‘పడమటిగాలి’ విశ్వతోముఖత్వం

ABN , First Publish Date - 2022-04-16T08:18:58+05:30 IST

ఒకమహాకావ్యం గానీ, నాటకం గానీ శాశ్వతత్వాన్ని పొందాలంటే అది సాంఘిక వాస్తవికతను ప్రతిబింబించాలి; సార్వజనీనమై ఉండాలి; సార్వకాలీనమై ఉండాలి; సజీవమైన భాషలో ఉండాలి...

‘పడమటిగాలి’ విశ్వతోముఖత్వం

ఒకమహాకావ్యం గానీ, నాటకం గానీ శాశ్వతత్వాన్ని పొందాలంటే అది సాంఘిక వాస్తవికతను ప్రతిబింబించాలి; సార్వజనీనమై ఉండాలి; సార్వకాలీనమై ఉండాలి; సజీవమైన భాషలో ఉండాలి. ఇవన్నీ కన్యాశుల్కం నాటకంలో వున్నాయి కాబట్టే అది శాశ్వతత్వాన్ని పొందింది. శ్రీశ్రీ ఇంకొంచెం ముందుకెళ్లి కన్యాశుల్కం నాటకాన్ని మించడం కాదుగదా ఆ దరిదాపులకైనా రాగల నాటకం తెలుగులోనే కాదు, మరే యితర భారతీయ భాషల్లోనైనా ఉంటే దాని సంగతి ఇంతవరకూ ఎవరికీ తెలియకుండా ఉండడం ఆశ్చర్యకరమే అని అన్నారు. లేదనే ఆయన భావం. దురదృష్టకరమైన విషయమేమిటంటే శ్రీశ్రీ జీవితకాలంలో ప్రఖ్యాత నాటక రచయిత, నటుడు, దర్శకుడు, ప్రయోక్త పాటిబండ్ల ఆనందరావు రచించిన ‘పడమటిగాలి’ నాటకం రాకపోవడమే. 1983లో శ్రీశ్రీ చనిపోయారు. ‘పడమటిగాలి’ 1998లో వచ్చింది. శాశ్వతత్వం పొందడానికి కన్యాశుల్కం తరువాత శ్రీశ్రీ ప్రకటించిన అన్ని లక్షణాలూ కలిగిన ఏకైక నాటకమది. సార్వకాలీనత, సార్వజనీనతలతో బాటు ఆధునిక నాటక లక్షణాలైన నాటకీకరణ, సన్నివేశ కల్పన, పాత్రచిత్రీకరణ, భాష ప్రదర్శనా యోగ్యతల విషయంలో ఇప్పటివరకూ వచ్చిన తెలుగు సాంఘిక నాటకాలలో అత్యుత్తమమైన నాటకం ‘పడమటిగాలి’. నాగభైరవ కోటేశ్వరరావు అన్నట్టు శతాబ్ది ప్రారంభంలో కన్యాశుల్కం ఆఖరులో పడమటిగాలి.


చెప్పదలచుకొన్న వస్తువు లేక ఇతివృత్తం లేక కథకు సంబంధించిన పాత్రలను ఎన్నుకుని, సన్నివేశాలను కల్పించుకుని, సంభాషణల ద్వారా, రచయిత తాను ఉద్దేశించిన భావాలను స్పష్టంగా తెలియజేయడమే నాటకీకరణ అవుతుంది. ప్రధాన వస్తువుకు ప్రతి అంకమూ, ప్రతి సన్నివేశమూ సంబంధం కలిగి ఉండాలి. పడమటిగాలి నాటకంలో కథ నడపడానికి ఎన్ని పాత్రలవసరమో అన్నింటినీ గ్రహించి వాటిమధ్య సన్నివేశాలను సృజించిన తీరు అత్యద్భుతం. అందులో పన్నెండు దృశ్యాలుంటే ప్రతి ఒక్కటీ ప్రధాన కథకు సంబంధించిందే. ఏ దృశ్యాన్ని తీసేసినా కథలోని బంధం తెగిపోతుంది. కన్యాశుల్కంలో అలా కాదు. కథకు సంబంధం లేని సన్నివేశాలు సగానికి పైగా వున్నాయి. ‘పడమటిగాలి’లోని ఏ పాత్రా అసహజంగా వుండదు. అన్నీ సజీవమైన పాత్రలే.


