యుద్ధం మొదలైంది..

ABN , First Publish Date - 2022-05-29T07:43:10+05:30 IST

యుద్ధం మొదలైంది..

యుద్ధం మొదలైంది..

ఎన్నికలు ఎప్పుడొచ్చినా  వైసీపీకి శాశ్వత సమాధి

ఇక వీరోచిత పోరాటం.. అరాచక పాలనకు అంతం!

గాడి తప్పిన రాష్ట్రాన్ని దారిలో పెడతాను

8 లక్షల కోట్లు అప్పు చేసిన వైసీపీ సర్కార్‌

మోసపూరిత సంక్షేమం.. ఇంటిపై లక్ష భారం

‘మహా’ సందోహంతో జగన్‌కు నిద్ర పట్టదు

బుల్లెట్‌లా దూసుకెళతాం.. తగ్గేదేలేదు: బాబు


వైసీపీకి శాశ్వత సమాధి

1.75 లక్షల కోట్లు.. మూడేళ్లలో  జగన్‌ అక్రమార్జన ఇది

మింగిన అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తా

మద్యం నుంచే ఏటా రూ.5 వేల కోట్లు జగన్‌కు

ఒక్క క్వార్టర్‌ బాటిల్‌పై రూ.12 ‘జే-ట్యాక్స్‌’

భారతీ సిమెంట్‌కు రోజుకు 500 లారీల లేటరైట్‌

మహానాడు బహిరంగ సభలో బాబు గర్జన


మహానాడు బహిరంగ సభకు భారీగా తరలొచ్చిన జనం. 

ఎన్టీఆర్‌కు చంద్రబాబు పుష్పాంజలి


‘‘రాష్ట్రానికి జగన్‌ ఒక అరిష్టం. ఆయనది ఐరన్‌ లెగ్‌. అడుగు పెడితే మటాష్‌! రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత 5 కోట్ల మంది ప్రజలది! అరాచక పాలనపై యుద్ధం ప్రకటించాం. వీరోచితంగా పోరాడండి. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తా’’  - చంద్రబాబు


(ఒంగోలు - ఆంధ్రజ్యోతి)

వైసీపీ సర్కారుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ‘యుద్ధం’ ప్రకటించారు. ఆ పార్టీని భూస్థాపితం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఒంగోలులో శనివారం మహానాడు ముగింపు  సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో జగన్‌ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదీ వైసీపీ అవినీతి, అక్రమాల, దౌర్జన్యాలు, దారుణాల చిట్టా అంటూ లెక్క చెప్పారు. జగన్‌ మింగిన అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తామని ప్రకటించారు. మూడేళ్లలో జగన్‌ అక్రమార్జన రూ.1.75 లక్షల కోట్లు అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘బాదుడే బాదుడు అంటూ అన్ని పన్నులు, చార్జీలు పెంచారు. ఏకంగా రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆ సొమ్ముతో ఏం చేశారు? మూడేళ్లలో జగన్‌ ఖజానాకు  రూ.1.75 లక్షల కోట్లు వచ్చి చేరాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకవైపు ప్రజలను బాదుతూ... మరోవైపు భావితరాలకు ఉపయోగపడాల్సిన వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘ఏజెన్సీ నుంచి రోజుకు 500 లారీల లేటరైట్‌ ఖనిజం భారతీ సిమెంట్‌ ఫ్యాక్టరీకి వెళుతోంది. కానీ... సిమెంట్‌ ధర మాత్రం తగ్గించలేదు. బాదుడే బాదుడు!’’ అని తెలిపారు. ఒక్క మద్యం నుంచే జగన్‌ ఏటా రూ.5వేల కోట్లు దోచుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. ‘‘క్వార్టర్‌ బాటిల్‌ మద్యానికి తయారీదారులకు ఒకప్పుడు రూ.9 చెల్లించేవాళ్లు. ఇప్పుడు దానిని రూ.22కు పెంచారు. అవన్నీ సొంత బ్రాండ్లే.  ప్రతి క్వార్టర్‌ బాటిల్‌పై  జగన్‌కు 12 రూపాయలు పోతున్నాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ అప్పులు పెరిగాయి. ప్రజల ఆదాయం తగ్గింది. జగన్‌తోపాటు ఆయన అనుయాయుల సంపద మాత్రం పెరిగింది. ఈ దోపిడీని, అక్రమాలను అడ్డుకుని తీరతాం’’ అని తేల్చి చెప్పారు. మధ్యంతర ఎన్నికలు వస్తే... ఈ శనిని ముందే వదిలించుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీకి శాశ్వత సమాధి తథ్యమని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని ఈ స్థాయిలో పతనం చేసిన జగన్‌ సర్కారును ప్రజలు క్షమించరని అన్నారు. చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 


