శిశుగృహలో సమస్యల తిష్ట

ABN , First Publish Date - 2022-07-06T05:16:30+05:30 IST

విధి వక్రించి అనాథలుగా మిగిలిన చిన్నారుల వికాసానికి తోడ్పాటు నందించాల్సిన శిశుగృహలో సమస్యలు తిష్టవేశాయి.

శిశుగృహలో సమస్యల తిష్ట

 పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులు

అందుబాటులో ఉండని సిబ్బంది

ఆర్థిక వ్యవహారాలు తేలకుండా ఒకరి రాజీనామా

చర్యలకు వెనుకాడుతున్న సంక్షేమాధికారి

ఖమ్మంఖానాపురం హవేలీ, జూలై 5:  విధి వక్రించి అనాథలుగా మిగిలిన  చిన్నారుల వికాసానికి తోడ్పాటు నందించాల్సిన శిశుగృహలో సమస్యలు తిష్టవేశాయి. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్షం ప్రదర్శించే అధికారులు, సిబ్బంది పిల్లల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కనీసం కార్యాలయంలో రిజిస్టర్‌ను కూడా సరిగా నిర్వహించడంలేదనే అపవాదును సదరు అధికారులు, సిబ్బంది మూట గట్టుకున్నారు.  ఇటీవల నగరంలోని శిశుగృహను  జిల్లా న్యాయసేవా కార్యదర్శి జావేద్‌ పాషా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో పలు లోటు పాట్లు వెలుగు చూశాయి. సదరు న్యాయమూర్తి మందలించినా సిబ్బంది ఏమాత్రం తమ పని తీరును మార్చుకోలేదని తెలుస్తోంది. శిశుగృహలో నమోదైన పిల్లల వివరాలు సమగ్రంగా లేవని, దత్తత తీసుకోవాలని, పిల్లలను తమకు ఇవ్వాలని కోరుతూ తల్లిదండ్రులు సమర్పించిన దరఖాస్తులు, కార్యాలయ రిజిస్టర్‌లు అసమగ్రంగా పెండింగ్‌లో ఉండటంతో జిల్లా న్యాయసేవా కార్యదర్శి జావేద్‌ పాషా వాటి గురించి అడిగితే సిబ్బంది నీళ్లు నమిలినట్లు సమాచారం. తాను మరోసారి తనిఖీకి వచ్చే సమయానికి పెండింగ్‌ ఉంచవద్దని, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

అధికారుల అడ్రస్‌ ఉండదు..

శిశుగృహలో నిత్యం ఉండాల్సిన అధికారులు, సిబ్బంది ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి ఉంది. బయటికి వెళ్లిన సందర్భాలలో మూమెంట్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉండగా, అస్సలు పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. ఆదివారం, పండు గలు, సెలవు రోజులతో పాటు ఇష్టానుసారంగా కార్యాలయానిరి రాకుండా ఫోన్లలోనే విధులు నిర్వహి స్తున్నారని సమాచారం. ఆయాలతో పాటు నిత్యం ఒక అధికారి అందుబాటులో ఉండాల్సి ఉండగా అమలు కావడం లేదు.

ఆరోపణలు వచ్చిన వ్యక్తిపై చర్యలేవీ...

శిశుగృహలో గత మార్చి నెలవరకు పనిచేసిన మేనేజర్‌ రాజీనామా చేసి వెళ్లాడు. అయితే అతడిపై పలు ఆర్థిక ఆరోపణలు వచ్చాయి. కార్యాలయానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు లెక్కలు చెప్పకుండా తప్పించుకు తిరిగాడని సమాచారం. సదరు మేనేజర్‌కు కేవలం మెమో ఇచ్చిన డీడబ్య్యూవో అధికారి చర్యలు తీసుకోలేదని సమాచారం. లెక్కలు చెప్పని అధికారిని ఎలా వదిలారని, అతడిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో సంబంధిత అధికారులకే తెలియాలి. మేనేజర్‌ పోస్టు 3 నెలలుగా ఖాళీగా ఉన్నప్పటికి సంబంధిత అధికారులు దరఖా స్తులను ఆహ్వానించి నెలలతరబడి ఆలస్యం చేయడం వెనుక మతలబు ఏంటో అర్ధంకాని పరిస్థితి. గతంలో ఇక్కడ పనిచేసిన ఏఎన్‌ఎంకు ప్రభుత్వ ఉద్యోగం రావ డంతో రాజీనామచేసి వెళ్లిపోయింది. అనంతరం లిస్టులో రెండవ ప్లేస్‌లో ఉన్న ఏఎన్‌ఎంకు పోస్టును కేటాయిం చారు. దీంతోపాటు సోషల్‌వర్కర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కూడా సమయపాలన పాటించకుండా శిశుగృహంలో  ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు.

చర్యలకు వెనుకాడుతున్న సంక్షేమాధికారి

శిశుగృహతో పాటు బాలరక్షాభవన్‌, బాలసదనంలో కూడా సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయినా చర్యలు తీసుకోవాల్సిన సంక్షేమాధికారి పట్టించు కోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. బాలల ప్రాంగ ణంలోకి బయటి వారిని ఎవరినీ అనుమతించ కూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ పలువురు బర్త్‌డే పార్టీల పేరుతో వేడుకలు నిర్వహిస్తుడంపై విమర్శలు వస్తున్నాయి. పలు పర్యాయాలు ఆ ప్రాంగణాలలో ప్రయివేటు వ్యక్తులు వీడి యో చిత్రీకరించినా  చర్యలు తీసుకోలేదని సమాచారం.

అన్ని సక్రమంగానే ఉన్నాయి 

జిల్లా మహిళ శిశుసంక్షేమశాఖ అధికారిణి సంధ్యారాణి

శిశుగృహంలో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారు.  అన్ని ఫైల్స్‌ అన్ని సరిచూశాము. అన్ని సక్రమంగానే ఉన్నాయి. శిశుగృహ మేనేజర్‌ పోస్టు ఈ వారంలో భర్తీచేస్తాం. దీనికి సంబంధించి 11 దరఖాస్తులు అందాయి. వీరిలో నైపుణ్యత , అనుభవం ఉన్న వ్యక్తిని సా మేనేజర్‌గా ఎంపికచేస్తాం. బాలరక్షభవన్‌లో ఎటుఏవంటి ఇబ్బందిలేదు. అందరు సమన్వయంతో పనిచేస్తన్నారు.

Updated Date - 2022-07-06T05:16:30+05:30 IST