తీరంలో సమస్యల తిష్ట!

ABN , First Publish Date - 2020-11-19T04:55:25+05:30 IST

జిల్లాలోని తీరప్రాంత గ్రామాల మత్స్యకారులు అనే సమస్యలతో సతమతమవుతున్నారు. పరిష్కరించాల్సిన అధికారులు గాని, అటు ప్రజాప్రతినిధులు గానికి కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీరంలో సమస్యల తిష్ట!
ముక్కాం తీరంలో చేపలు ఎండబెడుతున్న మత్స్యకారులు

పట్టించుకోని యంత్రాంగం

కానరాని కనీస వసతులు

అవస్థలు పడుతున్న మత్స్యకార గ్రామాల ప్రజలు

(భోగాపురం)

జిల్లాలోని తీరప్రాంత గ్రామాల మత్స్యకారులు అనే సమస్యలతో సతమతమవుతున్నారు. పరిష్కరించాల్సిన అధికారులు గాని, అటు ప్రజాప్రతినిధులు గానికి కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తీర ప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటిరేగ పరిధిలో సుమారు 15 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో దాదాపు 20 వేల కుటుంబాలు సముద్రంపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. అయితే కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. చింతపల్లి, ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు, ఎర్రముసలయ్యపాలెం తదితర గ్రామాల్లోని మత్స్యకారులు ప్రతి రోజూ వేట సాగించి తెచ్చిన చేపలను స్టోర్‌ చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో దళారులు చెప్పిన ధరకు అమ్ముకుంటున్నారు. దీంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వేట సాగించి తెచ్చిన మత్స్య సంపద ఇలా దళారుల పాలవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న చేపలు, రొయ్యలను ఎండబెట్టి అమ్ముకునేందుకు వసతులు లేకపోవడంతో మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇసుక తిన్నుల పైనే ఎండబెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో చేపలకు ఇసుక అంటడంతో తక్కువ ధరకు విక్రయించుకుంటున్నారు. ప్లాట్‌ ఫారాలు నిర్మించాలని అనేక పర్యాయాలు అధికారులును, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా ఫలితం లేకపోతుందని పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముక్కాం తీరంలో మత్స్యకారులు సేదతీరడానికి అవసరమైన కమ్యూనిటీ భవనం ఉండేది. అది పూర్తిగా శిధిలమవడంతో మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. చాలా గ్రామాల్లో తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉప్పు నీటితోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తీర ప్రాంత గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. 

ప్లాట్‌ ఫారాలు లేక...

చేపలు ఎండబెట్టుకోవడానికి అవసరమైన ప్లాట్‌ ఫారాలు లేకపోవడంతో తీర ప్రాంత మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. సముద్రంలో వేట సాగించి తెచ్చిన చిన్నచిన్న నెత్తాళ్లు, కవ్వాళ్లు, రొయ్య పిల్లలను ఆరవేసి అమ్మకాలు చేస్తుంటారు. అయితే అందుకు అవసరమైన సదుపాయం లేకపోవడంతో మత్స్యకారులు నష్టపోతున్నారు. ఇసుకలోనే ఆరవేడం వల్ల ఎండిన చేపలను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది.  

 

Updated Date - 2020-11-19T04:55:25+05:30 IST