కొంతకాలంగా గొడవలు.. కూతురి సాయంతో కిరాతకం
మల్హర్, మార్చి 27: మనస్పర్థలతో వేరుగా ఉంటున్నా.. ఆ భార్యాభర్తల మధ్య గొడవలు మాత్రం ఆగలేదు. ఒకే గ్రామంలో ఉంటూ.. తారసపడినప్పుడల్లా గొడవలు పడుతూనే ఉన్నారు. చివరకు అది.. భార్య చేతిలో భర్త దారుణ హత్యకు దారితీసింది. ఎంత దారుణంగా అంటే.. పట్టపగలు, నడివీధిలో.. కళ్లలో కారం చల్లి, రోకలిబండ, ఇనుప రాడ్తో తలపై బలంగా కొట్టి.. హతమార్చింది. ఈ ఘాతుకానికి కుమార్తె సాయం కూడా తోడైంది. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం రేపింది. తాడిచర్ల గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికుడు మాచర్ల రాజయ్య (58), రాజమ్మ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కూతుళ్లు. పెద్ద కుమార్తెకు పెళ్లి చేసేయగా.. చిన్న కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. రెండో కుమార్తె భవానీ (సుమలత) మాత్రం వీరి వద్దే ఉంటోంది. తరచుగా గొడవలు పడే రాజయ్య, రాజమ్మలు.. ఇటీవలే విడిపోయారు. సుమలత తల్లితోనే అదే ఇంట్లో ఉంటుండగా.. రాజయ్య మాత్రం అదే గ్రామంలో ఉండే తన తల్లి ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో.. ఈ భార్యాభర్తలు ఎక్కడ తారస పడ్డా.. గొడవ పడేవారు.
శనివారం ఓ ఫంక్షన్కు వెళ్లిన వీళ్లు.. మళ్లీ గొడవ పడ్డారు. దీంతో రాజమ్మ.. భర్తను ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకుంది. ఆదివారం ఉదయం మాటు వేసి.. కూతురు భవాని సాయంతో కళ్లలో కారం చల్లింది. ఆ తర్వాత రోకలిబండ, ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టింది. దీంతో రాజయ్య.. అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.