అన్నీ కబ్జా చేశారు...

టీడీపీ హయాంలో ఇసుక రూ.600. ఇప్పుడు అది ఆరు వేలకు చేరింది. రాష్ట్రంలోని ఖనిజ సంపద మొత్తం చెరపట్టారు. గనులన్నీ హస్తగతం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో గెలాక్సీ గ్రానైట్‌ గనులను బెదిరించి, సెటిల్‌మెంట్లు చేసి లాగేసుకున్నారు. ఇంటి స్థలాల కోసం ఐదారు లక్షల విలువ ఉండే భూమిని కోటికి కొని... డబ్బులు తినేశారు. భూముల రికార్డులను ఆన్‌లైన్‌లో మార్చేసి.. వెంటనే అమ్ముకుంటున్నారు. కడప జిల్లా బద్వేలులోనే 800 ఎకరాలు కబ్జా చేసి రికార్డులు మార్చేశారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.  గూగుల్‌ మ్యాప్‌లతో అన్నీ పరిశీలిస్తా! అవినీతి  సొమ్ము కక్కిస్తా! 


రైతన్నలారా... ఈ సర్కారుకు ఉరి వేయండి

జగన్‌ విధ్వంసానికి అంతా నాశనమైపోతోంది. రైతుల్లోనూ ఆనందం లేదు. ఎన్టీఆర్‌ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు తీసేస్తే... జగన్‌ మళ్లీ పెడుతున్నారు. రైతులు ఇందుకు అంగీకరిస్తారా? ధాన్యం కొన్నారా? ఆ డబ్బులు వచ్చాయా? రైతులు కష్టాలకు బాధపడి, భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. వైసీపీ సర్కారుకు ఉరేసి.. బంగాళాఖాతంలో కలిపేయాలి. 


సోషల్‌ మీడియాకు పదును

కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి తొత్తులుగా తయారవుతున్నాయి. మీరు వేయకపోయినా... మాకు సోషల్‌ మీడియా ఉంది. మహానాడుకు వచ్చిన స్పందన బ్లూ మీడియాకు కనపడదు. టీడీపీ అభిమానులంతా... సెల్‌ఫోన్‌కు పదును పెట్టండి. సోషల్‌ మీడియాను ఉపయోగించండి. కేసులకు భయపడొద్దు. ఎవరిపైన కేసు పెట్టినా కాపాడుకుంటాం. అవసరమైతే నేనే ఉద్యమానికి నాయకత్వం వహిస్తాను. 


ఇది ఐదుకోట్ల మంది మాట... 

ఎన్నో మహానాడు కార్యక్రమాలు చూశాను.  వందల బహిరంగ సభల్లో ప్రసంగించాను. కానీ... ఇంత చైతన్యం, కసి, పట్టుదల ఎప్పుడూ కనిపించలేదు. ఈ రాష్ట్రాన్ని ఉన్మాదిపాలన నుంచి తప్పించేందుకు ‘నేను సైతం’ అంటూ తరలి వచ్చారు. క్విట్‌ జగన్‌... సేవ్‌ ఏపీ!... అని మహానాడులో పిలుపునిచ్చాను. ఇది రాష్ట్రంలోని మొత్తం ఐదుకోట్ల మంది ప్రజల అభిమతం. ఈ జన సందోహం చూసి జగన్‌కు పిచ్చెక్కుతుంది. ఆయనకు ఇంక నిద్ర రాదు. బస్సులు నిలిపేస్తే మహానాడుకు ఎవరూ రారనుకున్నారు. ఇబ్బందులు పెడితే భయపడతామనుకున్నారు. కానీ... వాళ్ల మీటింగ్‌లు వెలవెల, మన మీటింగులు కళకళ!