నాటక రచనలో ఒక పాత్ర స్వభావాన్ని తెలియజేయడం సంభాషణల ద్వారానే చేయాలి. అది నాటకంలోని రెండు పాత్రలు మాట్లాడుకుంటూ ఉంటేనో, లేక ఆ పాత్ర చేష్టల ద్వారానో ప్రేక్షకులు గ్రహించాలి. అంతేగాని ఆ పాత్ర తన గురించి తానే స్వగతంలో చెప్పడం మంచి నాటక లక్షణం అనిపించుకోదు. షేక్‌స్పియర్‌ నాటకాల్లో ఇవి చాలా విరివిగా వుంటాయి. ఇప్పుడు వస్తున్న పౌరాణిక చారిత్రాత్మక నాటకాల్లో కూడా స్వగతాలు తప్పనిసరిగా ఉండాలేమోనని రచయితలు భావించినట్లుగా కనిపిస్తున్నది. చివరికి కన్యాశుల్కం నాటకంలో కూడా స్వగతాలు చోటు చేసుకున్నాయి. కానీ ‘పడమటిగాలి’లో మాత్రం అవిలేవు. అది రచయిత గొప్పతనమే. పాత్రలు ఏ భాషను ఉపయోగిస్తే ఆ భాషలోనే సంభాషణలు రాసి అవి అందరికీ అర్థమై ఆనందాన్నివ్వాలనేది రచన లక్ష్యం. కల్పనకాని యథార్థమైన ఇతివృత్తంలో, స్వచ్ఛ ప్రాంతీయ భాషలో సజీవమైన పాత్రలు మాట్లాడే మాటలను పడమటిగాలిలో యథాతధంగా రికార్డు చేశారు ఆనందరావు. కథ జరిగే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో నిత్యం ప్రజల నాలుకలపై నడయాడుతున్న వందలకొద్దీ జాతీయాలనూ, పలుకుబళ్లనూ, నానుడులనూ, తిట్లూ శాపనార్ధాలనూ, సామెతలనూ సంభాషణల్లో గుదిగుచ్చారాయన. 


కన్యాశుల్క నాటకం విశ్వజనీనమైందనీ, విశ్వతోముఖత్వం పొందిందనీ శ్రీశీ, కొత్తపల్లి వీరభద్రరావు ప్రకటించారే గాని వాటిని సోదాహరణంగా వివరించలేదు. సూచనప్రాయంగా వారు తెలిపిన ప్రకారం విశ్వతోముఖత్వం పొందాలంటే ఆ రచన పైన ఇంతకుముందు తెలిపినట్టు సాంఘిక వాస్తవికతను ప్రతిబింబించాలనీ, సార్వజనీనమై వుండాలనీ, సార్వకాలీనమై వుండాలనీ, సజీవమైన భాషలో వుండాలని అర్థమవుతుంది. ‘పడమటిగాలి’ నాటకాన్ని చూసినా చదివినా అది కన్యాశుల్కానికి ఏమాత్రం తీసిపోదని ఎవరైనా గ్రహిస్తారు. ఎందుకంటే, మట్టిమనిషి జీవనచిత్రణే ‘పడమటిగాలి’. మట్టితోనూ, చెట్టుతోనూ సజీవ సంబంధాన్నేర్పరుచుకొన్న మట్టి మనిషి జీవన పోరాటాన్ని గురించి ఈ నాటకం చెబుతుంది. రాంకోటుకి భూమంటే ప్రాణం. నీకు కొడుకెక్కువా, భూమెక్కువా అంటే భూమే ఎక్కువంటాడు. చెట్లన్నిటికీ అమ్మా అయ్యల పేర్లు పెట్టుకుని పిలుస్తా ఉంటాడు. బ్రతికినంతకాలం తిండిగింజలే పండించాలనుకుంటాడు. విత్తనాలూ, పురుగు మందులూ అమ్మేవాళ్లు రైతులకు నకిలీవి అమ్మి ఏవిధంగా మోసం చేస్తున్నారో వివరంగా చెబుతుంది పడమటిగాలి. రైతుకీపాలేరుకీ, రైతుకీ దుక్కి దున్నే పశువులకీ, పండిన పంటలకూ ప్రకృతి వైపరీత్యాలకూ వున్న సంబంధం గురించి చెబుతుంది. వ్యవసాయం బాగా తెలిసిన రాపండు మామ లాంటి కొందరు రైతులు సొంత ఊళ్ళో తగిన వసతులులేక ఇతర ప్రాంతాలకు వెళ్లి పంటలు పండించడం గురించి చెబుతుంది. ఆశబోతులైన కోటిబాబు లాంటి కౌలు రైతుల అగచాట్ల గురించి చెబుతుంది. ధరలు ఎప్పుడు బాగా ఉంటాయో ఎప్పుడుండవో తెలియక వ్యవసాయం జూదమై పోవడం గురించి వివరిస్తుంది. అందులో లేనిది వ్యవసాయంలో ఏదీ లేదు. అందుకే అది సమగ్ర గ్రామీణ వ్యవసాయ భారతం. సమాజంలో ఉన్న వర్గవిభేదాలూ, ముఠాకక్షలూ, అంతఃకలహాలూ, దళిత–అగ్రవర్ణాల సంఘర్షణలనూ సవివరంగా చర్చిస్తుంది పడమటిగాలి నాటకం. దళిత వర్గాల్లోని పిల్లలు చదువుకుని చైతన్యవంతులై తమ ఉనికి కోసం పోరాటం చెయ్యడం కూడా ఇక్కడ చర్చించబడింది. వర్ణాలూ కులాలూ పక్కనబెట్టి ఊళ్ళో వాళ్ళు దళితులమీద దాడి చెయ్యడం యీ నాటకంలో వివరించబడింది.


