రామాంజనేయ బంధం హరిహరాత్మకం

Jun 4 2021 @ 00:00AM

ఆంజనేయస్వామిని తలచుకోగానే సీతారామ లక్ష్మణుల పాదాల వద్ద దాసుని భంగిమలో కూర్చున్న హనుమంతుడే గుర్తుకువస్తాడు. కానీ ఆయన అలసుడు, అబలుడుకాడు. బ్రహ్మ, వాయు, ఇంద్రాది దేవతలు, మహర్షుల మహిమాన్వితమైన వరాలు పొందిన మహాజ్ఞాని, కాలధర్మాలను ఎరిగినవాడు, స్వామి కార్యపరాయణ దక్షుడు, బల పరాక్రమ యోధుడు. అయినా రాముడికి దాసానుదాసుడు. రాముడి సన్నిధిలో ఆయన దాసాంజనేయుడిగా, భక్తాంజనేయుడిగా, రామాంజనేయుడిగా మాత్రమే ఉంటాడు. సమస్త సృష్టిని నిర్వహించే నారాయణుడికే సాయం చేసేంత గొప్ప స్థాయి ఆంజనేయుడికి దక్కిందంటే... ఆయనలో ఉన్న శివాంశే అందుకు కారణం. 


  • నేడు హనుమజ్జయంతి


రామాంజనేయుల బంధం భక్తుడు, భగవంతుడికి ఉండే సామాన్య సంబంధం కాదు. ఇద్దరు సమ ఉజ్జీల మధ్య నడిచిన అనుబంధం. సేవలందుకునే రాముడు, సేవించుకునే హనుమంతుడు ఇద్దరూ భగవంతులే. నరత్వం ఒకరిది. వానరత్వం ఇంకొకరిది. రాముడు మర్యాదా పురుషోత్తముడైతే హనుమంతుడు బుద్ధిమంతులలో వరిష్ఠుడు. చిటికలో వ్యూహాలు అల్లగల చతురుడు రాముడు. చిట్కా చెప్పి చిటికేస్తే ఎలాంటి ఘనకార్యాలనైనా క్షణాలలో సాధించుకు రాగల కార్యధురీణుడు హనుమంతుడు. తండ్రి మాటకు కట్టుబడినవాడు రాముడు, రాముడి మాటకు కట్టుబడినవాడు హనుమంతుడు. శివుని విల్లు ఎక్కు పెట్టినవాడు రాముడు. శివుని మనసు తెలిసి మసలుకునేవాడు హనుమంతుడు. రాముడు సూర్యవంశజుడు. హనుమంతుడు సూర్యుని అనుంగు శిష్యుడు. సూర్యుని ముఖతః వేదవేదాంగాలు, సర్వశాస్త్రాలు ఉపదేశం పొందినవాడు ఆంజనేయుడు. రామకార్య నిర్వహణే జన్మకారణమైనవాడు, అదే గురుదక్షిణగా సమర్పించుకోవాల్సినవాడు హనుమంతుడు. రాముని మనసెరిగి మసలుకునే గొప్ప బంటు హనుమంతుడు. హనుమ మనసులో కొలువుండి హృదయస్ట్రుడిగా దర్శనమిచ్చే భగవానుడు రాముడు. ‘శివస్య హృదయం విష్ణోః విష్ణ్యస్థ హృదయం శివః’ అన్నమాటకు ఈ అనుబంధం రూపుకట్టినట్టుగా ఉంటుంది. సరిసమాన స్థాయిలో ఉండే హరిహరులే మానవాళికి స్వామి అనే వాడు ఎలా ఉండాలి? భక్తుడు ఎలా ఉండాలి? ఆ మర్యాదలు, మన్ననలు ఎలా ఉండాలో తెలియజేయడమే పరమ ప్రయోజనంగా ఈ ఇద్దరూ అవతారాలు స్వీకరించారు. 


