
కొన్ని జీవుల మధ్య స్వతహాగానే జాతివైరం ఉంటుంది. సాధు జంతువులు క్రూర జంతువులకు ఆహారమైనట్లే.. పాములకు కప్ప, ఎలుకలు తదితరాలు ఆహారమవుతుంటాయి. ఇది సర్వసాధారణమే అయినా కొన్నిసార్లు అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. వాటి మధ్య స్నేహం చిగురించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో చాలా చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. పాముపై ఒక కప్ప, రెండు ఎలుకలు సవారీ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎలుకలు, కప్పను చూడగానే క్షణం ఆలస్యం చేయకుండా వేటాడే పాము.. అందుకు భిన్నంగా మిన్నకుండిపోవడం విచిత్రంగా అనిపిస్తోంది.
ఇన్స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ పెద్ద ట్యాంకులోని వర్షపు నీటిలో ఓ పాము, రెండు ఎలుకలు, ఒక కప్ప చిక్కుకుని ఉంటాయి. సాధారణంగా ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అని ఎవరిని అడిగినా.. ‘‘ఎలుకలు, కప్పను పాము చటుక్కున మింగేస్తుంది’’.. అని ఠక్కున చెబుతారు. అయితే ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఎటూ కదలలేని ఆ పరిస్థితుల్లో.. అందుబాటులో ఉన్న ఆహారాన్ని ఏ పామూ వదులుకోదు. అయితే ఇక్కడ మనం చూడబోయే పాముకు మాత్రం చాలా మంచి మనసు ఉన్నట్లుంది. తన మీద రెండు ఎలుకలు, ఒక కప్ప కూర్చుని సవారీ చేస్తున్నా కూడా పట్టించుకోలేదు.
పాము సంగతి అటుంచితే.. ఎలుకలు, కప్ప కూడా ఎలాంటి భయం లేకుండా పాముపై అటూ ఇటూ తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వాటి చేష్టలు చూస్తే.. మనమంతా భాయ్.. భాయ్.. అన్నట్లుగా ఉంటాయి. ఓ సందర్భంలో పాము వెనక్కు తిరిగి కప్ప, ఎలుకల వైపు చూస్తుంది. ఆ సమయంలో కప్ప కొంచెం భయంతో పాము చాటున దాక్కునే ప్రయత్నం చేస్తుంది. అయితే పాము మాత్రం వాటికి ఎలాంటి హానీ కలిగించదు. ఈ ఘటనను మొత్తం ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి