గజం రూ.10 వేలకు విక్రయించాల్సిందే!

ABN , First Publish Date - 2022-06-21T09:30:18+05:30 IST

ఖజానా నింపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నల్లగొండ జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.

గజం రూ.10 వేలకు విక్రయించాల్సిందే!

రూ.5 వేలు కూడా చేయని ఖాళీ స్థలాల్ని అమ్మాలంటూ అధికారులకు టార్గెట్లు


బలవంతంగా ప్రభుత్వ ప్లాట్ల విక్రయం

దయచేసి కొనండి అంటూ పలువురితో చాయ్‌ భేటీలో జిల్లా స్థాయి కీలక అధికారి వేడుకోలు

నల్గొండ జిల్లా ఎల్లారెడ్డి కేంద్రంలో ఘటన

నల్లగొండ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖజానా నింపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నల్లగొండ జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లారెడ్డిగూడెం(అద్దంకి-నార్కట్‌పల్లి హైవే)లోని ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా చేయాలని, రెండు దఫాలుగా 40ఎకరాల విస్తీర్ణాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని భూముల విక్రయంతోపాటు నల్లగొండకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్‌లో ప్రకటించారు. మొదట గజానికి రూ.10వేలు ధర నిర్ణయించారు. బహిరంగ మార్కెట్‌లో గజం రూ.5వేల విలువ చేయని ఖాళీ స్థలాలను రూ.10వేలకు విక్రయించాలంటూ అధికారుల మెడపై కత్తిపెట్టడంతో వారు నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే.. జిల్లా కలెక్టర్‌ రంగంలోకి దిగి, భారీగా ప్రచారం చేయించినా రూ.10వేల ముందస్తు బిడ్డింగ్‌ దాఖలు కాకపోవడంతో ఆ ధరను రూ.7,100కు కుదించారు. 240 ప్లాట్లు మొదటి దశలో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోగా వాస్తవ ధర అంత లేకపోవడంతో పౌరుల నుంచి స్పందన కరువైంది. ఎలాగైనా విక్రయించాల్సిందేనని సచివాలయ అధికారుల నుంచి జిల్లా అధికారులపై ఒత్తిడి రావడం, ఈ వ్యవహారం తమ భవిష్యత్తు పోస్టింగ్‌లకు ప్రమాదకరమని భావించిన కీలక అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, ఎక్సైజ్‌, ఆర్టీవో వంటి శాఖల అధికారులకు కోటా విధించారు. అనివార్యం కావడంతో అధికారులు కూడా బెదిరింపులు మొదలు పెట్టారు. ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీ, పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులు కొనాల్సిందేనని, లేదంటే తగిన ఫలితాలుంటాయని హెచ్చరించారు. 


ఏకంగా కేంద్ర సర్వీసు అధికారి రంగంలోకి..

కనీస టార్గెట్‌ చేరుకోలేమని చివరి క్షణంలో భావించిన శాఖల అధికారులు ఆ బాధ్యతను జిల్లాలోని ఓ కీలక అఽధికారి చేతిలో పెట్టారని సమాచారం. ఆయన భవిష్యత్తు పోస్టింగ్‌ కోసం స్థాయిని కూడా పక్కనపెట్టి లారీ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు, ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులను ఒక్కొక్కరిగా తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని చాయ్‌ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఏకంగా ఆ స్థాయి అధికారి కూర్చోబెట్టుకొని ఛాయ్‌ తాగించి బతిమాలుతుండటంతో కొందరు ఏడు నుంచి ఎనిమిది ప్లాట్ల చొప్పున కొనుగోలు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో సోమవారం జరిగిన బహిరంగ వేలంలో మొదటి దశలో 240 ప్లాట్లు విక్రయించేందుకు అఽధికార యంత్రాంగం అంతా రంగంలోకి దిగినా 165 ప్లాట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇంకా 75 ప్లాట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది మార్చి 14 నుంచి 17 వరకు బహిరంగ వేలంలో రూ.31.95 కోట్లు రాబట్టారు. రెండో దశలో ఈ నెల 20 నుంచి 26 వరకు 363 ఓపెన్‌ ప్లాట్లు, 253 రాజీవ్‌ స్వగృహ ఇళ్లు విక్రయించాలని నిర్ణయించి ప్రచారం చేశారు. ఈసారి కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. అయితే మొదటి దశలో అష్టకష్టాలు పడి విక్రయించిన అధికారికి గత కొద్ది రోజుల క్రితం అనుకున్న మేరకు మంచి జిల్లాలో పోస్టింగ్‌ దొరకగా స్థానికంగా అదనపు కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. అధికారి మారడంతో మొదటి దశలో జరిగిన స్థాయి ప్రయత్నాలకు గండిపడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రేటు అధికంగా ఉండటం, రాజీవ్‌ స్వగృహ ఇళ్లు నాసిరకంగా ఉండటంతో ఎవరూ అటు వైపు చూడటం లేదు. మొదటి రోజు  363 ఓపెన్‌ ప్లాట్లకు గాను రెండు, 253 రాజీవ్‌ స్వగృహ ఇళ్లకు గాను 2 మొత్తం నాలుగు ఆస్తులనే విక్రయించడం కొసమెరుపు.

Updated Date - 2022-06-21T09:30:18+05:30 IST