కుడి పక్కకు కుంగుతున్న ప్రపంచం!

ABN , First Publish Date - 2022-09-29T06:08:56+05:30 IST

రాతన రాజ్యాల్లో రోమన్ సామ్రాజ్యం ఒకటని తెలుసు. సోనియాగాంధీ సొంత దేశం ఇటలీ అని తెలుసు. ఈ మధ్య తెలుగు సినిమాల్లో కూడా మిలన్, సిసిలీ కనిపిస్తున్నాయని తెలుసు...

కుడి పక్కకు కుంగుతున్న ప్రపంచం!

రాతన రాజ్యాల్లో రోమన్ సామ్రాజ్యం ఒకటని తెలుసు. సోనియాగాంధీ సొంత దేశం ఇటలీ అని తెలుసు. ఈ మధ్య తెలుగు సినిమాల్లో కూడా మిలన్, సిసిలీ కనిపిస్తున్నాయని తెలుసు. తూర్పు ప్రపంచపు ఇటాలియన్ భాషగా తెలుగుని చెప్పుకుంటారని తెలుసు. రెండు ప్రపంచయుద్ధాల్లోనూ ఆ దేశం ‘ఆ’ వైపున ఉందని తెలుసు. హిట్లర్ అంత కాకున్నా, ముస్సోలినీ అనే వాడికి ప్రపంచస్థాయి అపకీర్తి ఉందని తెలుసు. అంతకు మించి ఇటలీతో మనకు పెద్దగా సంబంధం లేదు.


కొందరు జన్మించిన వేళా విశేషం, భూకంపాలూ తుఫానులూ వస్తాయట. మరి కొందరు పాలకులయిన వేళ ఆనందమానందం కాక, భయభ్రాంతులు కలుగుతాయట. జార్జియా మెలోని అనే రాజకీయవాది ఇటలీ నాయకురాలిగా ఎన్నికయ్యేసరికి, తక్కిన ప్రపంచం హాహాకారాలు కాకపోయినా కలవరాలు పడుతోంది. ఎందుకంటే, మెలోనీ కుడిపక్క సిద్ధాంతాలను నమ్ముతారు. ఇంతా అంతా కుడి కాదు, బాగా, ఆ చివర దాకా ఉండే కుడి వాది ఆమె. అదురూ బెదురూ లేకుండా ముస్సోలినీ కుదురు నాది అని చెప్పుకోగలరు. ఫాసిస్టు అనే మాట ఇక్కడ ఒక దూషణో ఆరోపణో అవుతుంది కానీ, మెలోనికి అది విశేషణం, విభూషణం కూడా.


ఇంకా అధికారం బదిలీ కాలేదు, ప్రస్తుత ప్రభుత్వం గడువు ముగిసి, మెలోని ప్రధాని కావడానికి ఇంకో నెల పట్టవచ్చు. ఇరవయ్యారు శాతం ఓట్లతో ఆమె ఏర్పరచబోయేది సంకీర్ణ ప్రభుత్వమే కాబట్టి, తన సిద్ధాంతాలను పూర్తిగా ఆచరణలో పెట్టడానికి ఆమెకు అవకాశం ఉండదని, యూరప్‌లో ఉన్న మధ్యస్థ రాజకీయాలలో మధ్యగాను, ఎడమగాను ఉన్నవారు, కుడి రాజకీయాలలో మధ్యస్థంగానూ కాస్త ఎడంగా ఉన్నవారు, ఎడమ రాజకీయాలలో అవశేషంగా మిగిలినవారు ఆశిస్తున్నారు. అనుకున్నట్టుగానే, తాను కొన్ని మెట్లు దిగడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆమె సూచనలు పంపుతున్నారు. ‘నేను ఇటాలియన్లందరికీ ప్రధానిగా ఉంటాను’ అని ఆమె ప్రకటించారు. అంటే ఏ ఒక్కరికో కాదు, అన్ని భావాల వారికి, అన్ని పార్టీల ఓటర్లకు ప్రతినిధిగా వ్యవహరిస్తాను అని చెబుతున్నట్టు లెక్క. ఈ మాటలు మన దేశంలో కూడా 2014లోను ఆ తరువాత కూడా విన్నట్టు అనిపిస్తే, అందుకు మన జ్ఞాపకశక్తిని అభినందించుకోవలసిందే. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అన్నది ఏ దేశంలో అయినా ఆదర్శమే కదా? అబార్షన్ల విషయంలో వైఖరిని సడలించుకోవడానికి అభ్యంతరం లేదని కూడా ఆమె మరో సయోధ్య బాణం వదిలారు. అయితే, గర్భస్రావం చేయించుకోవడం ఒక్కటే మార్గం అన్న నిర్బంధ పరిస్థితిలో ఉన్నవారికి మరొక మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తామని, అబార్షన్ చేయకుండా నిరాకరించే హక్కు డాక్టర్లకు ఇస్తామని ఆమె చెప్పారు. అందరి నాయకురాలిని అని చెప్పినంత సరళంగా లేదు కదా, ఈ వైఖరి! ఒకేసారి విరుచుకుపడినట్టు కాక, చాపకింద నీరులాగా తాను అనుకున్నది చేస్తాను సుమా అన్న వాగ్దానం ఆమె మాటల్లో ధ్వనిస్తున్నది. మన దేశంలో మాత్రం 2014లో ఉన్నట్టు 2019లో ఉన్నారా?


