ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం తగదు

ABN , First Publish Date - 2021-05-07T05:22:30+05:30 IST

ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయకుండా ప్రజా సంక్షేమ పాలనను అందించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ హితవు పలికారు.

ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం తగదు
రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌

కూర్మన్నపాలెం, మే 6: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయకుండా ప్రజా సంక్షేమ పాలనను అందించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ హితవు పలికారు. కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 84వ రోజు కూడా కొనసాగాయి.  గురువారం ఈ దీక్షలలో డబ్ల్యూఎండీ, సీఆర్‌ఎంపీ, ఆర్‌ఈడీ, ఎస్‌ఎస్‌డీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరంలో అయోధ్యరామ్‌ మాట్లాడుతూ  కేంద్రం వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ను ఆధీనంలో ఉంచుకుని, ప్రజలకు అందివ్వకుండా వారి ప్రాణాలతో చెలగాటం ఆడటం చాలా హేయమైన చర్యని అన్నారు.  గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉన్న 10.4 శాతాన్ని విక్రయించకుండా తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే దానిలో ఉండే ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి అదానీ గ్రూపు 89.6 శాతం వాటాలను కొనుగోలు చేసిందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అదానీ గ్రూపు కైవసం చేసుకోవాలన్న ఆలోచనల నుంచి పుట్టిందే గంగవరం పోర్టులోని వాటాలు కొనుగోలు అని తీవ్రంగా విమర్శించారు.  ఈ శిబిరంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు డి.ఆదినారాయణ, గంధం వెంకటరావు, కె.సత్యనారాయణ, దాస్‌, తాతారావు, నాగార్జున, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-07T05:22:30+05:30 IST