ప్ర‘గతి’.. తప్పుతోంది

ABN , First Publish Date - 2021-05-30T05:21:54+05:30 IST

వైసీపీ రెండేళ్ల పాలనలో జిల్లా ప్రగతి కుంటుపడింది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వైసీపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నా.. జిల్లాలో అభివృద్ధి పనులు అటకెక్కాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాలపై కక్ష సాధింపు చర్యలు... ప్రత్యర్థులపై తప్పులు కేసులు బనాయించడం తప్ప.. పాలనపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి జిల్లావాసులకు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్ర‘గతి’.. తప్పుతోంది
అర్ధాంతరంగా నిలిచిన కలెక్టరేట్‌ నిర్మాణ పనులు

- హామీలు గాలికొదిలేసిన ప్రభుత్వం 

- నవరత్నాల అమలు పేరుతో కాలక్షేపం

- సాగు, తాగునీటి ప్రాజెక్టుల ఊసేలేదు

- కొన్ని ప్రారంభించినా నత్తనడకన పనులు

- ఇదీ వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన తీరు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ రెండేళ్ల పాలనలో జిల్లా ప్రగతి కుంటుపడింది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వైసీపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నా.. జిల్లాలో అభివృద్ధి పనులు అటకెక్కాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాలపై కక్ష సాధింపు చర్యలు... ప్రత్యర్థులపై తప్పులు కేసులు బనాయించడం తప్ప.. పాలనపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి జిల్లావాసులకు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనులు చేపట్టకపోగా, విద్య, వైద్యం, సాగునీటి రంగాలు కుంటుపడ్డాయని పేర్కొంటున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలున్న ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోవడంతో సిక్కోలు ప్ర‘గతి ’ తప్పిందని జిల్లా వాసులు అభిప్రాయ పడుతున్నారు. వైసీపీ పాలనకు నేటితో(ఆదివారం) రెండేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో.. ఆపార్టీ అధినేత ఇచ్చిన హామీలు.. ఏ మేరకు నెరవేరాయనే దానిపై నియోజకవర్గాల వారీగా ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనాత్మక కథనం. 

 శ్రీకాకుళం...

శ్రీకాకుళం నియోజకవర్గంలోని పాత్రునివలసలో నిర్మించిన టిడ్కో ఇళ్ల అపార్ట్‌మెంట్‌కు లిఫ్టు, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ లేదు. ఈ విషయాన్ని పాదయాత్ర సమయంలో జగన్మోహన్‌రెడ్డి దృష్టికి లబ్ధిదారులు తీసుకెళ్లారు. తాము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని నాడు జగన్‌ హామీ ఇచ్చారు. కానీ నేటికీ వాటి ఊసెత్తడం లేదు. అత్యాధునిక వసతులు, సువిశాలమైన భవనాలతో నిర్మించతలపెట్టిన కొత్త కలెక్టరేట్‌ సముదాయం పనులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా, నేటికీ కొలిక్కి రావడంలేదు. తొలినాళ్లలో చకచకా సాగిన నిర్మాణ పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో  కలెక్టరేట్‌ సముదాయం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదని జిల్లావాసులు నిరాశ చెందుతున్నారు. 


  ఎచ్చెర్ల...

ఎచ్చెర్ల మండలంలో 11 గ్రామ పంచాయతీలకు సాగునీరు అందించే జైకా నిధులతో చేపట్టిన నారాయణపురం ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎస్‌.ఎం.పురంలోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు తరగతులు నూజివీడు క్యాంపస్‌లో జరుగుతున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఎచ్చెర్ల, లావేరు మండలాల్లో వివిధ గ్రామాలకు నేటికీ మడ్డువలస మిగులు జలాలు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రణస్థలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు హామీ అమలు కాలేదు.


 పాతపట్నం....

పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు ఏళ్ల తరబడి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వంశధార, ఆఫ్‌షోర్‌ నిర్వాసితులకు 2013 చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదు. ఇటీవల బడ్జెట్‌లో రూ.42 కోట్లు కేటాయించారు. ఇవి అధికారుల జీతాలకే సరిపోవని.. నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. పెండింగ్‌ ప్యాకేజీలు సైతం ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. కొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో అధికంగా నిర్వాసితులు ప్యాకేజీల కోసం ఎదురుచూస్తున్నారు. ఎల్‌.ఎన్‌.పేట మండలంలో వంశధారపై  కరకట్టలు నిర్మించకపోవడంతో పంటలు పండక  రైతులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ హయాంలో పనులు ప్రారంభించారు. ఇంకా హిరమండలం నుంచి ఎల్‌.ఎన్‌.పేట వరకు సుమారు పది కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది. నిధులు కేటాయించకపోవడంతో కరకట్టల పనులు ముందుకు సాగడం లేదు. హిరమండలం మండలంలో జిల్లేడుపేట వంతెన హామీ కార్యరూపం దాల్చలేదు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. 

 

రాజాం...