ప్రపంచంలో కుడివాదం సుడులు తిరుగుతూ అధికారపీఠాలను అందుకోవడం ఇప్పుడు మొదలయింది కాదు. ఐరోపాలో నయా ఫాసిజం, నయా నాజీజం చిన్నచిన్న బృందాలుగా ఎప్పటినుంచో ఉనికిలో ఉన్నాయి.  ఈ శతాబ్ది ఆరంభంలోనే మొదలైన ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని కుదిపివేస్తున్నప్పుడు, అంతరాలు మరింత పెరిగి అగాధాలుగా మారుతున్నప్పుడు, ప్రపంచీకరణలో అస్తిత్వాలు అన్నీ మునిగిపోతున్నప్పుడు, ఇంతకాలంగా ఏలికలుగా ఉన్న మధ్యేవాద రాజకీయాలు, మధ్యస్థ కుడి ఎడమ రాజకీయాలు అన్నీ జనం అనుభవంలో పరాజితమయ్యాయి. అదే కుడివాదానికి ఊతం అయింది. అణగారినవారికి కొత్త ఆలంబనలు ఏర్పడ్డాయి. జాతులు, తెగలు, భాషలు, చారిత్రక గర్వాలు వేదిక మీదకు వచ్చాయి. ఆర్థికంగా సామాజికంగా బలాఢ్యుల మీదకు గురిపెట్టవలసిన ఆగ్రహం, నిస్సహాయులైన మైనారిటీల మీద, శరణార్థుల మీద, స్త్రీల మీద దారిమళ్లింది. ప్రజలు విచక్షణ కోల్పోయి, జాతీయత పేరిట, జాతి లక్షణాల పేరిట, తమకు వ్యతిరేకమయిన విధానాలనే ఆరాధించడం మొదలుపెట్టారు. అమెరికాకు కూడా పాకిన ఈ జాడ్యం ట్రంప్ రూపంలో వ్యక్తమయింది. ట్రంప్ మూర్ఖత్వానికి, అహంకారానికి అమెరికాలోని గ్రామీణులు, కార్మికులు పునాది వర్గాలుగా ఉన్నారు. అమెరికన్ రాజకీయాలలో సాంప్రదాయ, మితవాద కోవకు చాలా కాలంగా రిపబ్లికన్లు ప్రాతినిధ్యం వహిస్తుండగా, డొనాల్డ్ ట్రంప్ అందులో తీవ్రవాదిగా పరిణమించాడు. ఇప్పుడు యూరప్‌లో జరుగుతోంది కూడా అటువంటిదే. అతి మితవాదులు, లేదా తీవ్ర సంప్రదాయవాదులు ఆ ఖండం మీద బలమైన పక్షాలుగా రూపొందారు. ఇప్పుడు మోహరింపులు కుడి ఎడమల మధ్య కాదు, మధ్యస్థ పార్టీలలోని కుడి, ఎడమ మొగ్గుల మధ్య కాదు, కనీసం మధ్యస్థ, కుడిపక్షాల మధ్య కూడా కాదు. కుడి పార్టీలలోని తీవ్ర, మిత పక్షాల మధ్య. అక్కడక్కడ ఫ్రింజి ఎలిమెంట్లుగా ఉండిన తీవ్ర కుడివాలులు ఇప్పుడు ప్రధానస్రవంతి అయ్యారు. వీరందరికీ, యూరోపియన్ యూనియన్ మీద కోపం. అది రద్దు కావాలని, తమ దేశం దానినుంచి వైదొలగాలని లేదా, ఈయూను కేవలం సమన్వయ సంఘంగా మాత్రమే పరిగణించాలని వీరంతా కోరుకుంటారు. స్వలింగ ప్రేమలంటే వీరికి ఏవగింపు. వాటికి గుర్తింపులను ఇవ్వకూడదని వారి సిద్ధాంతం. గ్లోబలైజేషన్ వల్ల, యూరోపియన్ యూనియన్ వల్ల జాతుల సొంత అస్తిత్వాలు సమసిపోతున్నాయన్నది వారి ఫిర్యాదు. ఐరోపాయేతర దేశాల నుంచి వలసలను నిరోధించడం వీరి ఎజెండా. ముఖ్యంగా సిరియా నుంచి, మొత్తంగా ముస్లిం దేశాల నుంచి శరణార్థులను ఆదరించకూడదు. ఉన్నవారిని పంపించివేయాలి. వలసగా వచ్చినవారు ఒకనాడు తమ వలసగా ఉన్న దేశం నుంచి వచ్చినా సరే, రానివ్వకూడదు. అంటే, ఇంగ్లండుకు ఇండియన్లు, పాకిస్థానీయులు, బంగ్లా దేశీయులు రాకూడదు. ఫ్రాన్స్‌కు అల్జీరియన్లు రాకూడదు. ఇటలీకి లిబియన్లు రాకూడదు. తమ దుస్థితికి ఈ వలస జనమే కారణమని, తమకు దక్కవలసింది వారికి పెట్టవలసి వస్తోందని ఐరోపా జనం అనుకుంటున్నారంటే, ఎటువంటి మార్పు అది? ఒకనాడు యూరోపియన్ కులీనులకు కమ్యూనిజం భూతమైంది, ఇప్పుడు కనీస మానవత్వమూ ఉదారత్వమే భూతాలయ్యాయి.