ఒక్కో కాలంలో ఒక్కో సమస్య చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. ఒక కాలంలో గుమాస్తాలూ, వాళ్ళ సంసారం, పేదరికం పెద్దగా వుండేవి. నిరుద్యోగం ఎప్పుడూ వుండేదే. ఇవన్నీ సార్వకాలీనం, సార్వజనీనం కాదేమో. కానీ పడమటిగాలి నాటకంలో చర్చించిన విషయాలు, సమస్యలు, స్థితిగతులు భారతదేశంలో నాగరికత పుట్టినప్పటి నుంచీ ఉన్నాయి. ఒకప్పుడుండేవి, ఇప్పుడు లేవు అని చెప్పడానికి అవకాశం లేదు. ప్రతీ యుగంలో, ప్రతీ కాలంలో ఉన్నాయి. ప్రతీ దేశంలో, ప్రతీ రాష్ట్రంలో ఉన్నాయి. భవిష్యత్తులో అంతరిస్తాయన్న నమ్మకం లేదు. ఇప్పుడున్న రూపంలో కాకపోతే ఇంకో విధంగా శాశ్వతంగా, చిరంజీవిగా వుంటాయి, అందుకే పడమటిగాలి నాటకం సార్వకాలీనం. అది కన్యాశుల్కం తరువాత వచ్చిన ఏకైక సజీవ దృశ్యకావ్యం. శ్రీశ్రీ గారి మాటల్లో అది ‘ఆదిమధ్యాంతరహిత’మైన నాటకం. విశ్వజనీనమైన, విశ్వతోముఖత్వం కలిగిన నాటకం. ఎంతోమంది కన్యాశుల్కాన్ని కీర్తించినట్టు సమాజ జీవన సమగ్రతను కలిగివుండడం, మామూలు మనుషులు మాట్లాడినట్టే రాయడం, ఆయా పాత్రలకు ఆయా మాటలు తప్ప వేరే ప్రత్యామ్నాయాలు లేకుండడం, ఏ సందర్భానికైనా సరిపోయే మాటలు నాటకంలో లభించడం, ప్రతీ పాత్ర, ప్రతీ సన్నివేశం ప్రజలు తమదిగా భావించడం– ఇంతకంటే ఇంకేం కావాలి పడమటిగాలి నాటకం విశ్వజనీనమైందనీ, విశ్వతోముఖమైందనీ ప్రకటించడానికి. అయితే కన్యాశుల్క నాటకాన్ని ప్రేమించి, ఆరాధించి, స్వంతం చేసుకుని దాని గొప్పదనాన్ని ప్రశంసించినట్లు పడమటిగాలి నాటకాన్ని గురించి రాయడానికి శ్రీశ్రీ, రారా, బంగోరె, అబ్బూరి లాంటివారు ఇప్పుడు లేరు. ఒకే ఒక ఆశ ఏమిటంటే కన్యాశుల్క ప్రాభవం బయటికి వచ్చింది అది ప్రచురించబడ్డ చాలా సంవత్సరాల తరువాతే. అలాగే ‘పడమటిగాలి’కి కూడా అటువంటి గుర్తింపు ఎప్పటికైనా వస్తుందని ఆశించవచ్చా?

జి. బలరామయ్య

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి

(నేడు నాటకరంగ దినోత్సవం)

Updated Date - 2022-04-16T08:18:58+05:30 IST