పోరుబాటలోనే పసుపు రైతు

ABN , First Publish Date - 2021-03-28T08:25:07+05:30 IST

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుచేసే ప్రతిపాదన ఏదీలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తేల్చేసింది. టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేష్‌ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు...

పోరుబాటలోనే పసుపు రైతు

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుచేసే ప్రతిపాదన ఏదీలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తేల్చేసింది. టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేష్‌ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అదే క్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్‌ రుపాల సమాధానం ఇచ్చారు. ‘‘సుగంధ ద్రవ్యాల బోర్డు 50 ద్రవ్యాలకు సంబంధించి పనిచేస్తోంది. పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేస్తే మిగతావాటికీ చేయాల్సి వస్తుంది. ఆ అవసరంలేదు. మీకు పసుపు బోర్డు పేరు కావాలేకానీ... పని కాదని అనిపిస్తోంది. ఈ విషయంలో రాజకీయం చేయడం సరికాదు.’’ అని పురుషోత్తం రూపాల తేల్చిచెప్పారు. అటు రాజ్యసభలో, ఇటు లోక్‌సభలో కేంద్ర మంత్రుల నుంచి స్పష్టమైన సమాధానాలు రావటంతో ఇక కేంద్ర ప్రభుత్వానికి ‘పసుపు బోర్డు’ ఉద్దేశ్యంలేదని తేలిపోయింది.


పసుపు సాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. 2017-–18 లో 2,94,560 మెట్రిక్‌ టన్నులు, 2018-– 19 లో 3,45,270 మెట్రిక్‌ టన్నులు, 2019-–20లో 3,86,596 మెట్రిక్‌ టన్నుల పసుపు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యింది. ఈ ఏడాది కూడా లక్ష ఎకరాల్లో రైతులు పసుపు సాగుచేశారు. ఉమ్మడి నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో పసుపు సాగు విస్తీర్ణం ఎక్కువ. ఇందులో ఆర్మూర్‌ ప్రాంతం ప్రధానంగా పసుపు ఉత్పత్తి కేంద్రంగా విలసిల్లుతోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే నాణ్యమైన పసుపును ‘నైజామ్‌ కా మాల్‌’ అని విదేశాల్లో ఎక్కువ ఇష్టపడతారు. 2017–18లో 1,07,300 మెట్రిక్‌ టన్నులు, 2018–19లో 1,33,600 మెట్రిక్‌ టన్నుల పసుపు తెలంగాణ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యింది. ఇప్పటికే పొగాకు, కొబ్బరి, కాఫీ, టీ, రబ్బరుకు ప్రత్యేక బోర్డులు ఉన్నందున, అవి ఒకే పంటపై ఫోకస్‌ చేయటానికి ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, పసుపు ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన నిజామాబాద్‌ జిల్లాలో ‘పసుపు బోర్డు’ ఏర్పాటుచేస్తే రైతులకు లాభసాటి ధర లభిస్తుందని, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందని, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయని, ఉప ఉత్పత్తులు పెరుగుతాయని, బై ప్రొడక్టుల ఎగుమతులు పెరగటంద్వారా మేలు కలుగుతుందనే భావన పసుపు రైతుల్లో ఉంది. ఎక్కడో కొచ్చిన్‌లో ఉన్న స్పైసెస్‌ బోర్డు తెలంగాణ పసుపుపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశంలేదని, 75 ఉత్పత్తుల్లో పసుపును కూడా ఒక ఉత్పత్తిగా మాత్రమే చూస్తారనే ఆందోళన రైతులది. పసుపు బోర్డు స్థానికంగా ఉంటే... రైతులు వ్యాపారులకు కాకుండా నేరుగా బోర్డుకే విక్రయించుకోవటంతో ధర ఎక్కువ వస్తుంది. ప్రస్తుతం రైతులు ఎకరం పసుపు సాగు చేయటానికి రూ. 1.20 లక్షల పెట్టుబడి పెడుతున్నారు. ఒక క్వింటాలు పసుపు ఉత్పత్తికి సగటున రూ.6 వేలు ఖర్చు చేస్తున్నారు. ఎకరానికి గరిష్ఠంగా 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా ప్రస్తుతం ఉన్న ధర రూ.6 వేల ప్రకారం చూస్తే రూ.1.20 లక్షల ఆదాయం వస్తుంది. రైతు కుటుంబం ఆరుగాలం శ్రమ పడుతుండగా, లాభం వచ్చే పరిస్థితులు లేవు. బోర్డుతోపాటు ప్రాసెసింగ్‌ యూనిట్లు, పరిశోధనలు, ల్యాబొరేటరీలు వస్తే, పసుపు ఆధారిత ఉత్పత్తులు... కాస్మొటిక్స్‌, ఔషధాలు తయారుచేస్తే వ్యాపారం మరింత లాభసాటిగా మారుతుంది. రైతులకు బోనస్‌లు ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. మేలురకం విత్తనం రైతులకు సరఫరా చేస్తే... ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగే అవకాశం గణనీయంగా ఉంటుంది. 


