పల్లెటూరి పెద్దమనిషి

ABN , First Publish Date - 2021-04-23T05:32:36+05:30 IST

హైదరాబాద్‌లో మంగళవారం నాడు కన్నుమూసిన ఐజేయూ నేత కోసూరి అమర్‌నాథ్‌ నాకన్నా ఏడెనిమిదేళ్ళు పెద్ద...

పల్లెటూరి పెద్దమనిషి

హైదరాబాద్‌లో మంగళవారం నాడు కన్నుమూసిన ఐజేయూ నేత కోసూరి అమర్‌నాథ్‌ నాకన్నా ఏడెనిమిదేళ్ళు పెద్ద. దాదాపు అర్ధ శతాబ్దంగా అమర్‌నాథ్‌ నాకు తెలిసి వున్నప్పటికీ -బహుశా- వయసులో తేడా కారణంగానే మా మధ్య స్నేహం ఉన్నంతగా చనువుండేది కాదు. ఆయనా నేనూ పుట్టిన ప్రాంతం ఒకటే కానీ, ఆ ప్రాంతంలో ఆయనా ఎక్కువకాలం లేడు- నేనూ లేను! ఇద్దరం పొట్టతిప్పల కోసం దేశాలు పట్టి పోయినవాళ్ళమే. నేను కొంతకాలం హైదరాబాద్‌, మద్రాసు మహానగరాల్లో గడిపినట్లే, అమర్‌నాథ్‌ ఆరేళ్ళపాటు ఢిల్లీలో ఉండవలసివచ్చింది. అయితే అమర్‌నాథ్‌లో ఓ విశిష్టత కొనసాగింది. ఆయన ఎక్కడున్నా గోదావరిజిల్లా పల్లెటూరి పెద్దమనిషి పలుకుబడి వదులుకోలేదు. అమర్‌నాథ్‌ జర్నలిజంలో ప్రవేశించడంలో నా ప్రమేయం కొంత ఉన్నప్పటికీ, మేం కలిసి పనిచేసింది చాలా తక్కువ; రెండు మూడేళ్ళకు మించదు! అయితే, మా రెండు కుటుంబాల మధ్యా స్నేహ సంబంధాలు దశాబ్దాలుగా ఉంటూవచ్చాయి. 


1962లో సీపీఐ ఎమ్మెల్యేగా అత్తిలి నియోజకవర్గం నుంచి గెలిచిన ఎస్‌.ఆర్‌.దాట్ల అమర్‌నాథ్‌కి బంధువు. అందరితోనూ ‘అతి’ చనువుగా అల్లుకుపోయే అమర్‌నాథ్‌కి విద్యార్థి దశ నుంచీ వామపక్ష రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. అది చివరివరకూ కొనసాగింది. అలాగే, ఆయనకి జర్నలిజం మీద కూడా ఆసక్తి ఉండేది. ముఖ్యంగా రూసీ కరంజియా సంపాదకత్వంలో వచ్చిన ‘‘బ్లిట్జ్‌’’ అమర్‌నాథ్‌ అభిమాన పత్రిక. అందులో ఖ్వాజా అహమద్‌ అబ్బాస్‌ నిర్వహించిన ‘‘లాస్ట్‌ పేజ్‌’’ శీర్షిక అంటే మరీ అభిమానం. బ్లిట్జ్‌లో వచ్చే ‘వాక్స్‌ పాప్యులీ’ అనే శీర్షికకు అమర్‌నాథ్‌ అప్పుడప్పుడు రాస్తూవుండేవారు. పత్రికల్లో చేరిన రెండు మూడేళ్ళకే ఎడిషన్‌ ఇన్‌ఛార్జి లాంటి బాధ్యతలు తీసుకుని సమర్ధంగా పనిచేసినా అమర్‌నాథ్‌కు జర్నలిస్టుగా కన్నా యూనియనిస్టుగానే ఎక్కువ పేరుండేది. 


యాభయ్యేళ్ళ పరిచయం ఆధారంగా ఒక్కమాట చెప్పాలనుకుంటున్నాను. అమర్‌నాథ్‌లాంటి మనుషుల్ని అర్థం చేసుకోవడం కష్టం. ఆయన తెలుగు పచ్చి నాటుపురంగా అనిపిస్తుంది. ఆయన మాటాడే ఇంగ్లిష్‌ స్టైలిష్‌గా వినిపిస్తుంది. ఆయన వయసు, ఉన్నదానికి పదేళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది. మన మంచీచెడూ విచారించడమే తప్ప, తన సాధకబాధకాలు చెప్పుకునే అలవాటు అమర్‌నాథ్‌కి ఎప్పుడూ లేదు. ఏదో జాక్‌పాట్‌ ఎక్కడో మిస్సయిపోయిన మొహంపెట్టుకు తిరగడం నేనెప్పుడూ చూళ్ళేదు. స్కూలు పిల్లల్లో కనిపించే అకారణమయిన అత్యుత్సాహం ఏదో అమర్‌నాథ్‌లో పెల్లుబికేది. మనుషుల్ని బేషరతుగా ప్రేమించడం కష్టం. కానీ, అమర్‌నాథ్‌ అది అలవోకగా చేసేవారు. అదే అతని స్వభావం అనిపిస్తుంది!!

మందలపర్తి కిశోర్‌

Updated Date - 2021-04-23T05:32:36+05:30 IST