ఆయన కథే సుందరం

రాముడికీ హనుమంతుడికీ తొలి పరిచయం ‘రామాయణం’లోని ‘కిష్కింధకాండ’లో కలుగుతుంది. మొదటి పరిచయంలోనే వారి మధ్య చెలిమి ఏర్పడింది.. విడదీయలేనంతగా బలపడింది. హనుమ స్వామి భక్తి, బల పరాక్రమాలు తేటతెల్లమైయింది మాత్రం ‘సుందరకాండ’లోనే. ఆయన విలయ కాండను, వీరోచిత కాండను సవివరంగా చెప్పే ఈ ‘సుందరకాండ’ను ‘హనుమత్కాండ’ అన్నా అతిశయోక్తి కాదు. ఈ కాండకు కథానాయకుడు హనుమంతుడు. హనుమ స్వామిభక్తి పరాయణత్వం, హనుమద్విజయాలు ఎంతో సుందరంగా వర్ణించడం చేత ఈ కాండ మహామహిమాన్వితంగా మారిపోయింది. విడిగా పారాయణ గ్రంథమైంది. అంతేకాదు, పుంజిక స్థల అనే అప్సరస కడుపున పుట్టినందున హనుమ సుందరుడయ్యాడు. అంజనీదేవి ఆంజనేయుని తల్లి అని లోకానికి తెలిసినా ఆయన పూర్వనేపథ్యం స్ఫురించేలా ఈ కాండకు ‘సుందరకాండ’ అని పేరుపెట్టడం ద్వారా... హనుమను సాధారణ వానరంగా కాకుండా దైవాంశ గలవాడిగా చూపించడానికే వాల్మీకి ఇష్టపడ్డాడని స్పష్టంగా అర్థమవుతుంది. శివుడు వెండికొండ. ఆంజనేయుడు బంగారు కొండ. రాముడికి సుగ్రీవ, విభీషణ, అంగద, జాంబవంత వంటి స్నేహపూర్వక భక్తులు ఎందరో ఉన్నా వారెవ్వరికీ విడిగా ఒక కాండగా రామాయణంలో చోటు దక్కించుకునే భాగ్యం లేకపోయింది. వారి చరిత్రలేవీ పారాయణార్హతను సాధించలేకపోయాయి. 


భగవంతుడి కష్టం తీర్చిన భక్తుడు

సుందరకాండలో శ్రీరాముడు కర్తగానూ సీతాదేవి కర్మగాను, హనుమంతుడు క్రియగానూ కనబడతారు. గుణ, గణ, శౌర్య, పరాక్రమ, ప్రతాప, దైవాంశ వంటి విశేషాలు ఎన్ని ఉన్నా ఎన్నడూ గర్వించనివాడు. ఒకరికి మంత్రిగా, మరొకరికి పాద దాసుడిగానే ఉండిపోయాడు. సాధారణంగా భక్తుడు భగవంతుని ప్రీతికోసమో, తన స్వార్థం కోసమో పూజలు, స్తుతులు, స్తోత్రాలు, కీర్తనలు చేస్తాడు. ఆ భజనలు, దండకాలు అతనికి సంతృప్తినిస్తాయేమోకానీ భగవంతునికి, భగవత్కార్యానికి ఏమాత్రం ఉపయోగపడవు. కానీ హనుమ తిరుగులేని భక్తి ప్రపత్తులు, చేసిన సేవలు భగవంతుడైన శ్రీరామునికి ఎంతగానో ఉపకరించాయి. తీర్చుకోలేని రుణపాశంలో పడవేశాయి. దానికి ప్రతిగా తన సోదరులతో సమానమైన స్థాయిని, ఆలింగన భాగ్యాన్ని కలిగించాడు రాముడు. అంతటితో ఆగక చిరంజీవిగా ఉండమని, నవమబ్రహ్మగా వెలుగొందమని ఆశీర్వదించాడు. అదెలా..? ఎక్కడైనా భగవంతుడు భక్తుడికి సాయపడడం, వరాలు ఇవ్వడం ఉంటాయి. భగవంతుని ముందు భక్తుడు ఎప్పుడూ నిమిత్తమాత్రుడే కదా! అలాంటప్పుడు భక్తుడు భగవంతుడికి సాయపడడమేమిటి? అందునా, దేవుడే రుణపడిపోయేంత గొప్పగా ఒక భక్తుడు సాయం చేయగలడా? ఒక్క ఆంజనేయుడు మాత్రమే చేయగలడు. నారాయణుడు ఒక మామూలు మానవుడిగా, రాముడిగా ఉన్నాడు. సమస్త సృష్టిని నిర్వహించే నారాయణుడికే సాయం చేసేంత గొప్ప స్థాయి ఆంజనేయుడికి దక్కిందంటే... ఆయనలో ఉన్న శివాంశే అందుకు కారణం. హనుమంతుడికి రాముడంటే పిచ్చి ప్రేమ... అంటే పరమ ప్రేమ. ఆ పరమ ప్రేమే ‘భక్తి’ అని నారదభక్తి సూత్రాలు చెబుతున్నాయి. పరమ ప్రేమవల్లే హనుమ రాముని తన గుండెల్లో దాచుకున్నాడు. గుడికట్టి ఆరాధించుకున్నాడు. ఈ విధంగా రామాంజనేయం హరిహరాత్మకమైంది. హనుమంతుడిలోని శివాంశ వల్లే సురస, సింహిక, రావణుని సోదరి క్రౌంచిని, లంఖిని వంటి రాక్షసులను అవలీలగా వధించాడు. ఒక్క అంగలో సముద్రం దాటి ఏకాంగ వీరుడయ్యాడు. అయినా బలం చాలని ఇతర వానరుల కోసం, వృద్ధులైన వీరుల కోసం సముద్రానికి వారధి కట్టాడు. సంజీవని తెచ్చాడు. పాతాళంలో ఇరుక్కుపోయిన రామలక్ష్మణులను పంచముఖ ఆంజనేయుడిగా బయటకు తెచ్చాడు. 

- నూతి శివానందం

9247171906


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.