Advertisement

గాలి దుమారం బీభత్సం

Apr 23 2021 @ 01:26AM
ఆర్జాలబావి ఐకేపీ కేంద్రంలో వరదలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తుతున్న రైతు

పలుచోట్ల భారీ వర్షం 

తడిచిన ధాన్యం

నల్లగొండ, మర్రిగూడ, చందంపేట, ఏప్రిల్‌ 22: జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి గాలి దుమారం బీభత్సం సృష్టించింది. పలుప్రాంతాల్లో భారీ వర్షం అతలాకుతలం చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ వరదమయమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా అర్ధరాత్రి వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పట్టణ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రంలో వర్షంతో ధాన్యం తడిచింది. ఈ కేంద్రంలో ధాన్యాన్ని రైతులు ఆరబోయగా వరదకు కొట్టుకుపోయింది. రాత్రి సమయం కావడంతో రైతులు పట్టాలు కప్పినా ధాన్యాన్ని కాపాడుకోలేకపోయారు. వర్షం తగ్గాక కొట్టుకుపోయిన ధాన్యాన్ని రైతులు ఎత్తిపోశారు. ఇక  మర్రిగూడ మండలంలోని నామాపురం గ్రామంలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలో పలు ప్రాంతాల్లో వరి పంట దెబ్బతిన్నది. మండల కేంద్రంలో గేదెల షెడ్డు ధ్వంసం కావడంతో రూ.2లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. నామాపురం గ్రామానికి చెందిన బాలం బుగ్గరాములుకు సంబంధించిన రూ.2లక్షల విలువచేసే గేదెల షెడ్డు ఈదురుగాలుల బీభత్సానికి పూర్తిగా ధ్వంసమైంది. బాలం నర్సింహ, బాలం మల్లయ్యతోపాటు వేముల సైదులుకు చెందిన కోతకు వచ్చిన వరి సుమారు 15ఎకరాలు నేలమట్టం కాగా, రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాలవర్షం, ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటపొలాలకు పరిహారం అందించాలని బాధితులు తహసీల్దార్‌ దేశ్యానాయక్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. చందంపేట మండలం పెద్దమూల గ్రామంలో బుధవారం రాత్రి వర్షం కురవడంతో చేతికి వచ్చిన వరిపంటలు దెబ్బతిన్నాయి. పిడుగుపాటుకు పాడిగేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన బొమ్ము అంజయ్య గేదెలను మేపి వ్యవసాయ పొలం వద్ద కట్టేశాడు. రాత్రి పిడుగుపడి గేదె మృతిచెందింది. దీని విలువ రూ.40వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని  బాధితుడు చందంపేట పశువైద్యశాఖ అధికారికి గురువారం వినతిపత్రం అందజేశాడు.

 
నల్లగొండ పట్టణం పానగల్‌ బైపాస్‌రోడ్డు వద్ద భారీగా నిలిచిన వరద


Follow Us on:
Advertisement