Chandrababu కుప్పం రావడంతో.. TDPలో అనూహ్యంగా..!

ABN , First Publish Date - 2021-10-30T07:27:33+05:30 IST

టీడీపీ అధినేత ఎనిమిది నెలల కిందటి పర్యటనకు, తాజా రాకకూ అటు ....

Chandrababu కుప్పం రావడంతో.. TDPలో అనూహ్యంగా..!
కుప్పం సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు

  • టీడీపీలో అనూహ్య కదలిక
  • అధినేతను స్వాగతించేందుకు పోటెత్తిన పసుపు సైన్యం

తిరుపతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనతో జిల్లా టీడీపీలో అనూహ్య కదలిక వచ్చింది. పుంగనూరు, పీలేరు, పలమనేరు నియోజకవర్గాల నుంచీ భారీఎత్తున పార్టీ శ్రేణులు కుప్పం వైపు కదిలాయి. పలు ఇతర నియోజకవర్గాల నుంచీ గణనీయంగా ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు కుప్పం బాట పట్టారు.తమ అభిమాన పార్టీ అధినేతను స్వాగతించేందుకు కర్ణాటక సరిహద్దులకు పోటెత్తారు. దీంతో కుప్పం నుంచీ రాళ్ళబూదుగూరు దాకా మార్గమంతా పసుపుమయమైంది.


టీడీపీ అధినేత ఎనిమిది నెలల కిందటి పర్యటనకు, తాజా రాకకూ అటు సొంత జనం, ఇటు జిల్లా టీడీపీ శ్రేణులు స్పందించిన తీరుకు పొంతనే లేదు. మునుపటి పర్యటనలో నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో, ప్రజల్లో స్తబ్దత, నిర్లిప్తత కనిపించగా, జిల్లావ్యాప్తంగా నేతలు, కార్యకర్తలూ కుప్పానికి వెళ్ళి పెద్దగా కలిసిందేమీ లేదు. కానీ శుక్రవారం ఆయన రాకకు పార్టీ శ్రేణుల నుంచీ, జనం నుంచీ వ్యక్తమైన స్పందన చూస్తే చంద్రబాబు అధికారంలో వున్నట్టుగానే అనిపించిందంటే అతిశయోక్తి కాదు.


పుంగనూరు టీడీపీ నూతన ఇన్‌ఛార్జిగా నియమితులైన చల్లా రామచంద్రారెడ్డి అలియాస్‌ చల్లా బాబు తన సత్తా నిరూపించుకున్నారు. నియోజకవర్గం నుంచీ ప్రత్యేకించి రొంపిచెర్ల, సోమల మండలాల నుంచీ 300 వాహనాల్లో ఆయన అనుచరులతో కుప్పం తరలి వెళ్ళారు. అక్కడ కర్ణాటక సరిహద్దుల్లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఇక పీలేరు నియోజకవర్గం నుంచీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి వెంట వందకు పైగా వాహనాల్లో ఆయన అనుచరగణం కుప్పం వెళ్ళి చంద్రబాబును స్వాగతించింది.పలమనేరు నియోజకవర్గం నుంచీ ముఖ్యంగా వి.కోట మండలం నుంచీ వెయ్యికి పైగా ద్విచక్ర వాహనాల్లో తెలుగుయువత కార్యకర్తలు మాజీ మంత్రి అమరనాధరెడ్డి వెంట కుప్పం బయల్దేరి వెళ్ళి అధినేతకు ఆహ్వానం పలికారు. ఇక జిల్లావ్యాప్తంగా ముఖ్యనేతలంతా కుప్పంలో ప్రత్యక్షం కాగా పలు నియోజకవర్గాల నుంచీ గణనీయ సంఖ్యలో ద్వితీయ శ్రేణి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు స్వచ్ఛందంగా కుప్పం తరలి వెళ్ళారు. 


కుప్పంలో కదం తొక్కిన పసుపు దండు

బయటి నియోజకవర్గాల నుంచీ వచ్చిన పార్టీ శ్రేణుల సంగతి పక్కన పెడితే చంద్రబాబు పర్యటనలో కుప్పం నియోజకవర్గ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. వాస్తవానికి ఇటీవల వరుసగా జరిగిన పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ బలహీనపడ్డట్టుగా ప్రచారం జరిగింది. ఆ మేరకు పార్టీ శ్రేణులు డీలా పడ్డాయన్న భావన బయట కూడా వ్యాపించింది. అయితే శుక్రవారం చంద్రబాబు పర్యటనలో పరిస్థితి చూస్తే ఆ ప్రచారాల డొల్లతనం బయటపడినట్టయింది. ఆయన్ను స్వాగతించేందుకు రాళ్ళబూదుగూరు సమీపంలో కర్ణాటక సరిహద్దుకు ఉవ్వెత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చిన తీరు చంద్రబాబు సీఎం హోదాలో వస్తున్నట్టే అనిపించింది. ఆయన పర్యటనలో అడుగడుగునా ఎదురైన స్వాగతాలు, జనం ఉత్సాహం అదే భావనను కలిగించాయి. ఇక పట్టణంలో చంద్రబాబు సభకు జనం స్పందన ప్రత్యేకంగా కనిపించింది. తరచి చూస్తే ఇటీవల మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి, తదనంతర పరిణామాల తాలూకూ భావోద్వేగాలు కుప్పం టీడీపీ కార్యకర్తల్లోనూ, జనంలోనూ ప్రస్ఫుటంగా వెల్లడవుతోంది. కార్యకర్తల ప్రతి కదలికలో పార్టీ సత్తా చూపాలన్న కసి కనిపించింది. వారి దూకుడు రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఎవరైనా సులువుగా గుర్తించగలిగేలా కొనసాగింది. ఈ పరిణామాలతో పార్టీ వర్గాలు ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. కుప్పంలో తమ బలం ఏమాత్రం చెక్కుచెదరలేదని అధినేత తొలిరోజు పర్యటన నిరూపించిందని పార్టీ వర్గాలు సంబరపడుతున్నాయి.

Updated Date - 2021-10-30T07:27:33+05:30 IST