యువ సైన్యమే అగ్నిపథ్ లక్ష్యం

ABN , First Publish Date - 2022-06-21T06:38:51+05:30 IST

ఆధునిక రక్షణ అవసరాలకు తగ్గట్లుగా భారతదేశ సైనిక బలాన్ని పెంపొందించుకోవాలన్న ఆలోచన చాలాకాలంగా ఉన్నది. ప్రజలు చెల్లించే పన్నులతోనే ఏ ప్రభుత్వ వ్యవస్థ అయినా నడుస్తుంది...

యువ సైన్యమే అగ్నిపథ్ లక్ష్యం

ఆధునిక రక్షణ అవసరాలకు తగ్గట్లుగా భారతదేశ సైనిక బలాన్ని పెంపొందించుకోవాలన్న ఆలోచన చాలాకాలంగా ఉన్నది. ప్రజలు చెల్లించే పన్నులతోనే ఏ ప్రభుత్వ వ్యవస్థ అయినా నడుస్తుంది. మన రక్షణ వ్యవస్థ కూడా అందులో భాగమే. అయితే మారుతున్న అంతర్జాతీయ రక్షణ వాతావరణం, చైనా, పాకిస్థాన్ వంటి పొరుగుదేశాలతో ఏర్పడుతున్న సంఘర్షణ పరిస్థితుల్లో మన రక్షణ వ్యవస్థ ఆధునిక అవసరాలకు తగ్గట్లు ఉన్నదా అన్న చర్చ చాలాకాలంగా సాగుతోంది. 


మన సైనికుల సగటు వయస్సు ఇతర దేశాల సైనికుల సగటు వయస్సుతో పోలిస్తే ఎంతో ఎక్కువ. యుద్ధరంగంలో వేగంగా శత్రువుపై దాడి చేయగల శక్తిగల వారు సైన్యంలో తగ్గిపోతున్నారు. బాగా లావుగా ఉన్నవారు, యుద్ధం చేయలేని వారు పెరిగిపోతున్నారు. మన సైన్యంలో ప్రతి డివిజన్‌కూ ఇలాంటి వారు సగటున 8,829 మంది ఉంటే, పాకిస్థాన్ సైన్యంలో 2,307 మంది మాత్రమే ఉన్నారు. చైనా సైన్యంలో ఇలాంటి వారు కేవలం వేయి మందే ఉన్నారు. నిజానికి 1977లోనే నాటి సైనిక దళాధిపతి టిఎన్ రైనా నేతృత్వంలో కెవి కృష్ణారావు, కె.సుందర్జీ, ఎంఎల్ చిబ్బర్‌లతో ఏర్పర్చిన కమిటీ సరఫరా, ఆర్డినెన్స్, మెడికల్ విభాగాల్లో చాలా మార్పులు చేసింది కాని సైనిక దళాల్లో మాత్రం ఈ మార్పులు అంతగా జరగలేదు. వయస్సు అనేది ఇండియన్ ఆర్మీకి సమస్యగా మారింది. కమాండింగ్ అధికారి స్థాయికి వచ్చే వారి వయస్సు 45 ఏళ్లు ఉంటే, 30 ఏళ్ళు దాటిన సైనికులకు వారు నాయకత్వం వహించే పరిస్థితి నెలకొన్నది. 1963-–67 మధ్య భారత సైన్యం 2 లక్షల నుంచి 8.5 లక్షలకు పెరిగింది. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు యువ రక్తం ఉప్పొంగుతున్న సైనికులు రెట్టించిన ఉత్సాహంతో శత్రుసేనను ఢీకొని చిత్తు చేశారు. ఇవాళ యువ శక్తి కన్నా మధ్య వయస్సు గల వారితో సైన్యం నిండిపోయింది. ప్రతి ఏడాదీ పదవీవిరమణ చేసే సైనికుల సంఖ్య పెరిగిపోయింది. దీని వల్ల కోట్లాది రూపాయల పింఛను వారికి చెల్లించాల్సి వస్తోంది. ఇవాళ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్న వారి సంఖ్యే ఏటా 18 వేల మందికి పైగా ఉంటుంది. 1965కు ముందు సైన్యంలో పదవీ విరమణ వయస్సు ఏడు సంవత్సరాలే కాగా, దాన్ని 17 సంవత్సరాలకు పెంచారు. 1985లో యుద్ధం చేసే యూనిట్లలో పనిచేసే వారు ఏడేళ్లు మాత్రమే అంటే దాదాపు 25 ఏళ్ల వరకే పనిచేయాలని, సాంకేతిక, ఇతర నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో చేరిన వారు 55 ఏళ్ల వరకు పనిచేయవచ్చని ప్రతిపాదించారు. యుద్ధం చేసే యూనిట్లలో పనిచేసే వారిని ఏడేళ్ల తర్వాత పాక్షిక నైపుణ్యం గల డ్రైవర్లు, రేడియో ఆపరేటర్ల వంటి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచించారు. కాని ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఈ ప్రతిపాదనను అమలు చేయలేదు.


