చెరువులో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-11-28T05:04:47+05:30 IST

మండలంలోని కురుడు గ్రామానికి చెందిన కూర్మాన ప్రశాంత్‌కుమార్‌ (28) శుక్రవారం ఉదయం చెరువులో పడి మృతిచెందా డు.

చెరువులో పడి యువకుడి మృతి


కోటబొమ్మాళి, నవంబరు 27: మండలంలోని కురుడు గ్రామానికి చెందిన కూర్మాన ప్రశాంత్‌కుమార్‌ (28) శుక్రవారం ఉదయం చెరువులో పడి మృతిచెందా డు. ఫిట్స్‌ వ్యాధి ఉన్న ప్రశాంత్‌ ప్రతి రోజులాగే ఉదయం స్నానానికి వెళ్లిన సమయంలో ఫిట్స్‌ రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసమయంలో  అక్కడ ఎవరూ లేకపోవడం, ఆ తరువాత కొంత సేపటికి గ్రామస్థులు చెరువులో దిగగా కాలికి తగలడంతో బయటకు తీసి ప్రశాంత్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సామాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బీటెక్‌ చదువుకున్న ప్రశాంత్‌కుమార్‌ గ్రామంలో అందరితో సరదాగా ఉంటూ పోస్టుమాస్టర్‌ అయిన తండ్రికి చేయూతగా నిలిచేవాడని గ్రామస్తులు తెలిపారు. అప్పటి వరకు కళ్ల ముందు ఉన్న కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కష్ణవేణి, కూర్మారావు, సోదరుడు ఉదయకుమార్‌ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పోస్టుమార్టం అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.


ముంబాయిలో జిల్లా వలస కూలీ.. 

కవిటి: ముంబాయిలో జిల్లాకు చెందిన మహిళా వలసకూలీ మృతి చెందింది.  వివరాల్లోకి వెళ్తే.. కవిటి మండలం రాజపురం పంచాయతీ వింధ్యగిరి గ్రామానికి చెందిన పరశురాం రౌళో తన భార్య ద్రౌపతి(53), ఇద్దరు పిల్లలతో కలసి ముంబాయి వలస వెళ్లాడు. అక్కడ భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నారు. పరుశురాం కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. భార్య అతి కష్టం మీద కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. అయితే,  శుక్రవారం మరుగుదొడ్డికి వెళ్లిన ఆమెపై శ్లాబు కూలింది.  దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులను కోల్పోవడంతో పిల్లలు యుగంధర్‌, టిక్కిరౌళోలు అనాథులుగా మారారు.


Updated Date - 2020-11-28T05:04:47+05:30 IST