జర్మనీలో, ఇంగ్లండ్‌లో గద్దెనెక్కినవారు కుడిగా నడిచేవారే కానీ మరీ బీభత్స భయానకులు కారు. కానీ, హంగరీలో, స్వీడన్‌లో, పోలండ్‌లో తీవ్రమైన రైటిస్టులే అధికారంలోకి వచ్చారు. ఫ్రాన్స్‌లో కూడా ఈ మధ్య కుడిపక్షం బాగా బలపడిపోయి నేషనల్ ర్యాలీ నాయకురాలు లె పెన్ అధ్యక్ష ఎన్నికలో రెండో రౌండు దాకా వచ్చారు కానీ, చివరకు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ మళ్లీ గెలిచారు. మొదటిసారి పోటీ చేసినప్పుడు మధ్యస్థంగానే కొనసాగుతానని వాగ్దానం చేసిన మాక్రాన్, ఆచరణలో కుడివిధానాలకే మొగ్గుచూపారు. ఈ సారి మరింత కుడి నేత అయిన లె పెన్‌నే జనం ఎంచుకుంటారేమోనన్న ఆందోళన యూరప్‌లో ఉండింది. ఆ గండం గడచినా, ఇటలీ ఎన్నికల ఫలితాలు ఫ్రాన్స్ నేతలకు రుచించలేదు. మెలోని ప్రధాని కావడం ఖాయం అయ్యాక, ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ హెచ్చరిక లాంటి ప్రకటన ఒకటి చేశారు. ప్రజల అభీష్టం మీద వ్యాఖ్యానించడం తనకు ఇష్టం లేదని, కానీ, మానవహక్కులను ఆ దేశం ఎట్లా గౌరవిస్తుందో, ముఖ్యంగా అబార్షన్ అవకాశాల విషయంలో ఎట్లా ఉంటుందో తాము ఒక కంట గమనిస్తూ ఉంటామని అన్నారు. అమెరికా కూడా షరతులతో కూడిన అభినందనలనే అందించింది. ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, సుస్థిర ఆర్థికాభివృద్ధి వంటి యథావిధి మాటలతో పాటు, మానవహక్కుల సంరక్షణ కూడా తమ సంబంధాలలో ఉమ్మడి అంశంగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి అన్నారు. అమెరికాయే అంతో ఇంతో ఉదారంగా మిగిలిపోయే దేశంగా కనిపిస్తోంది.