శత్రు దాడుల నుంచి దేశాన్ని రక్షించడం కోసం యువరక్తం ఉప్పొంగే విధంగా సైన్యాన్ని తయారు చేయాలనేదే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. చైనాలో 18-–20 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి నిర్బంధ సైనిక శిక్షణ లభిస్తుంది. 40 రోజుల కనీస శిక్షణ లభిస్తుంది. వారు కనీసం రెండు సంవత్సరాలు పనిచేయాలి. ఫ్రాన్స్‌లో ఏడాది కాంట్రాక్టు ప్రకారం కాని, 3-5 ఏళ్ల కాంట్రాక్టు ప్రకారం కాని సైన్యంలో చేరవచ్చు. వారికి 12 వారాల శిక్షణ లభిస్తుంది. అమెరికాలో కూడా నాలుగేళ్ల క్రియాశీలక సర్వీసులో చేరేందుకు యువకులకు అవకాశాలు కల్పించారు. మరో నాలుగేళ్లు రిజర్వు డ్యూటీలో ఉండేందుకు వీలున్నది. బ్రిటన్‌లో కూడా స్వచ్ఛందంగా సైన్యంలో చేరి నాలుగేళ్ల వరకు పనిచేసే అవకాశం కల్పించారు. 12 ఏళ్లు పనిచేస్తేనే పింఛను లభిస్తుంది, ఇజ్రాయిల్‌లో కూడా అంతే. ఇక్కడ తప్పనిసరిగా పురుషులు 32 నెలలు, స్త్రీలు 24 నెలలు క్రియాశీలకంగా పనిచేయాల్సి ఉంటుంది. రష్యాలో కూడా ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు తప్పనిసరి సైన్యంలో పనిచేసే అవకాశాలను కల్పించారు. ఇక్కడ కాంట్రాక్టు పద్ధతి ఉంటుంది. ఇలా వివిధ దేశాల్లో ఉన్న విధానాలను పరిశీలించిన తర్వాతే మన దేశంలో అగ్నిపథ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో యువత అత్యధికంగా ఉంటుంది. 13 నుంచి 35 ఏళ్ల వయస్సున్న వారే 40 శాతానికి పైగా ఉంటారు. పాతికేళ్ల లోపు వయసున్న వారు దాదాపు 47 శాతం ఉంటారు. దీన్ని అనుకూలంగా ఉపయోగించుకుని యువతకు ఎప్పటికప్పుడు అవకాశాలు కల్పించేందుకే అగ్నిపథ్ పథకాన్ని రూపొందించారు. 17–21 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతకు సైన్యంలో అవకాశాలు కల్పించి ఆరు నెలల పాటు కఠోర శిక్షణ నిచ్చి మాతృభూమి కోసం పోరాడేలా చేయాలన్నదే మోదీ సంకల్పం. క్రమంగా దేశంలో ప్రతి కుటుంబంలోనూ ఒక అగ్నివీరుడు ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది.


దారుణమేమంటే ఇంత మంచి పథకాన్ని ప్రశంసించే బదులు ప్రజల్లో అనేక అపోహలు కల్గించేందుకు, యువతను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు పూనుకుంటున్నాయి. నాలుగేళ్ల తర్వాత రోడ్డు మీదకు రావల్సి వస్తుందని చెబుతున్నాయి. కాని దేశంలో యువత సుశిక్షితంగా మారుతుందన్న విషయాన్ని ఎవరూ చెప్పడం లేదు. సుశిక్షిత యువతకు ఎక్కడైనా అవకాశాలు లభిస్తాయన్న విషయం వారికి తెలిసినా దాన్ని కప్పిపుచ్చుతున్నారు. ఇది ఉద్యోగాలకు సంబంధించిన విషయం కాదు. దేశంలో యువతను నిరంతరం సుశిక్షితంగా, దేశభక్తులుగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి సంబంధించిన విషయం. ప్రతి ఏడాదీ 18వేల మంది తమంతట తాము స్వచ్ఛందంగా పదవీవిరమణ చేసి అనేక ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతున్నారు. అనేక ప్రభుత్వరంగ సంస్థల్లోనూ, ప్రైవేట్ సంస్థల్లోనూ వారికి ప్రాధాన్యత పూర్వకంగా ఉద్యోగాలు లభిస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమి మారింది? ఇప్పుడు కూడా పదవీ విరమణ చేసిన అగ్నివీరులకు అవకాశాలు ఏమీ తగ్గవు.


నిజానికి కేవలం బిజెపియేతర రాష్ట్రాల్లోనూ, ప్రతిపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పూనుకుంటున్నాయి. వృద్ధుల కూటమి అయిన కాంగ్రెస్ యువత ప్రయోజనాల కోసం పోరాడుతామంటూ సత్యాగ్రహాలు చేస్తోంది. తెలంగాణ ఏర్పడితే ఉస్మానియా యూనివర్సిటీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న కేసీఆర్, గద్దెనెక్కిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టలేని కేసీఆర్ అగ్నిపథ్ గురించి మాట్లాడడం హాస్యాస్పదం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రతిపక్షాలు ఏదో రకంగా ప్రతి అంశంపై ప్రజలను రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రజలు ఎప్పటికప్పుడు వారి పన్నాగాలను తిరస్కరించి బిజెపిని మరింత ఉత్సాహంతో ఆదరిస్తున్నారు. అగ్నిపథ్ విషయంలో కూడా ప్రజలు మోదీ నిజాయితీని అర్థం చేసుకుంటారు.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-06-21T06:38:51+05:30 IST