శివారు కాలనీల్లో సమస్యల తిష్ట

ABN , First Publish Date - 2022-06-27T06:12:16+05:30 IST

మార్కాపురం పట్టణంలోని పలు శివారు కాలనీలలో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

శివారు కాలనీల్లో సమస్యల తిష్ట
వసతలు లేక వదిలేసిన ఇళు

మార్కాపురం(వన్‌టౌన్‌), జూన్‌ 26: మార్కాపురం పట్టణంలోని పలు శివారు కాలనీలలో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని సుందరయ్య కాలనీ, భగత్‌సింగ్‌ నగర్‌, ఇందిరమ్మ కాలనీ, యానాదుల కాలనీ, హోంగార్డు కాలనీ, బాపూజీ కాలనీ, రాజ్యలక్ష్మీ నగర్‌, రవీంద్ర నగర్‌, ఎసీబీసీ కాలనీ శివారు ప్రాంతాలలో మురుగు కాలువలు, రోడ్లు నేటికి లేవు. ఇందిరమ్మ కాలనీలో 2006లో ప్రభుత్వం మండలంలోని నరసింహాపురం ఇలాకాలో 1300 మందికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. వీరిలో దాదాపు 300 మంది తమ శక్తి మేరకు ఇళ్లు కట్టుకొని ఇందిరమ్మ కాలనీలలోనే నివాసం ఉంటున్నారు. సౌకర్యాలు లేకపోవడంతో అనేక ఇళ్లు నేటికి పునాదుల స్థాయిలోనే నిలిచిపోయాయి. మౌలిక సదుపాయాలైన రోడ్లు, కాలువలు లేవు. వాటర్‌ ట్యాంక్‌ నిర్మించినా వృథాగా పడి ఉంది. అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రం కనీసం ప్రభుత్వ పాఠశాలలు లేవు. సరైన రోడ్లు లేని కారణంగా వర్షం పడితే చాలు మోకాలిలోతు బురదలో తిరుగుతున్నారు. పట్టణానికి దూరంగా ఉన్న ఇందిరమ్మ కాలనీనుంచి వెళ్లాలంటే ఒక వ్యక్తికి రోజుకు రూ.50 ఆటో చార్జీలు అవుతున్నాయి. రోజువారీ కూలీలు నిరుపేద కార్మిక వర్గాలు నివసించే ఈ కాలనీ వాసులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. పట్టణ శివారులలో పోలేరమ్మ గుడి వెనుక దాదాపు 20 కుటుంబాల యానాదులకు 15 ఏళ్ల క్రితం కాలనీ ఏర్పాటు చేశారు. నేటికి ఆ కాలనీలో రోడ్లు, నీటి సౌకర్య లేవు. దాతలు ఏర్పాటు చేసిన ట్యాంకరే వారి దాహర్తి తీరుస్తోంది. పక్కనే 58 కుటుంబాలు ఉన్న హోంగార్డు కాలనీ కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. రాజ్యలక్ష్మీనగర్‌, బాపూజీ కాలనీ, రవీంద్ర నగర్‌, ఎసీబీసీ కాలనీలలో కూడా అదే పరిస్థితి. దేవాదాయశాఖ పరిధిలోని సుందరయ్య కాలనీలో కూడా కనీస మౌలిక వసతులు లేవు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Updated Date - 2022-06-27T06:12:16+05:30 IST