యమపాశాలు

ABN , First Publish Date - 2022-07-03T06:28:32+05:30 IST

శ్రీసత్యసాయి జిల్లా చిల్లకొండయ్యపల్లి గ్రామంలో సంభవించిన విద్యుత ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

యమపాశాలు

  1.  ఎక్కడికక్కడే వేలాడుతున్న విద్యుత్తు తీగలు
  2.  ఏటా వందల సంఖ్యలో ప్రమాదాలు
  3. కర్రలపై వ్యవసాయ పంప్‌సెట్ల లైన్లు
  4.  వర్షాకాలంలో పెరుగుతున్న దుర్ఘటనలు


(కర్నూలు-ఆంధ్రజ్యోతి):

 శ్రీసత్యసాయి జిల్లా చిల్లకొండయ్యపల్లి గ్రామంలో సంభవించిన విద్యుత ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.  నిర్వహణ లోపమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో జిల్లాలో విద్యుత తీగల నిర్వహణ తీరును పరిశీలిస్తే.. అనేక ప్రాంతాల్లో ఇవి యమపాశాలుగా మారాయి. ఎప్పుడో వేసిన తీగలు.. నిర్వహణ అంతంతమాత్రం కావడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మూగ జీవాలతో పాటు మనుషులు కూడా మృత్యువాత పడుతున్నారు. తీగలు మరీ కిందకు వేలాడుతుండడం.. తక్కువ ఎత్తులో ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల   ప్రమాదాలకు కారణమవుతున్నాయి. జిల్లాలో ఏటా సగటున 125 వరకు విద్యుత ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిలో తమ ప్రమేయం లేదని ఆ శాఖ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. కానీ అధికశాతం సంఘటనలకు ఆ శాఖదే బాధ్యతగా తేలుతోంది. శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకున్న పరిస్థితి మన జిల్లాలో  సంభవించకుండా జాగ్త్రత్త పడాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. 

ఇదీ పరిస్థితి

ఉమ్మడి జిల్లాలో 243 విద్యుత సబ్‌ స్టేషన్లు ఉన్నాయి. వివిధ కేటగిరీల్లో విద్యుత కనెక్షన్లు 15,65,327 ఉంటే.. అందులో వ్యవసాయ ఆధారితమైనవి 1,97,708. రోజుకు 12.554 మిలియన యూనిట్ల (729 మెగా వాట్లు) విద్యుత సరఫరా అవుతోంది. 11/33, 33/132, 132/222, 222/400 కేవీ హైటెన్షన (హెచటీ), లో టెన్షన (ఎల్‌టీ) విద్యుత లైన్లు వేల కి.మీ.లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు విద్యుత లైన్ల పనులు చేస్తున్నా... నాణ్యత లోపం, నిర్వహణలో బాధ్యతారాహిత్యం... కొందరు సిబ్బందిలో నిర్లక్ష్యం... ప్రజల్లో అవగాహన లోపం వెరసి నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా మనుషులతో పాటు మూగజీవాలూ మృత్యువాత పడుతున్నాయి. ఏళ్ల క్రితం వేసిన విద్యుత లైన్లు కిందకు వేలాడుతూ... ఈదురు గాలులు..భారీ వర్షాలకు తెగి పడుతున్నాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త లైన్లు వేయడం లేదు. విద్యుత వినియోగం, సర్వీసులు భారీగా పెరిగాయి. అందుకు అనుగుణంగా లైనమైన్లను నియమించడం లేదు. సిబ్బంది కొరత వల్ల లైన్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. వీటి ఆధునికీకరణకు నిధుల కొరత కూడా అడ్డంకిగా మారింది. 

ఫ ఏటా అంతే..

 ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా పెద్ద సంఖ్యలో విద్యుత ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 2019-20లో 166, 202-21లో 153, 2021-22లో 136 విద్యుత ప్రమాదాలు సంభవించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందులో విద్యుత శాఖ ప్రమేయం లేకుండా జరిగినవే ఎక్కువని సంబంధిత అఽధికారులు పేర్కొంటున్నారు. రికార్డులకు ఎక్కనివి ఎన్నో. ప్రమాదంలో మృతి చెందితే పోస్టుమార్టం తప్పనిసరి.   ఎక్కువ శాతం కుటుంబ సభ్యులు దీనికి ఒప్పుకోడం లేదు. ఇలాంటి మరణాలు రికార్డులకు ఎక్కవు. విద్యుత షాక్‌తో మృతి చెందితే రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తారు.  కానీ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో 2021-22లో 8 మందికి మాత్రమే పరిహారం అందింది. 

