అన్నను హతమార్చిన తమ్ముడు

ABN , First Publish Date - 2021-08-03T07:04:38+05:30 IST

తల్లికి వచ్చిన పింఛన్‌ సొమ్ము వాటాల్లో రూ.100 తక్కువగా ఇచ్చారని అన్నను తమ్ముడు హత్య చేశాడు.

అన్నను హతమార్చిన తమ్ముడు
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్రీరామ్‌


తల్లి పింఛన్‌ వాటాల్లో తేడాలు..


అమరాపురం,  ఆగస్టు 2: తల్లికి వచ్చిన పింఛన్‌ సొమ్ము వాటాల్లో రూ.100 తక్కువగా ఇచ్చారని అన్నను తమ్ముడు హత్య చేశాడు. అమరాపురం మండలం హేమావతి గ్రామానికి చెందిన హెంజేరప్ప కుమారుడు లక్ష్మణ్‌(35)ను తమ్ముడు కల్డి రంగా ఆదివారం రాత్రి హత్య చేశాడు. హెంజేరప్ప భార్య దొడ్డ లింగమ్మ ఆదివారం సామాజిక పింఛన్‌ సొ మ్ము తీసుకుంది. అందులో పెద్ద కుమారుడు లక్ష్మణ్‌కు రూ.300, చిన్న కొడుకు కల్డి రంగాకు రూ.200 ఇచ్చింది. అన్న కంటే తనకు రూ.100 తక్కువ ఇచ్చారంటూ ఉదయం నుంచి తల్లిదండ్రులతో రంగా వాగ్వాదం చేసుకున్నాడు. రాత్రికి లక్ష్మణ్‌ ఇంటికి రాగానే అతడితో ఘర్షణ పడ్డాడు. ఇంలోనే అన్న లక్ష్మణ్‌పై రంగా విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. సమీప బంధువులు, కాలనీవాసులు 108కు సమాచారం అందించగా వైద్యులు వచ్చి చూసేసరికి లక్ష్మణ్‌ మృతిచెందాడు. రంగా పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని, విచారణ చేపట్టారు. మడకశిర సీఐ శ్రీరామ్‌ హత్యాస్థలాన్ని పరిశీలించారు. కుటుంబికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, లక్ష్మణ్‌ మృతదేహాన్ని మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లక్ష్మణ్‌కు భార్య శిల్ప, కొడుకు, కుమార్తె ఉన్నారు.


Updated Date - 2021-08-03T07:04:38+05:30 IST