ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే సీఎం సంకల్పం

ABN , First Publish Date - 2021-10-26T06:40:27+05:30 IST

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే సీఎం కేసీఆర్‌ సంకల్పమని, సీఎం కేసీఆర్‌ ఆలోచనలు ఆకాశం ఎత్తులో ఉంటే విపక్షాల ఆలోచనలు మోకాళ్ల ఎత్తులో ఉన్నాయని వి

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే సీఎం సంకల్పం
ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

ఆకాశమంత ఎత్తులో ముఖ్యమంత్రి ఆలోచనలు  

మోకాళ్ల ఎత్తులో విపక్షాల వైఖరి

టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో మంత్రి జగదీ్‌షరెడ్డి 

నల్లగొండ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే సీఎం కేసీఆర్‌ సంకల్పమని, సీఎం కేసీఆర్‌ ఆలోచనలు ఆకాశం ఎత్తులో ఉంటే విపక్షాల ఆలోచనలు మోకాళ్ల ఎత్తులో ఉన్నాయని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సోమవారం జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టిన పరిపాలన సంస్కరణలు, విద్యుత్‌, పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగం అభివృద్ధి-మౌలిక వసతుల కల్పన తీర్మానాన్ని మంత్రి జగదీ్‌షరెడ్డి బలపర్చి మాట్లాడారు. విపక్షాల ఆలోచనల శైలి గురించే కానీ, వ్యక్తుల గురించి కాదని, నటించే కాలానికి కాలం చెల్లిందన్నారు. విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అగ్ర భాగంలో ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 7,770 మెగావాట్లు అయితే సీఎం కేసీఆర్‌ ఏడేళ్ల పాలనలో అది 16,500 మెగావాట్లు అయ్యిందన్నారు. 2014కు ముందు సోలార్‌ ఉత్పత్తి 70 మెగావాట్లు ఉండగా ప్రస్తుతం 4వేల మెగావాట్లకు పెరిగిందన్నారు. యావత్‌ భారతదేశంలో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్‌ రహిత జిల్లాగా ప్రకటించడమే కాకుండా ఏడాది కాలంగా ఒక్క ఫ్లోరోసిస్‌ కేసు కూడా నమోదు కాలేదన్నారు. 30లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24గంటల నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే అన్నారు. ఏడేళ్ల పరిపాలనకు, సీఎం కేసీఆర్‌ పాలనా దక్షతకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధే నిదర్శనమన్నారు. బీజేపీ పాలనలో ధరల పెంపుతో అంధకారం నెలకొందన్నారు. ప్రపంచ వ్యవసాయానికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు ఊతమిచ్చాయన్నారు. కరోనా వచ్చినప్పుడు వలస కార్మికులను కళ్లల్లో పెట్టుకొని చూసుకున్న మహానేత కేసీఆర్‌ అని, వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లాలోకి పక్క రాష్ట్రం నుంచి ప్రస్తుతం వలసలు పెరుగుతున్నాయన్నారు.

25లక్షల మంది వలస కార్మికులకు ఆతిథ్యం

 25లక్షల మంది వలస కార్మికులకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తోందని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలు కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని విపక్షాలను సూటిగా ప్రశ్నించారు. వరుసగా 20 ఏళ్లు బీజేపీ ఏలుబడిలో ఉన్న గుజరాత్‌, కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉన్న రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన సీఎం కేసీఆర్‌కు మంత్రి అభినందనలు తెలిపి పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 9వ ప్లీనరీలోనూ తనకు అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ మద్దతుతో అధికారంలో ఉన్న మహారాష్ట్రకు చెందిన ప్రజాప్రతినిధులు ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, తమను తెలంగాణ రాష్ట్రంలో కలపండి లేదా అక్కడ పెట్టిన పథకాలు ఇక్కడ అమలు పర్చండి అంటూ చేస్తున్న డిమాండ్లు ఇక్కడి కాంగ్రెస్‌ నేతలకు చెవికి ఎక్కినట్లు కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు. ఆ ఇంత వివరం తెలుసుకోవాలన్న ఉబలాటం ఉంటే బీజేపీకి చెందిన రాయచూర్‌ ఎమ్మెల్యేను అడగవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి సభా ముఖంగా సూచించారు. 

Updated Date - 2021-10-26T06:40:27+05:30 IST