రాజాం ప్రధాన రహదారి పనులు రెండేళ్లవుతున్నా పూర్తికాలేదు. వంద పడకల ఆసుపత్రిలో పూర్తిస్థాయి సిబ్బంది నియామకాల హామీ నెరవేరలేదు. ఎన్నికల హామీల్లో భాగంగా రూ.30కోట్లు ఇస్తామని ప్రకటించిన సీఎం కేవలం రూ.10కోట్లు మాత్రమే విడుదల చేశారు. వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని చెప్పినా... ఇంతవరకు   ఊసేలేదు. సంతకవిటి మండలం నాగావళి నదిపై వంతెన పనులకు మోక్షం లేదు. 

 


టెక్కలి....

ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ద్వారా 25వేల ఎకరాలకు సాగునీరు అందించాలని దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం 2008లో రూ.127 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. తరువాత టీడీపీ ప్రభుత్వం దీని అంచనా వ్యయం రూ.493 కోట్లకు పెంచింది. జగన్మోహన్‌రెడ్డి అఽధికారంలోకి వచ్చిన తరువాత ఆఫ్‌షోర్‌ పూర్తి చేస్తానని చెప్పి.. రెండేళ్లు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ‘భావనపాడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టు’కు శంకుస్థాపన చేస్తానని జగన్‌ పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. నేటికీ అమలుకు నోచుకోలేదు.  

పలాస....

పలాస మండలం రేగులపాడు నుంచి ఐదు గ్రామాలకు సంబంధించి 25వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు... పలాస,కాశీబుగ్గ పురపాలక సంఘానికి తాగునీరు అందించే ఆఫ్‌షోర్‌ జలాశయం నిర్మాణం కలగానే మిగిలింది. పాదయాత్ర సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. కానీ నేటికీ నెరవేర్చలేదు.  కాశీబుగ్గలో రూ.50 కోట్లతో కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ కేంద్రం, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు ప్రస్తుతం నిలిపేశారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట మత్స్యకార గ్రామంలో రూ.11 కోట్లతో తలపెట్టిన ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ పనులు జరగడం లేదు. ఉద్దానం ప్రాంత సమగ్ర రక్షిత నీటి పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. 

 

ఇచ్ఛాపురం.....

సోంపేట-కవిటి- ఈదుపురం రోడ్డు పనులు రూ.30 కోట్ల అంచనాతో టీడీపీ హయాంలో  ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కిడ్నీ బాధితులకు  క్రియాటిన్‌ 5 దాటిన వారికి మందుల కోసం నెలకు రూ.5 వేలు ఇస్తామన్న హామీ నెరవేరలేదు. ఇచ్ఛాపురంలో మినీ స్టేడియం ఏర్పాటు హామీ కార్యచరణకు నోచుకోవడం లేదు.  కంచిలి మండలంలో గంగాసాగరం రిజర్వాయర్‌ పనులు చేస్తామన్నప్పటికీ.. కనీసం ముందడుగు పడలేదు.


నరసన్నపేట.....

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న నరసన్నపేటను సర్వసుందర పట్టణంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జమ్ము జంక్షన్‌ నుంచి సత్యవరం జంక్షన్‌ వరకు రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు నిధులు విడుదలైనా పనులు జరగడం లేదు. రాజుల చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం రూ.48 లక్షలతో పనులు చేపట్టింది. ఆ చెరువును మరింత అభివృద్ధి చేస్తానని వైసీపీ నాయకులు చెప్పారు. ఇంతరవరకు దానివైపు కన్నెత్తి చూసిన దాఖలు లేవు. వంశధార ఎడమ కాలువపై జలుమూరు మండలం కరకవలస నుంచి పోలాకి మండలం పల్లిపేట వరకు కరకట్టల పనులు 20 శాతమే పూర్తయ్యాయి. వనిత మండలం -గార  మధ్య వంశధార నదిపై వంతనె నిర్మాణ పనులు పూర్తికాలేదు. 


పాలకొండ....

పాలకొండ నియోజకరవ్గంలో రైతుల కోసం తోటపల్లి కాలువ ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రెండేళ్లలో కనీసం ఆ పనులకు శంకుస్థాపన కూడా జరగలేదు. పాలకొండ, బూర్జ, వీరఘట్టం మండల రైతులు ఈ కాలువ ఆధారంగానే సాగు చేస్తుంటారు. ఆధునికీకరణ పనులు జరగక రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. 


ఆమదాలవలసలో...

ఆమదాలవలసలో 2003లో మూతపడిన సహకార చక్కెర కర్మాగారాన్ని అధికారంలోకి రాగానే తెరుస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా జగన్‌ కూడా చెప్పారు. రెండేళ్లయినా హామీ అమలు కాలేదు. సంతకవిటి మండలం వాల్తేరు, ఆమదాలవలస ఇసకలపేట గ్రామాల మధ్య నాగావళి నదిపై వంతెన నిర్మాణంపై ప్రస్తుత స్పీకర్‌ తమ్మినేని హమీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. 

Updated Date - 2021-05-30T05:21:54+05:30 IST