ఎన్టీఆర్‌ స్ఫూర్తితో...

ఎన్టీఆర్‌లాంటి యుగపురుషుడు గతంలో లేరు. ఇకపైనా ఉండరు. ఆయన... ఒకే ఒక్కరు. రాముడుగా, కృష్ణుడుగా, వెంకటేశ్వరస్వామిగా.. మొత్తంగా దేవుడు ఎలా ఉన్నాడో చూడాలంటే, ఎన్టీఆర్‌ రూపాన్ని చూస్తున్నాం. ఆ మహా నాయకుడి జయంతి వేడుకలను ఏడాదిపాటు జరుపుకొంటున్నాం. ఈ సంవత్సరమంతా పార్టీపరంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. దీనిపై ప్రత్యేక కమిటీ వేస్తాం. ప్రతి జిల్లాలో ‘మినీ మహానాడు’ పెట్టి... ఈ అవినీతి సర్కారును ఎండగడతాం. 


పేర్లు మార్చినా వారికి ‘ఫ్లాపులే’

టీడీపీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం చేపట్టింది. దీనికి పోటీగా... ‘గడపగడపకూ వైసీపీ’ ప్రోగ్రాం పెట్టారు. ప్రజలు వీళ్లకు ‘బాదుడే బాదుడు’ చూపిస్తారని భయపడ్డారు. పోలీసులతోసహా వెళ్లేందుకు ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ అన్నా రు. అయినా... నిరసనలు ఆగలేదు. ఇప్పుడు... బస్సు యాత్ర పెట్టారు. దానికి కూడా ఖాళీ కుర్చీలే. రేపు గాలి యాత్ర పెట్టి... గాలిలో తిరుగుతారు. గాలి మనుషులు, గాలి పార్టీ!


మీటర్లకు ఒప్పుకోవద్దు...

పవర్‌ ప్రాజెక్టులన్నీ పోయాయి. పరిశ్రమలు పోయాయి. ఇప్పుడు అన్నీ కష్టాలే. ఇది... జగన్‌ అవినీతి, అసమర్థత ఫలితమే. చివరికి... అప్పులు తెచ్చుకునేందుకు పంపుసెట్లకు మీటర్లు పెడతామంటున్నారు. రైతులు దీనికి ఒప్పుకోవద్దు. మీటర్లకు వ్యతిరేకంగా పోరాడండి. మేం అండగా ఉంటాం. టీడీపీ కట్టిన ఇళ్లకు ‘ఓటీఎస్‌’ వసూలు చేయాలనుకున్నారు. ఓటీఎస్‌... కట్టొద్దని పిలుపునిచ్చాను. 


ఇదేం సంక్షేమం...

‘బాదుడే బాదుడు’తో ఒక్కో కుటుంబంపై ఏడాదికి రూ.లక్ష భారం మోపారు. మోసపూరిత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. సంక్షేమానికి నాంది పలికింది ఎన్టీఆర్‌. రెండు రూపాయలకు కిలో బియ్యం, పక్కా ఇల్లు, మోటార్లకు మీటర్ల తొలగింపు... ఇవన్నీ ఎన్టీఆర్‌ చేశారు. అన్నా క్యాంటీన్లు, విదేశీ విద్య, రంజాన్‌ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్‌ కానుక, చంద్రన్నబీమా, నిరుద్యోగ భృతి... ఇవన్నీ ఇప్పుడున్నాయా? చదువుకునే పిల్లలకు స్కాలర్‌షి్‌పలు కూడా ఇవ్వడంలేదు. సంక్షేమం అంటే టీడీపీయే. రాష్ట్ర ఆదాయంలో 53 శాతం సంక్షేమానికి ఖర్చుపెట్టాం. ఇప్పుడు 41శాతానికి తగ్గించారు. సంక్షేమం ముసుగులో దోపిడీ చేస్తున్నారు. 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇది తిరిగి చెల్లించాల్సింది ప్రజలే. దీనికోసం తిండి గింజలమీద కూడా బాదుడే బాదుడు వేస్తారు. ఇప్పుడే ఇలా ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించండి. సంక్షేమం పేరుతో ఇచ్చేది గోరంత. ప్రచారం కొండంత. అది కూడా సాక్షి పేపర్‌కే ప్రకటనలు ఇస్తారు. అక్కడా దోపిడీనే.


