థియేటర్లు మూసేస్తాం!

ABN , First Publish Date - 2022-06-27T07:26:29+05:30 IST

థియేటర్లు మూసేస్తాం!

థియేటర్లు మూసేస్తాం!

తెరపడని ‘టికెట్‌’ వివాదం

ఎంవోయూలపై సంతకాలకు ఎగ్జిబిటర్లపై సర్కారు ఒత్తిడి

అన్నీ ప్రభుత్వానికి అనుకూలం.. నిర్వాహకుల తీవ్ర ఆందోళన

హైకోర్టులో నేడు విచారణ.. ‘స్టే’ ఇస్తే ప్రదర్శనలకు ఓకే 

లేకపోతే హాళ్ల మూసివేత.. ఉమ్మడి తూర్పులో రేపటి నుంచే?

సర్వీసు చార్జీపై సందేహాలు.. సమాధానమివ్వని ‘రెవెన్యూ’

మేమున్నాం.. నమ్మండి.. ఎఫ్‌డీసీ ముక్తసరి హామీ


 (విజయవాడ-ఆంధ్రజ్యోతి) 

ఆన్‌లైన్‌ సినిమా టికెట్‌ విధానానికి సంబంధించి ప్రభుత్వం, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదురుతోంది. చలనచిత్ర అభివృద్ధి మండలి రూపొందించిన ఎంవోయూలపై సంతకాలు చేయాలని ఎగ్జిబిటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే, ఎంవోయూల్లో ఉన్న సందేహాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానాలు రావడం లేదు. ఈ రెండింటి మధ్య ఎగ్జిబిటర్లు నలిగిపోతున్నారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానానికి వ్యతిరేకంగా ఎగ్జిబిటర్లతోపాటు బుక్‌ మై షో ఆన్‌లైన్‌ సంస్థ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందుకు అడుగు వేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం నుంచి థియేటర్లను మూసివేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 135 థియేటర్లు ఉన్నాయి. వాటిలో రెండు మల్టీప్లెక్స్‌లను ఎంవోయూలపై సంతకాలు చేయాలని రెవెన్యూ శాఖ నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఎగ్జిబిటర్లు అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంపై దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరగబోతోంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు స్టే ఇస్తే థియేటర్లను సాధారణంగా నిర్వహించాలని, స్టే రాని పక్షంలో థియేటర్లకు తాళాలు వేయడమే మంచిదని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. థియేటర్లను మూసివేసే పరిస్థితి వస్తే ఆ నిర్ణయాన్ని తెలుగు ఫిలిం చాంబర్‌కు లేఖ రూపంలో తెలపనున్నారు.


ఎఫ్‌డీసీ ఏం చేస్తోంది?

చలనచిత్ర అభివృద్ధి మండలి(ఎ్‌ఫడీసీ) రూపొందించిన ఎంవోయూలో స్పష్టత లేని అంశాలు అనేకం ఉన్నాయని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో రెవెన్యూ అధికారులు ఎగ్జిబిటర్లతో సమావేశాలు నిర్వహించారు. వారి సందేహాలను ఎగ్జిబిటర్లు.. అధికారుల ముందు ఉంచారు. వాటికి రెవెన్యూ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. టికెట్‌ ధరల విషయంలో వివాదం రేగినప్పుడు ఎగ్జిబిటర్లకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. అయితే, ఎంవోయూల విషయంలో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి చలనచిత్ర అభివృద్ధి మండలి అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. ఎంవోయూ చేసినప్పుడు తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ప్రతి ఎంవోయూకు ఒక నిర్ణీత గడువు ఉంటుందని, ఆ విషయాన్ని ఎంవోయూలో పొందుపరచలేదని అంటున్నారు. ‘‘ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న టికెట్లకు సర్వీసు చార్జి వసూలు చేస్తారు. దీని నుంచి రూ.1.95 ప్రభుత్వానికి వెళ్తుంది. థియేటర్లలో విక్రయించిన టికెట్ల నుంచి రూ.1.95 ప్రభుత్వానికి ఇవ్వాలని ఎంవోయూలో పొందుపరిచారు. ఈ టికెట్లకు సర్వీసు చార్జి వసూలు చేయనప్పుడు ఈ కమీషన్‌ ఎలా ఇస్తాం’’ అని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఆన్‌లైన్‌లో టికెట్‌ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని మళ్లీ 4 గంటల్లో రద్దు చేసుకునే అవకాశం ఇచ్చారు. కౌంటర్లలో ఈ టికెట్లను కొనుగోలు చేయనిపక్షంలో ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు?’’ అని అంటున్నారు. ఆన్‌లైన్‌లో రద్దు చేసుకున్న టికెట్లకూ చార్జీలు వసూ లు చేసే అంశాన్ని ఎంవోయూలో పొందుపరచాలని ఎగ్జిబిటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. 


అందుకే సంతకం చేయట్లేదు!!

‘‘ఎగ్జిబిటర్ల నుంచి ప్రభుత్వానికి వెళ్లాల్సిన కమీషన్‌ డబ్బులు వెళ్లపోతే రెవెన్యూ అధికారులను ఉపయోగించి వసూలు చేస్తాం’’ ఎంవోయూలో పొందుపరచిన అంశాల్లో ఇది ప్రధానమైంది. మరి ప్రభుత్వం నుంచి ఎగ్జిబిటర్లకు రావాల్సిన డబ్బులు రాకపోతే అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఆర్థికంగా ముడిపడి ఉన్న ఈ అంశం కారణంగానే ఎంవోయూలపై సంతకాలు చేయడానికి ఎగ్జిబిటర్లు ముందుకు రావడం లేదు.  

Updated Date - 2022-06-27T07:26:29+05:30 IST