అసౌకర్యాల చెంత.. ఆమనగల్లు సంత

ABN , First Publish Date - 2021-10-18T04:42:21+05:30 IST

పట్టణప్రాంతంగా అభివృద్ధి చెంది రాష్ట్ర రాజధానికి

అసౌకర్యాల చెంత.. ఆమనగల్లు సంత
రోడ్డుపైనే సంత

  • రోడ్లపైనే కూరగాయల, చేపల,మాంసం విక్రయాలు
  • వారాంతపు సంతకు, మార్కెట్లకు నిర్ధిష్ట స్థలాలు కరువు
  • నిధులు మంజూరైన చేపట్టని సమీకృత మార్కెట్‌ సముదాయ నిర్మాణం 


ఆమనగల్లు : పట్టణప్రాంతంగా అభివృద్ధి చెంది రాష్ట్ర రాజధానికి చేరువలో, నాలుగు మండలాలకు కూడలిగా ఉన్న ఆమనగల్లు పట్టణంలో కూరగాయలు, చేపల, మాంసం విక్రయాలకు నిర్దిష్ట స్థలాలు లేవు. దీంతో ఆయా వ్యాపారాలు రోడ్లపైనే కొనసాగుతున్నాయి. ఫలితంగా రోడ్డుకిరువైపులా తీవ్ర రద్దీ ఏర్పడుతుండడంతో వాహనాల రాకపోకలకు తరుచూ ఇబ్బందులు కలుగుతున్నాయి. శ్రీశైలం-హైద్రాబాద్‌ జాతీయ రహదారిపై ఉన్న ఆమనగల్లు పట్టణంలో కూరగాయల, చేపల, మాంసం విక్రయాలతో వందల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. పట్టణప్రాంతం కావడంతో జిల్లాలోని  మా డ్గుల, తలకొండపల్లి, కేశంపేట, ఆమనగల్లు, కందుకూరు, నాగర్‌కర్నూల్‌జిల్లాలో వెల్దండ మండలాలకు చెందిన పలువురు రైతులు తాము పండించిన కూరగాయలను ఆమనగల్లుకు తెచ్చి విక్రయిస్తుంటారు. దీంతో నిత్యం వ్యాపారాలు పెద్దఎత్తున్న జరుగుతుంటాయి. ఆమనగల్లుతోపాటు సమీప మండలాలకు చెందిన గ్రామాల ప్రజలు కూడ కూరగాయలు, చేపల, మాంసం విక్రయాలకు ఆమనగల్లు మార్కెట్‌కు వస్తుంటారు. స్థలాల సమస్య ఏళ్లకాలంగా ఉన్నా.. ఆయా మార్కెట్లు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. నిర్దిష్ట స్థలం లేక గాంధీచౌక్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌, హనుమాన్‌ దేవాలయం, రచ్చకట్ట, అంగడిబజార్‌ వరకు సీసీరోడ్డుకు ఇరువైపులా కూరగాయల విక్రయాలు సాగిస్తున్నారు. దీనివల్ల కొనుగోలుదారులతో రద్దీ అధికంగా ఏర్పడుతుంది. ఈరోడ్డు నుంచే పట్టణంలో పాత బజార్‌ కాలనీలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కాగా ఆయా విక్రయ దుకాణాల మూలంగా కాలనీలకు వెళ్లే ప్రజలకు కూడ ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో కూరగాయల విక్రయానికి ప్రత్యేకంగా రైతుబజార్‌ ఏర్పాటు చేయాలని చాలాకాలంగా స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతానికి వచ్చిన మంత్రులకు, ఉన్నతాధికారులకు రైతుబజార్‌ ఏర్పాటు గురించి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు వినతి పత్రాలు అందించారు. అయినా నేటికీ స్పందన లేదు. కూరగాయల విక్రయాలతో తైబజార్‌ రూపంలో మున్సిపాలిటీకి ఆదాయం లభిస్తున్న కూరగాయల విక్ర యదారులకు, కొనుగోలుదారులకు కనీస సదుపాయాలు కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కనీసం షెడ్లు కూడా లేకపోవడంతో ఎండ, వర్షాకాలంలో వ్యాపారుల ఇబ్బందులు వర్ణానాతీతం.


