వ్యాక్సిన్‌ వికటించి చనిపోయింది ఒక్కరే!

Jun 16 2021 @ 01:03AM

జాతీయస్థాయి ఏఈఎఫ్‌ఐ కమిటీ వెల్లడి


న్యూఢిల్లీ, జూన్‌ 15 : కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వికటించి ఇప్పటిదాకా దేశంలో చనిపోయింది ఒక్కరేనని భారత్‌ మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 8న 68 ఏళ్ల వృద్ధుడొకరు తీవ్ర అలర్జిక్‌ రియాక్షన్‌ (అనఫిలాక్సి్‌స)తో చనిపోయారని తెలిపింది. ఈవిషయాన్ని కరోనా వ్యాక్సినేషన్‌ అనంతర తీవ్ర దుష్ప్రభావాల(ఏఈఎ్‌ఫఐ)పై అధ్యయనం చేస్తున్న జాతీయ స్థాయి కమిటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.అరోరా పీటీఐ వార్తాసంస్థకు చెప్పారు. ‘‘దేశంలో టీకా లబ్ధిదారుడిలో అనఫిలాక్సి్‌సతో సంభవించిన మొదటి మరణమిది. వ్యాక్సిన్‌ వేయించుకున్న వెంటనే ఈ తరహా దుష్ప్రభావాలు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే టీకా తీసుకున్నాక వ్యాక్సినేషన్‌ కేంద్రంలో తప్పనిసరిగా 30 నిమిషాల పాటు కూర్చోవాలి’’ అని పేర్కొన్నారు.


ఇదే విధమైన 5 కేసులు ఫిబ్రవరి 5న, 8 కేసులు మార్చి 9న, 18 కేసులు మార్చి 31న నమోదయ్యాయని, వాటికి సంబంధించిన నివేదికలను సేకరించి కారణాలపై అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. టీకా తీసుకుంటే తలెత్తే దుష్ప్రభావాల కంటే ప్రయోజనాలే చాలా ఎక్కువగా ఉన్నాయని కమిటీ నివేదిక స్పష్టంచేసింది. కాగా, అనఫిలాక్సిస్‌ అనేది ఒక రకమైన అలర్జీ. వ్యాక్సిన్లు, ఔషధాలతో పాటు ఆహార పదార్థాలు, కీటకాల కాటు వల్ల కూడా ఇది సంభవించే అవకాశాలుంటాయి. దీని బారినపడే వారు ప్రధానంగా శ్వాస తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. కొందరిలో గుండె కొట్టుకునే రేటు కూడా పెరగొచ్చు. మూర్ఛ, అపస్మారక స్థితికి వెళ్లడం, జిడ్డు చర్మం, మానసిక ఆందోళన వంటి లక్షణాలను వీరిలో గుర్తించవచ్చు. 


‘పాజిటివ్‌’లలో 

మరణాల రేటు 

1 శాతంలోపే..

‘‘జనవరి 16 నుంచి జూన్‌ 7 మధ్యకాలంలో 488 మంది టీకా లబ్ధిదారుల మరణాలకు వ్యాక్సినేషన్‌తో సంబంధం ఉంది’’ అంటూ పలు మీడియాల్లో వస్తున్న నివేదికలను కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. అవన్నీ అరకొర సమాచారంతో చేసిన విశ్లేషణలని, ఈ ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. దేశంలో ఇప్పటివరకు ఇంచుమించు 23.5 కోట్ల డోసులతో వ్యాక్సినేషన్‌ చేయగా వివిధ కారణాల వల్ల 0.0002ు మరణాలే చోటుచేసుకున్నాయని పేర్కొంది. 2017లో ఎలాంటి వ్యాధుల వ్యాప్తి లేని సమయంలోనూ.. ఏటా ప్రతి వెయ్యి జనాభాకు సగటున 6.3 మంది వివిధ కారణాలతో మృతిచెందారని గుర్తుచేసింది. కొవిడ్‌-19 ‘పాజిటివ్‌’ నిర్ధారణ అవుతున్న వారిలో మరణాల రేటు 1 శాతానికి మించి ఉందని, వ్యాక్సినేషన్‌తో ఆ మరణాలను తగ్గించవచ్చని తెలిపింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.