మదర్సా అనే పదం ఉండకూడదు

ABN , First Publish Date - 2022-05-23T09:41:36+05:30 IST

మదర్సా అనే పదమే ఉండకూడదంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మదర్సా అనే పదం ఉండకూడదు

  • ఇప్పటి ముస్లింలంతా ఒకప్పటి హిందువులే
  • ఖురాన్‌ను ఇళ్లలో చదివించుకోండి.. స్కూళ్లలో కాదు
  • అసోం సీఎం హిమంత బిశ్వ సంచలన వ్యాఖ్యలు


గువాహటి, మే 22: మదర్సా అనే పదమే ఉండకూడదంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోంలో మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చాలనే అంశంపై హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ ఉర్దూ వర్సిటీ మాజీ చాన్సలర్‌ ఒకరు తీవ్రంగా స్పందించారు. ‘‘మదర్సాల్లో చదివే విద్యార్థులు చాలా తెలివైనవారు. వారు ఖురాన్‌లోని ప్రతి పదాన్ని మనస్ఫూర్తిగా గుర్తుంచుకుని, తిరిగి చెప్పగలరు’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలపై.. ఆదివారం ఆరెస్సెస్‌ వార పత్రికలు పాంచజన్య, ఆర్గనైజర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా కాంక్లేవ్‌లో హిమంత బిశ్వ ఘాటుగా సమాధానాలిచ్చారు. ‘‘ఈ దేశంలో ముస్లింలంతా ఒకప్పటి హిందువులే. ఎవరూ జన్మతః ముస్లింలు కాదు. విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు కాలేరని తెలిస్తే.. వారంతటవారే ఎన్నటికీ మదర్సాలకు వెళ్లరు. అసలు మదర్సాల్లో చిన్నారులను చేర్పించడమే వారి మానవ హక్కులను ఉల్లంఘించడం. విద్యార్థులకు ఆలోచించే వయసు వచ్చాకే.. వారికి మతపరమైన బడుల్లో చేరాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వాలి’’ అని వ్యాఖ్యానించారు.


ముస్లింలు తమ పిల్లలకు ఇంట్లో ఖురాన్‌ నేర్పించుకోవచ్చని.. స్కూళ్లలో కాదని స్పష్టం చేశారు. చిన్నారులకు సామాన్యశాస్త్రం, గణితం, జీవశాస్త్రం, వృక్షశాస్త్రం బోధించాలని.. అప్పుడే వారు డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు అవుతారని చెప్పారు. అసోంలో ముస్లిం విద్యార్థులకు అలాంటి విద్యను అందిస్తామని పేర్కొన్నారు. తాను ముస్లిం పిల్లలకు కాలేజీ, విశ్వవిద్యాలయాల చదువులను అందజేస్తానని వివరించారు. కాగా.. 2020లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మారుస్తూ అసోం సర్కారు తీసుకువచ్చిన చట్టాన్ని గువాహటి హైకోర్టు పక్కన పెట్టిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-05-23T09:41:36+05:30 IST