ఇదేం ‘తీరు’వా?

ABN , First Publish Date - 2022-05-21T06:02:17+05:30 IST

పొలాలకు నీరు పారదు.. అయినా నీటి తీరువా కట్టాలంట. కాలువలు పూడిపోయాయి.. అయినా బకాయి చెల్లించాలంట. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. పాత బకాయిలు కూడా చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో చెరువులు, రిజర్వాయర్ల నిర్వహణ చాలా అధ్వానంగా ఉంది. ఈ నీటి వనరుల కింద పంట కాలువల్లో చాలా వరకు రూపు కోల్పోయాయి. అయినా నీటి తీరువా చెల్లించాల్సిందేనని ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోంది.

ఇదేం ‘తీరు’వా?

జిల్లాలో నీటితీరువా బకాయి రూ.31.51 కోట్లు
వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
కట్టాల్సిందేనని రైతులకు అధికారుల నోటీసులు
నీరే రాకుంటే ఎలా చెల్లించాలని రైతుల ఆవేదన

 (శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)
పొలాలకు నీరు పారదు.. అయినా నీటి తీరువా కట్టాలంట. కాలువలు పూడిపోయాయి.. అయినా బకాయి చెల్లించాలంట. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. పాత బకాయిలు కూడా చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో చెరువులు, రిజర్వాయర్ల నిర్వహణ చాలా అధ్వానంగా ఉంది. ఈ నీటి వనరుల కింద పంట కాలువల్లో చాలా వరకు రూపు కోల్పోయాయి. అయినా నీటి తీరువా చెల్లించాల్సిందేనని ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోంది. జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది రైతులు ఉండగా.. దాదాపు ఆరు లక్షల ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ఇందులో సాగునీటి కాలువల ద్వారా 3 లక్షల ఎకరాలు, చెరువుల కింద లక్ష ఎకరాలు సాగవుతాయి. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా మరో 50వేల ఎకరాలు ఉన్నాయి. మొత్తమ్మీద 4.5 లక్షల ఎకరాలకు రైతులు ప్రభుత్వానికి నీటితీరువా చెల్లించాల్సి ఉంది. ఈ కేటగిరీ కింద ఖరీఫ్‌, రబీ సీజన్లలో పంటలు సాగు చేసే రైతులు ఎకరాకు సగటున రూ.200 చెల్లించాలి. ఆరుతడి పంటలకు మాత్రం రూ.వంద చెల్లించాలి.

రూ.29.77 కోట్లు కట్టాలంట
జిల్లా నుంచి వసూలు కావాల్సిన నీటి తీరువా బకాయి రూ.31,51,79,000 ఉంది. ఇప్పటి వరకు రూ.1,74,72,000 వసూలైంది. నరసన్నపేట మండలం నుంచి నీటితీరువా రూ.3.81కోట్ల బకాయి ఉండగా.. రూ.1.04 లక్షలు వసూలైంది. అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా ఇంకా రూ.29.77 కోట్లు వసూలు కావాల్సి ఉంది. 2020-21, 2021-22 సంవత్సరాల్లో కొవిడ్‌ వల్ల వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతింది. తొలిఏడాదైతే పంటలు సాగు చేయడమే గగనంగా మారింది. కొద్దోగొప్పో దిగుబడులు వచ్చినా రవాణా సదుపాయాలు, మార్కెట్‌ సౌకర్యాలు లేక 2020లో పూర్తిగా, 2021 తొలి ఆరు నెలలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతేడాది చివరిలో భారీ వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ దుష్పరిణామాల నుంచి జిల్లా రైతాంగం ఇంకా కోలుకోనేలేదు.

- గ్రామాల వారీగా ఏ సంవత్సరం.. ఏ సీజన్లో.. ఎన్ని ఎకరాలు సాగుచేశారు? ఏ పంట వేశారు? ఎంత దిగుబడి వచ్చింది? అన్న వివరాల సక్రమంగా నమోదు చేయడం లేదు. చెరువుల్లో ఏ సీజన్లో ఎంత నీరుంది? ఆయకట్టు రైతులు ఆ నీటిని వినియోగించుకుని పంటలు వేశారా? అన్న వివరాలు కూడా లేవు. దీంతో గ్రామస్థాయిలో వాస్తవ పరిస్థితి ప్రభుత్వ రికార్డులకు ఎక్కడం లేదు. గాలివాటున రెవెన్యూ సిబ్బంది నమోదు చేస్తున్న వివరాలే బకాయిలకు ప్రాతిపదికగా మారుతోంది. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుండడంతో చెరువులు, రిజర్వాయర్ల నీటిని వాడని రైతులకు కూడా రెవెన్యూ అధికారుల నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే జిల్లాలో చాలావరకు చెరువులు, రిజర్వాయర్లు ఏళ్లతరబడి నిర్వహణకు నోచుకోవడంలేదు. పంట కాలువల్లో పూడిక పేరుకుపోయి ఆనవాళ్లే కనిపించని పరిస్థితి. చెరువుల్లో నీరున్నా కాలువల నిర్వహణ లేకపోవడంతో పొలాలకు నీరందడంలేదు. పంటలు సాగు చేశారా? లేదా? అన్నదానితో నిమిత్తం లేకుండా రెవెన్యూ రికార్డుల్లో నీటి తీరువా బకాయిలు పెరిగి పోయాయి. ఇప్పుడు ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటున్న కారణంగా ఈ బకాయిలపై దృష్టి సారించింది. పదేళ్ల బకాయిలను వసూలు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి తెస్తోంది. అసలు కొన్ని ప్రాంతాల్లో సక్రమంగా సాగునీరే అందకపోతే.. పన్నులు ఎలా చెల్లిస్తామని రైతులు ప్రశ్నిస్తున్నారు.

 జిల్లాలో ఇదీ పరిస్థితి...
----------------------------------------------------------------
 రెవెన్యూ డివిజన్‌:     నీటితీరువా బకాయి     వసూలైంది         పెండింగ్‌ :
----------------------------------------------------------------
శ్రీకాకుళం డివిజన్‌    రూ. 17.45 కోట్లు      రూ. 48 లక్షలు    రూ. 16.97 కోట్లు
పలాస డివిజన్‌    రూ. 5.76 కోట్లు     రూ. 51.82 లక్షలు     రూ. 5.24 కోట్లు
టెక్కలి డివిజన్‌    రూ. 8.29 కోట్లు      రూ. 74 లక్షలు     రూ. 7.55 కోట్లు 
---------------------------------------------------------------
 మొత్తం         రూ. 31. 51 కోట్లు      రూ. 1.74 కోట్లు     రూ. 29.77 కోట్లు 
----------------------------------------------------------------

Updated Date - 2022-05-21T06:02:17+05:30 IST