ఈ నేపథ్యంలోనే, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ‘పసుపు బోర్డు’ అంశమే ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. 2014 సార్వత్రక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పసుపు బోర్డునే ప్రధాన ఎన్నికల అస్త్రంగా వాడుకొన్నారు. నన్ను గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకొస్తానని రైతులకు హామీ ఇచ్చినమేరకు శక్తిమేర ప్రయత్నాలు కూడా చేసారు. కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని పలుమార్లు కలిసి బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను వివరించినా ఫలితం లేకపోయింది. దీనితో, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పసుపు రైతులు ఆమెపై కయ్యానికి కాలు దువ్వారు. ముఖ్యమంత్రి కూతురనే అంశాన్ని కూడా పట్టించుకోకుండా ఎదురుతిరిగారు. పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయడమే కాక, కవితను ఓడించటమే లక్ష్యంగా 176 మంది రైతులు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచి సుమారు లక్ష ఓట్లు సాధించారు కూడా. అప్పట్లో కవిత ఓటమి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ ప్రత్యామ్నాయంగా కనిపించారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తా, ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పిస్తా, ఈ రెండు హామీలు నెరవేర్చని పక్షంలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ ఎన్నికల ముందు ఏకంగా ‘బాండ్‌ పేపర్‌’ రాసిచ్చి రైతుల ఓట్లు కొల్లగొట్టారు. బీజేపీ ముఖ్యనేతలు రాజ్‌నాథ్‌సింగ్‌, ప్రకాశ్‌ జవదేకర్‌, రాంమాధవ్‌లు కూడా ఎన్నికల ప్రచారంలో పసుపు బోర్డు హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీ అనే తేడాలేకుండా రైతులు గంపగుత్తగా ఓట్లేసేసరికి నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ చరిత్రలో బీజేపీ తొలిసారి ఘన విజయం సాధించింది. కేవలం ‘పసుపు బోర్డు’ హామీని నమ్మి 2019 ఎన్నికల్లో అర్వింద్‌ను గెలిపించిన మాట వాస్తవం. కానీ, ఎన్నికల తర్వాత నెలలు గడుస్తున్నా బీజేపీ ఎంపీ పసుపు బోర్డు ఊసెత్తకపోయేసరికి రైతులు మళ్లీ నిరసనలు, ఆందోళనలు, పాదయాత్రలు మొదలుపెట్టారు. అర్వింద్‌ మాటమార్చి బోర్డు వల్ల లాభంలేదని, అంతకుమించి లాభం కలిగేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని కొంతకాలంగా చెబుతూ వచ్చిన నేపథ్యంలో, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ నిరుడు ఒక ప్రకటన చేస్తూ, స్పైసెస్‌ బోర్డు రీజినల్‌ సెంటర్‌ ద్వారా పసుపు బోర్డు కంటే రైతులకు ఎక్కువ లాభం కలుగుతుందని ప్రకటించారు. అందులో భాగంగానే నిజామాబాద్‌లోని కార్యాలయం స్థాయిని డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయికి పెంచినా, ఇది రైతులను ఏమాత్రం సంతృప్తిపరచలేదు. ఏడాదిన్నరకాలంగా వారు నిరసనలు తెలుపుతున్నారు, అర్వింద్‌ రాజీనామా డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు, తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు ఆలోచన, ప్రతిపాదన, ఉద్దేశ్యం తమకు లేదని కేంద్రమంత్రులు అటు లోక్‌సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ విస్పష్టంగా ప్రకటించడంతో ఎంపీ అర్వింద్‌పై రైతుల ఒత్తిడి మరింత పెరిగింది. ‘బోర్డు తేలింది... రాజీనామా మిగిలింది!’ అంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు ప్రతిగా ఆయన టీఆర్‌ఎస్‌ నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ పరస్పర విమర్శలనూ, రాజకీయాన్నీ అటుంచితే, పసుపు బోర్డుకోసం ఎన్నో ఏళ్ళుగా తపిస్తున్న రైతులకు మాత్రం అంతిమంగా అన్యాయమే జరిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున అప్పట్లో ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవితగానీ, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ అయిన అర్వింద్‌ కానీ పసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేర్చలేదు. దశాబ్దాలుగా తాము చేస్తున్న పోరాటాలకు విలువలేకుండా పోతున్నదనే బాధ రైతు కుటుంబాల్లో ఉంది. పసుపు బోర్డు ఇచ్చేదిలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసినంత మాత్రాన రైతులు మిన్నకుండే పరిస్థితి లేదు. ఎమ్మెస్పీ ఉన్న పంట ఉత్పత్తుల జాబితాలో పసుపును చేర్చి, క్వింటాలుకు రూ. 15 వేల కనీస మద్దతు ధర చెల్లించాలని, పసుపు బోర్డు ఏర్పాటుచేయాలనే డిమాండ్లతో వారు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. అనేక అంశాల్లో పరస్పరం సహకరించుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు బోర్డు స్థాపనకు ఉమ్మడిగా కృషిచేసి తమకు మేలు చేకూర్చాలని రైతులు కోరుతున్నారు.

రాజు వేములపల్లి

Updated Date - 2021-03-28T08:25:07+05:30 IST