అన్ని వర్గాలకూ అన్యాయం!

బీసీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. వేదికపై ఉన్న వారంతా ప్రజలకు, పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్నారు. కానీ... వైసీపీలో వెనుకబడిన వర్గాల నేతలు బానిసల్లా నాయకులకు సేవ చేసే పరిస్థితి.

బీసీలకు సబ్‌ ప్లాన్‌ లేదు. ఆదరణ లేదు. 

ఎస్సీలకు సంబంధించిన 29 ప్రత్యేక పథకాలు రద్దు చేశారు. 

ఎస్టీలకు ఇబ్బందులే. మైనారిటీలకు కష్టాలే. వారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసేశారు. 


ఇది ‘వీరబాదుడు’...

తెలుగుదేశం హయాంలో ఎప్పుడూ కరెంటు చార్జీలు పెరగలేదు. ఇప్పుడు... ఏప్రిల్‌లో వచ్చిన బిల్లు మేలో డబుల్‌ అయ్యింది. ఇది మామూలు బాదుడు కాదు... వీర బాదుడు! దేశంలోనే పెట్రోలు, డీజిలు ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువ. నేను ‘దీపం’ కింద వంటగ్యాస్‌ ఇస్తే... రేట్లు పెంచి ఆ దీపం ఆర్పేస్తున్నారు. నిత్యావసరాలు కొనే పరిస్థితి లేదు. అన్నింటి ధరలు పెరిగాయి.  రాష్ట్రం రేపో ఎల్లుండో శ్రీలంక దారిలో పోతుందని అందుకే చెప్పాను. మనం దీనిని చూస్తూ ఊరుకుందామా? ఈ సమస్యకు పరిష్కారం... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే. మేం ప్రజలకోసం పోరాడుతుంటే... వైసీపీ నేతలు మాపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా భయపడేది లేదు. బుల్లెట్‌లా దూసుకెళతాం తప్ప, వెనక్కి తిరగం. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి చూద్దాం. ఎంత ఇబ్బంది పెడితే అంత రాటుతేలిపోయాం. 


ఇదేనా పాలన?

రాష్ట్ర విభజన వల్ల జరిగిన అన్యాయం కంటే, కరోనా కంటే ఎక్కువ నష్టం జగన్‌ పాలన వల్ల జరిగింది.

ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ ‘అమ్మ ఒడి’ అన్నారు. కానీ... ఒక్కరికే పరిమితం చేశారు. దానిపైనా అనేక ఆంక్షలు. ‘నాన్న బుడ్డీ’ మాత్రం భద్రంగా ఉంటుంది.

ఉద్యోగులకు సరైన పీఆర్సీ ఇచ్చారా? సీపీఎస్‌ రద్దు చేశారా? డీఏలైనా సరిగా ఇస్తున్నారా? ఉద్యోగులు పోరాడి... మళ్లీ వెనక్కి తగ్గారు. భయం వద్దు. మేం అండగా ఉంటాం. న్యాయం చేస్తాం.

ఇసుక లేదు. సిమెంట్‌, స్టీల్‌ ధరలు పెరిగాయి. భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేవు.

30 లక్షల ఇల్లు కడతామని చెప్పి... 3 కట్టారు. ఇదీ జగన్‌ పనితనం.

అమరావతిని అటకెక్కించడంతో రూ.2లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మన పిల్లల భవిష్యత్తు అంధకారమైపోయింది.

పోలవరం కూడా పూర్తి చేయలేకపోయారు. అది పూర్తవుతుందనే నమ్మకం కూడా లేకుండా పోయింది.

