విదేశీ కుక్కల అమెరికా ప్రవేశంపై నిషేధం

ABN , First Publish Date - 2021-06-15T19:08:38+05:30 IST

రేబిస్ సమస్య ఉన్న దేశాల నుంచి కుక్కలను అమెరికాకు

విదేశీ కుక్కల అమెరికా ప్రవేశంపై నిషేధం

న్యూయార్క్ : రేబిస్ సమస్య ఉన్న దేశాల నుంచి కుక్కలను అమెరికాకు తీసుకురాకూడదని ఆ దేశ ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. దాదాపు 100 దేశాల నుంచి కుక్కలను తీసుకురావడంపై ఏడాది పాటు నిషేధం విధించినట్లు తెలిపింది. అయితే ఇప్పటికే వచ్చిన కుక్కలకు  రేబిస్ వ్యాక్సినేషన్ జరిగినట్లు తగిన రుజువులు చూపవలసి ఉంటుందని పేర్కొంది. పూర్తిగా వ్యాక్సినేషన్ చేయడానికి తగినంత వయసుగలవి కాకపోవడంతో విదేశాల నుంచి వస్తున్న కుక్కల ప్రవేశంపై నిషేధం విధించినట్లు తెలిపింది. జూలై 14 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈ ప్రకటనను జారీ చేసింది. 


అమెరికాకు ఏటా సుమారు 10 లక్షల కుక్కలను రవాణా చేస్తూ ఉంటారని సీడీసీ అధికారులు తెలిపారు. వీటిలో దాదాపు 7.5 శాతం కుక్కలపై ఈ నిషేధం ప్రభావం పడుతుందన్నారు. కొన్ని పరిస్థితుల్లో ఈ ఆంక్షలను సడలిస్తామన్నారు. అంధులకు దారి చూపే గైడ్ కుక్కలు, అమెరికాకు తమ కుక్కలతోపాటు మారుతున్న విదేశీయులకు మినహాయింపు ఇస్తామన్నారు. ఇటీవల తిరస్కరణకు గురైనవాటిలో  అత్యధిక కుక్కలు రష్యా, ఉక్రెయిన్, కొలంబియా నుంచి వచ్చినవేనని పేర్కొన్నారు. రేబిస్ రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి కుక్కలను తీసుకురావడానికి నిషేధం విధించినట్లు వివరించారు. 


కుక్క వయసు నాలుగు నెలల కన్నా ఎక్కువ ఉన్నట్లు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పిస్తున్నారని, అటువంటి కుక్కలను అమెరికాలో ప్రవేశించడానికి అనుమతించడం లేదని సీడీసీ అధికారులు తెలిపారు. 


విదేశీ కుక్కలపై నిషేధం విధించడాన్ని అమెరికన్ వెటరినరీ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డగ్లస్ క్రాట్ స్వాగతించారు. దేశంలోకి ఆరోగ్యవంతమైన కుక్కలే వచ్చేలా చూడాలన్నారు. 


Updated Date - 2021-06-15T19:08:38+05:30 IST