క్షమాగుణం

ABN , First Publish Date - 2021-06-11T05:40:48+05:30 IST

క్షమాగుణం‘‘ఓ విశ్వాసుల నాయకుడా! ఇతను మా తండ్రిని హత్య చేశాడు. మీరు ఇతనికి మరణశిక్ష విధించాలి’’ అని కోరారు..

క్షమాగుణం

క్షమాగుణం‘‘ఓ విశ్వాసుల నాయకుడా! ఇతను మా తండ్రిని హత్య చేశాడు. మీరు ఇతనికి మరణశిక్ష విధించాలి’’ అని కోరారు.

‘‘వీళ్ళ తండ్రిని ఎందుకు చంపావు?’’ అని ఆ యువకుణ్ణి ఉమర్‌ ప్రశ్నించారు.

‘‘నేనొక ఒంటెల కాపరిని. అనుకోకుండా నా ఒంటె ఒకటి వాళ్ళ పొలంలో మేసింది. అది చూసిన వీళ్ళ తండ్రి ఒక పెద్ద రాయి తీసి, దాని మీదకు విసిరాడు. ఆ రాయి ఒంటె కంటికి తగిలింది. అది బాధతో విలవిలలాడింది. నేను కోపంతో అదే రాయి తీసి, వాళ్ళ తండ్రి మీదకు విసిరాను. అది అతడి తలపై తగిలి అక్కడికక్కడే మరణించాడు’’ అని చెప్పాడతను.

‘‘అయితే నేను కూడా నీకు అదే శిక్ష విధిస్తాను’’ అన్నారు ఉమర్‌. 

యువకుడు కంగారుగా ‘‘ఓ నాయకా! మా నాన్న చనిపోతూ నాకు కొంత ఆస్తిని ఇచ్చాడు. నాకు ఒక చెల్లెలు ఉంది. ఆమె బాధ్యత నా మీద ఉంది. మీరు ఇప్పుడే నన్ను చంపేస్తే... నా ఆస్తికీ, చెల్లెలికీ రక్షణ ఉండదు. అందుకే దయచేసి నాకు మూడు రోజులు గడువు ఇప్పించండి. నా చెల్లెలి రక్షణ కోసం తగిన ఏర్పాట్లు చేసి వెంటనే తిరిగి వస్తాను అన్నాడు.

‘‘మరి నీకు పూచీకత్తు ఎవరుంటారు?’’ అని అడిగారు ఉమర్‌. 

ఆ యువకుడు అక్కడ గుమిగూడి ఉన్న ప్రజలందరినీ చూశాడు. అందరూ తల వంచుకున్నారు. ఎవరూ స్పందించలేదు. ఆ యువకుడు నిరాశ చెందుతున్న సమయంలో.... ఒక చెయ్యి పైకి లేచింది. అది ధార్మికుడైన హజ్రత్‌ అబూజర్‌ గిఫారీది.

‘‘ఇతనికి పూచీగా ఉంటావా అబూజర్‌...?’’ అని ఉమర్‌ అడిగారు. 

‘‘ఉంటాను నాయకా!’’ అన్నారు అబూజర్‌.

ముక్కూ మొహం తెలియని వాడికి పూచీగా ఉంటావా? అతను తిరిగి రాకపోతే ఆ శిక్ష నీకు పడుతుంది, తెలుసుగా? అన్నారు ఉమర్‌.

‘‘నాకు సమ్మతమే నాయకా’’ అని అబూజర్‌ బదులిచ్చారు.

రెండు రోజులు గడచిపోయాయి. మూడో రోజు సాయంత్రం కావస్తోంది. ఆ యువకుడి జాడలేదు. అతను తిరిగి రాకపోతే అబూజర్‌ మరణశిక్షను అనుభవించాల్సి ఉంటుందని అందరూ భయపడసాగారు.

సూర్యాస్తమయానికి ముందు ఆ యువకుడు సభకు చేరుకున్నాడు. బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్న అతను ఉమర్‌ను ఉద్దేశిస్తూ ‘‘ఓ నాయకా! నా ఆస్తి బాధ్యతనూ, నా చెల్లెలి సంరక్షణనూ మా మామయ్యకు అప్పగించాను. ఇక మీరు నాకు శిక్ష విధించవచ్చు’’ అన్నాడు.

‘‘శిక్ష నుంచి పారిపోయే అవకాశం ఉన్నా ఎందుకు తిరిగి వచ్చావు?’’ అని అడిగారు ఉమర్‌.

‘‘చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకొనే సమర్థతను ముస్లింలు కోల్పోయారని అందరూ అనుకుంటారని భయం వేసింది. అందుకే వచ్చాను’’ అన్నాడు.

‘‘అసలు నువ్వెందుకు అతనికి పూచీగా ఉన్నావు?’’ అని అబూజర్‌ను ఉమర్‌ ప్రశ్నించారు.

‘‘ఆపదలో ఉన్న సాటి ముస్లిం చెయ్యి చాచి సాయం అడిగితే, అతడికి మేలు చేసే గుణాన్ని ముస్లింలు కోల్పోయారని లోకానికి అనిపిస్తుందని భయం వేసింది. అందుకే అతనికి పూచీగా ఉన్నాను’’ అని చెప్పారు అబూజర్‌.

ఆ యువకుడిపై హత్యానేరం మోపిన వ్యక్తులు అప్పటివరకూ జరుగుతున్నది గమనిస్తున్నారు. వారు ముందుకు వచ్చి ‘‘ఓ నాయకా! ఈ యువకుడిని మేం క్షమిస్తున్నాం. దయచేసి అతణ్ణి శిక్ష్షించకండి’’ అని వేడుకున్నారు.

వారి మాటలు విన్న ఉమర్‌కు ఆశ్చర్యం కలిగింది. ‘‘అదేమిటి? అతణ్ణి ఎందుకు క్షమిస్తున్నారు?’’ అని అడిగారు.

‘‘ముస్లింల హృదయాల్లో క్షమాగుణం తుడిచిపెట్టుకుపోయిందన్న నింద వస్తుందని భయం వేస్తోంది. అందుకే అతణ్ణి క్షమిస్తున్నాం’’ అన్నారు ఆ వ్యక్తులు.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-06-11T05:40:48+05:30 IST