దీన్నంతా చూస్తుంటే, మనదేశం గురించిన బాధ కొంత ఉపశమిస్తుంది. పరవాలేదు. ఇదొక విశ్వవ్యాప్త పరిణామం. మనమొక్కళ్లమే చెడిపోలేదు. పదిమందితో పాటు పడే కష్టం, మరీ అంత కష్టం కాదు. ఒకచోట, ముస్సోలినీ వారసత్వాన్ని గర్వంగా చెప్పుకునేవారు నాయకులయ్యారు. నాథూరామ్ గాడ్సేని గొప్పగా స్మరించుకునేవారు మన దేశంలో వైభవం దక్కించుకున్నారు. మనం కూడా శరణార్థులపై కోపం పెంచుకుంటున్నాం. మైనారిటీలకు, జర్మనీలో యూదులకు పట్టినంత అదృష్టం పట్టిస్తున్నాము. ముస్సోలినీ సోషలిస్టు రష్యాతో ఒప్పందాలు చేసుకుంటూనే, కమ్యూనిస్టు గ్రాంసీని ఎడతెగని నిర్బంధంలో ఉంచాడు. ఇందుకు మన దగ్గరా ఉదాహరణలు


కొల్లలు. నిరాశకు ఆస్కారం భూగోళమంతా విస్తరించి ఉన్నది.ప్రపంచానికి ఆశ కాకపోవచ్చును కానీ, మంచికి రోజులు ఉన్నాయని అనిపించే ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. క్యూబాలో ఈ నెలలో జరిగిన రిఫరెండం అది. పెళ్లిని, కుటుంబాన్ని, బాధ్యతలను నిర్వచించిన ఫ్యామిలీ కోడ్‌పై జరిగిన జనాభిప్రాయసేకరణ అది. స్వలింగ వివాహాలను అనుమతిస్తూ, పెళ్లిని ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్టపూర్వకంగా జరిగే కలయికగా కోడ్ నిర్వచించింది. స్వలింగ వివాహం చేసుకున్న జంటలు పిల్లలను దత్తత తీసుకోవడాన్ని కోడ్ అనుమతించింది. రకరకాల లైంగికతలను గుర్తించడమే కాకుండా, వివాహాలన్నిటిలోను భాగస్వాములకు సమాన హక్కులను బాధ్యతలను శాసనబద్ధం చేసింది. పిల్లలకు తల్లిదండ్రుల నుంచి అధిక రక్షణను అందించింది. సహజమైన హక్కులకు రిఫరెండం ఎందుకు అని ఎల్జిబిటి కమ్యూనిటీ అభ్యంతరం చెప్పింది. జనాభిప్రాయం చట్టానికి బలాన్ని ఇస్తుందని ప్రభుత్వం సమర్థించుకుంది. కోడ్‌ను మొత్తంగా రోమన్ క్యాథలిక్ చర్చ్ వ్యతిరేకించింది. ఇప్పటికే ఆలస్యం అయిన మార్పులు ఇవి అని ప్రభుత్వం వాదించింది. విస్తృతమైన అనుకూల ప్రతికూల వాదనల ప్రచారం తరువాత క్యూబన్లు 67 శాతం ఓట్లతో కోడ్‌కు మద్దతు తెలిపారు. ‘ప్రేమ ఇప్పుడు చట్టం కూడా’ అని క్యూబన్ ప్రధాని ప్రకటించారు. పరవాలేదు, ఎక్కడో ఒక చోట కాలం ముందుకు కూడా నడుస్తున్నది.

Updated Date - 2022-09-29T06:08:56+05:30 IST