జిల్లాలను పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయలేదు. ప్రకాశం  జిల్లాలోనే అనేక లోటుపాట్లు ఉన్నాయి. అధికారంలోకి రాగానే దీనిని సరిదిద్దుతాం.


అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేసే ధైర్యముందా?

జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి ప్రమేయం ఉన్నట్లు డ్రైవర్‌ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. వారిని అరెస్టు చేసే ధైర్యం జగన్‌కు ఉందా? మా మీద తప్పుడు కేసులు పెట్టడం కాదు! రోషముంటే మీ బాబాయ్‌ని హత్యచేసిన వారిని అరెస్టు చెయ్యాలి. ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడారు. ఆ తర్వాత దానిని మరిచిపోయారు.


ఉద్యోగాలు ఏమిచ్చారు?

మేం ఐటీ ఉద్యోగాలు, పోలీసు, టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చాం. జగన్‌ ఇచ్చింది... వలంటీరు ఉద్యోగాలు. నేను ప్రపంచమంతా తిరిగి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాను. కానీ... జగన్‌ మొన్న దావో్‌సకు వెళ్లి చేసిందేమిటి? తెలుగుదేశం హయాంలో అదానీ, గ్రీన్‌కోతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసి... వాళ్లను  బెదిరించి... లావాదేవీలు కుదిరిన తర్వాత... దావో్‌సకు వెళ్లి మళ్లీ వాళ్లతోనే ఒప్పందాలు చేసుకున్నారు. దీనికోసం దావో్‌సకు వెళ్లాలా? ఈ ముఖ్యమంత్రికి విశ్వసనీయత ఉందా? ఇలాగైతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తారా? లులూ గ్రూప్‌ జగన్‌ తీరుతో విసిగిపోయి... ‘మేం ఏపీలో అడుగు పెట్టం’ అని వెళ్లిపోయింది. 


కేంద్రం ముందు మెడ దించి...

25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. కానీ... ఇప్పుడు కేంద్రం ముందు మెడ దించుతున్నారు. వాళ్ల కాళ్ల మీద పడుతున్నారు. పోలవరాన్ని, రైల్వే జోన్‌ను, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను తాకట్టు పెట్టారు. విభజన చట్టాన్నే మరిచిపోయారు. 


ఇదేనా సామాజిక న్యాయం?

సామాజిక న్యాయం అంటూ కబుర్లు చెబుతున్నారు. కానీ, రాజ్యసభ సభ్యత్వాలు చూస్తే... ఇద్దరు తెలంగాణ వాళ్లకు ఇచ్చారు. వారిలో ఒకరు... ఆయన తరఫున సీబీఐ కేసులు వాదించే న్యాయవాది. లాబీయింగ్‌ చేసే వాళ్లకు ఒకటి ఇచ్చారు. సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి... ఇదేనా మీ సామాజిక న్యాయం.


మద్యం షాపుల్లో ఆన్‌లైన్‌ ఎందుకు లేదు?

కిరాణా షాపుల్లో కూడా ఆన్‌లైన్‌లో డబ్బులు తీసుకుంటున్నారు. కానీ... మద్యం షాపుల్లో ఎందుకు తీసుకోవడంలేదు?వచ్చే డబ్బుల్లో సగం రాష్ట్ర ఖజానాకు, మరో సగం జగన్‌ ఖజానాకు వెళుతున్నాయి. అందుకే ఆన్‌లైన్‌ చెల్లింపుల్లేవు. బిల్లులూ ఇవ్వరు.


పోలీసులకు చురకలు..

‘‘ఒక పోలీసు అత్యుత్సాహంతో కారులోంచి గాలి తీసేస్తున్నాడు. నేను 14 సంవత్సరాలు సీఎంగా ఏం నేర్పించానో పోలీసులు గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ సభా ప్రాంగణంలో ఒక్క పోలీసు కూడా లేరు. మా లా అండ్‌ ఆర్డర్‌ మేమే నిర్వహించుకుంటాం. అదుపు తప్పితే పోలీసులనూ నియంత్రించే శక్తి తెలుగుదేశానికి, తెలుగు సైన్యానికి ఉంది.



Updated Date - 2022-05-29T07:43:10+05:30 IST