ఏజెన్సీ రైతులకు అందని సంక్షేమ ఫలాలు

ABN , First Publish Date - 2022-06-28T04:40:30+05:30 IST

ఏజెన్సీ ప్రాంతంలోని రైతులు ఇంకా వ్యవసాయ పనులు మొదలు పెట్టలేదు. చేతిలో చిల్లిగవ్వ లేక తమకున్న పోడు భూములను సాగు చేయని దుస్థితి ఏజెన్సీ రైతులది. గతేడాది వర్షాలు అధికంగా పడడంతో దిగుబడి సరిగా రాలేదు. దీంతో చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక పోయారు.

ఏజెన్సీ రైతులకు అందని సంక్షేమ ఫలాలు

- పట్టాలు, పహాణీలు ఉండవు

- బ్యాంకు రుణాలు ఇవ్వరు

- సాగు పెట్టుబడికి వ్యాపారులే దిక్కు

- వారు కరుణిస్తేనే వ్యవసాయం

- లేదంటే బీడుగా భూములు

- దళిత బంధు వర్తింపజేయాలని వేడుకోలు 

జైనూరు, జూన్‌ 27: ఏజెన్సీ ప్రాంతంలోని రైతులు ఇంకా వ్యవసాయ పనులు మొదలు పెట్టలేదు. చేతిలో చిల్లిగవ్వ లేక తమకున్న పోడు భూములను సాగు చేయని దుస్థితి ఏజెన్సీ రైతులది. గతేడాది వర్షాలు అధికంగా పడడంతో దిగుబడి సరిగా రాలేదు. దీంతో చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక పోయారు. ఈ కారణంగా ఈ ఏడాది అప్పులు ఇచ్చే వారు కరువయ్యారు. ఈ క్రమంలో తమకున్న పోడు భూములను సాగు చేయలేక పోతున్నామని ఏజెన్సీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అప్పులు కావాలని మార్కెట్లో వ్యాపారుల వద్ద ప్రాధేయ పడ్డప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం మూలంగా తమకు పట్టాలు లేవని, పహానీ పత్రాలు కొద్ది సంవత్సరాల నుండి నిలిపివేయడంతో బ్యాంకు రుణాలు పొందలేక పోతున్నామంటున్నారు. దీంతో ప్రభుత్వ సహాయం అందక, అప్పులు లభించక ఉన్న భూములు బీడు భూములుగా మారె దుస్థితి నెలకొందంటున్నారు. ఈ ప్రాంతంలో తాము తాత ముత్తాతల (1950)నుండి గిరిజనులతో కలిసి సహజీవనం గడుపుతున్నామన్నారు. అప్పట్లో తాత ముత్తాతలు చదువు సంధ్యలు లేక, కేవలం కటుంబ పోషణే ధ్యేయంగా కాలం గడుపుతూ పోడు భూములు సాగు చేస్తూ వచ్చారని పేర్కొంటున్నారు. కాలాంతరం ఈప్రాంతం 1970లో షెడ్యుల్‌ ప్రాంతంగా మారిందన్నారు. ఇక చేసేది లేక వ్యవసాయం కోసం ప్రభుత్వ సహాయం అందక అప్పులు చేసుకుంటూ వారసుల మాదిరిగా పోడు భూములపై ఆధార పడుతూ కుటుంబ పోషణ గావిస్తున్నామని వివరిస్తున్నారు. తమ పిల్లలు డిగ్రీలు చదివి ఖాళీగా ఉన్నారని.. ఉద్యోగాలు లేనందున వారు కూలీ పనిపై ఆధారపడి బతుకు బండి లాగుతున్నారన్నారు. అంతో, ఇంతో స్థోమత కలిగిన రైతులు వానాకాలం పంటలు వేసుకుంటున్నారన్నారు. 

ఏజెన్సీ రైతుల జీవనం దుర్భరం

జిల్లాలోని మైదానప్రాంత ఎస్సీలకు పట్టాలు, పహానీలు అందు బాటులో ఉన్నాయి. వారు బ్యాంకు రుణాలు పొందుతూ వ్యవసాయం చేసుకుంటున్నారు. వారికి ప్రభుత్వ పథకాలు రైతు బంధు, రైతు బీమా లాంటివి వర్తిస్తాయి. బడిలో విద్యార్థులకు సీట్లు లభిస్తాయి, హాస్టళ్లలో అక్కడి విద్యార్థులకు అవకాశం ఉంటుంది. కానీ ఏజెన్సీలో ఇవేమి తమకు అందుబాటులో లేవు. ఏజెన్సీలో కేవలం కల్యాణ లక్ష్మి, పింఛన్లు, రేషన్‌బియ్యం వంటి పథకాలు పొందుతున్నామని చెబుతున్నారు. ఎస్సీలు కేవలం కూలీ పనులు చేయడం, నాలాలు, రోడ్లు తవ్వడం, నీటి సరఫరా చేయడం, బట్టలు శుభ్రపర్చడం, పాలేరుగా, జీతగాడిగా ఉండటం వంటి దుర్భర పనులు చేసుకుంటున్నారు.

దళిత బంధు కింద ప్యాకేజీ కేటాయించాలి

ఏజెన్సీ ఎస్సీలకు ప్రభుత్వం దళిత బందు పథకం  కింద  ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వారు అంటున్నారు. ఈ పథకం కింద ఎస్సీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చేందుకు ప్రతి ఎస్సీ గ్రామంలో వంద శాతం దళిత బంధు అమలు చేయాలని, దీంతో చదువుకున్న నిరుద్యోగులు, రైతులకు ఉపాధి లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని ఈ ప్రాంత ఎస్సీ రైతులు, నిరుద్యోగులు కోరుతున్నారు.

Updated Date - 2022-06-28T04:40:30+05:30 IST