ఫ నిర్వహణలో నిర్లక్ష్యం: 

 ఏటా వర్షకాలంలోనే ఎక్కువగా విద్యుత ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈదురు గాలులు, భారీ వర్షాలకు విద్యుత తీగలు తెగిపోయి... ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందు ఏప్రిల్‌, మే నెలల్లో విద్యుత లైన్లను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఎక్కడైనా స్తంభాలు వాలిపోయి ఉన్నా...  తీగలు కిందకు వేలాడుతున్నా... వాటిపై చెట్ల కొమ్మలు పెరిగిపోయినా సరిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. వారంలో ఒక రోజు విద్యుత తీగలపై ఉన్న చెట్టు కొమ్మలను తొలగించాలి.  ఈ లైన్ల నిర్వహణలో కొందరి సిబ్బంది నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ విద్యుత లైన్లు అనేకచోట్ల ప్రమాదకరంగా మారాయి. 

ఫ ఇవీ ఉదాహరణలు.. 

---------------------------------

-  హలహర్వి మండలం గూళ్యం గ్రామంలో గత ఏడాది గాలివానలకు విద్యుత తీగ తెగిపోయింది. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న గొర్రెల కాపరి తీగ తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. నేటి వరకు పరిహారం అందలేదు. అదే మండలంలో మూడేళ్లలో  ముగ్గురు మృత్యువాత పడ్డారు. హలహర్వి తహశీల్దారు కార్యాలయానికి వెళ్లే దారిలో కరెంట్‌ తీగలు బాగా కిందికి వెలాడుతూ ప్రమాదకరంగా ఉన్నా.. వాటిని సరి చేయడం లేదు. మండలంలోని చాలా ప్రాంతాల్లో ఇలానే ఉన్నాయి. 

- ఆలూరు మండలం అరికేర గ్రామంలో గత మార్చిలో జరిగిన రథోత్సవం సందర్భంగా విద్యుత తీగలు రథానికి తగిలి ఇద్దరు మృత్యువాత పడ్డారు. వ్యవసాయ లైన్లు అస్తవ్యస్తంగా మారి గత మూడేళ్లలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఆలూరు పట్టణంలో గజిబిజి విద్యుత తీగలతో జనం ప్రమాదాల భయంతో వణికిపోతున్నారు. కోతులు తీగలపై పరుగులు తీస్తుండడంతో తెగిపోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

-  మండలం కేంద్రం కోసిగిలో మూడేళ్ల క్రితం పంచాయతీ లైనమెన ఒకరు.. పొలంలో మరో రైతు విద్యుత షాక్‌తో మృతి చెందారు. కందుకూరు గ్రామంలో ఓ రైతు మృతి చెందారు. కోసిగి పోలీస్‌స్టేషన వెనుక వైపున బీసీ కాలనీలో చేతులకు అందేటంత ఎత్తులో తీగలు ఉన్నాయి. విద్యుత లైన్లు లేకపోవడంతో మూడేళ్లుగా కర్రలకు విద్యుత తీగలు ఏర్పాటు చేశారు. ఆ కాలనీ వాసులు నిత్యం భయంతో కాలం గడుపుతున్నారు.  కోసిగి వాల్మీకి నగర్‌లో ప్రధాన రోడ్డు మధ్యలో మెయిన విద్యుత స్తంభం ఉంది. వారం క్రితం దీనిని ట్రాక్టరు ఢీకొట్టింది. డ్రైవర్‌, ఆరుగురు హమాలీలకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ స్తంభాన్ని మార్చాలని కాలనీ వాసులు డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

ఫ కర్నూలు నగరంలోని అనేక ప్రాంతాల్లో చెట్ల కొమ్మల మధ్య కరెంట్‌ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. ట్రాన్సఫార్మర్లకు రక్షణ లేదు. వాటి పక్కనే జన సంచారం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయం వెంటాడుతోంది. బి.క్యాంప్‌ క్వార్టర్స్‌,  బుధవారంపేట, వడ్డేగేరి, ఓల్డ్‌ టౌన ప్రాంతాల్లో విద్యుత తీగలు యమపాశాలుగా మారాయి. తక్షణం మరమ్మతులు చేయాల్సిన అవసరాన్ని ఇవి గుర్తు చేస్తున్నాయి.

ఫ ఉమ్మడి జిల్లాలో మూడేళ్లలో జరిగిన ప్రమాదాలు: 

----------------------------------------------------------

డివిజన  2019-20 2020-21 2021-22

-----------------------------------------------------------

కర్నూలు 38 36 28

డోన 20 38 23

నంద్యాల 54 39 36

ఆదోని 54 40 49

---------------------------------------------------------

మొత్తం 166 153 136

-------------------------------------------------------

=================




Updated Date - 2022-07-03T06:28:32+05:30 IST