వారాంతపు సంతకు నిర్దిష్ట స్థలం కరువు

ఆమనగల్లు వారాంతపు సంతకు నిర్దిష్ట స్థలం లేదు. దశాబ్దాలుగా శుక్రవారం వారాంతపు సంత జరుగుతుంది. ఆమనగల్లుతోపాటు సమీప మండలాల ప్రజలు సంతకు కొనుగోలు, అమ్మకానికి వస్తుంటారు. చాలా పట్టణ ప్రాంతాల్లో వారాంతపు సంతలను అభివృద్ధి చేసినా ఆమనగల్లులో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. స్థలంలేని కారణంగా గాంధీచౌక్‌ రోడ్డుపై సంత కొనసాగుతుంది. 


రోడ్ల పక్కనే చేపల విక్రయం

ఆమనగల్లులో చేపల మార్కెట్‌ లేక పోలీస్‌స్టేషన్‌ వెనక మాడ్గుల రోడ్డు పక్కన చేపలను విక్రయిస్తున్నారు. స్థానికంగా అనేక కుంటుంబాలు చేపల విక్రయంపై జీవ నం సాగిస్తున్నాయి. చేపల విక్రయానికి స్థలం కేటాయించి షెడ్లు నిర్మించాలని విక్రయదారులు, మత్య్స కార్మికులు ఏళ్లకాలంగా ప్రభుత్వాన్ని, పాలకులను కోరుతున్నా స్పందన లేదు. దీంతో పోలీసుస్టేషన్‌ వెనుక భాగంలో రోడ్డుపై చేపలు విక్రయిస్తున్నారు.  


ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు

ఆమనగల్లు మున్సిపాలిటీకి సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్‌ సముదాయం నిర్మాణానికి రూ.3.67 కోట్లు మంజూరయ్యాయి. టెండర్‌ ప్రక్రియ కూడా ప్రభు త్వం చేపట్టింది. కాగా ఐదు నెలలైనా పనులు ప్రారంభించలేదు. అందుకు అనువైన స్థలం కూడా నేటికీ కేటాయించలేదు. ఆ దిశగా ఎవరూ చొరవ చూపడం లేదు. 


షెడ్లు నిర్మించాలి

ఆమనగల్లులో చేపల విక్రయానికి నిర్దిష్ట స్థలం కేటాయించి షెడ్లు నిర్మించాలి. చేపలు నిల్వ చేసుకోవడానికి తగిన వసతి ఏర్పాటు చేయాలి. మత్స్యకారుల సంక్షేమానికి, ఉపాధికి ప్రభుత్వం తోడ్పాటునందించాలి. వ్యాపార వృద్ధికి రైతుల మాదిరిగా వడ్డీ లేని రుణాలు అందించాలి. ఆమనగల్లు పట్టణంలో అనేక కుటుంబాలు చేపల విక్రయాల ఆధారంగా జీవనం సాగిస్తున్నారు.  

- బొల్లు లక్ష్మమ్మ , చేపల వ్యాపారి- ఆమనగల్లు 


త్వరలోనే ఇబ్బందులు తొలుగుతాయి

ఆమనగల్లు మున్సిపాలిటికి సమీకృత కూరగాయల, మాంసం మార్కెట్‌ మంజూరైంది. ప్రభుత్వం రూ.3.67 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే పలు చోట్ల స్థలాల పరిశీలన చేపట్టడం జరిగింది. వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టి ఇబ్బందులు తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. కొనుగోలు దారులు, విక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. వారాంతపు సంతకు కూడా అనువైనచోట నిర్దిష్ట స్థలం కేటాయిం పునకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం.  

- శ్యామ్‌సుందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఆమనగల్లు 



Updated Date - 2021-10-18T04:42:21+05:30 IST