు.

Updated Date - 2022-01-28T08:51:10+05:30 IST