
‘‘రంగస్థలమంటే... వినోద, విజ్ఞానాల మేళవింపు మాత్రమే కాదు. కొన్ని రకాల మానసిక రుగ్మతలను మాయం చేసే మంత్ర దండం కూడా’’ అని అంటారు రంగస్థల దర్శకురాలు పల్లవి బానోతు. ఇప్పుడు ఆమె ‘ఎక్స్ప్రెస్సివ్ ఆర్ట్ థెరపీ’ అనే పద్ధతిని తెలుగు నాటకరంగానికి పరిచయం చేస్తున్నారు. రంగస్థల దర్శకురాలిగా అరుదైన పాత్రలో ఒదిగిన ఆమె తన నాటకరంగ విశేషాలను నవ్యతో పంచుకున్నారు.
ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వారంలో ఐదురోజులు ఆఫీసు, వీకెండ్ హాలిడేస్. నెలతిరిగేప్పటికి ఖాతాలో జీతం జమవుతుంది...ఇంకేం జీవితం హాయిగా గడిచిపోతుందని నన్నుచూసిన వాళ్లంతా అనుకున్నారు. కానీ జీవితమంటే ఇంతేనా.! అనేది నా భావన. ఇంకేదైనా కొత్తగా చేయాలి అనిపించింది. అప్పుడే ‘సమాహారా’ థియేటర్ వర్క్‌షాప్ గురించి తెలిసింది. రెండు నెలల పాటు రోజూ సాయంత్రాలు ఆ వర్క్‌షా్‌పకు హాజరయ్యాను. అక్కడకి వెళుతున్నన్నాళ్లు నాలో ఏదో తెలియని సంతోషం. అప్పటివరకు నన్ను వెంటాడిన ఒత్తిడి, కుంగుబాటు వంటివి నాకు తెలియకుండానే మాయమయ్యాయి. చిన్నప్పటి నుంచి నేనెన్నడూ వేదిక ఎక్కింది లేదు. అలాంటిది కొన్ని వందల మంది ప్రేక్షకుల ముందు... ‘కలర్స్ ఆఫ్ లవ్’ నాటకంలో తొలిసారిగా నటిస్తున్నప్పుడు... కలిగిన ఆనందం, అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. అది నాకొక భిన్నమైన అనుభవం. మనది కాని పాత్రలో అభినయించడం వల్ల పొందే ఆత్మసంతృప్తి అత్యంత అమూల్యమైనదని గ్రహించాను. రంగస్థలం మీదే భవిష్యత్తు వెతుక్కోవాలని నిశ్చయించుకున్నాను.
ఇంట్లోవాళ్లు వద్దన్నారు...
తొలినాళ్లలో ఉద్యోగం చేస్తూనే, చాలా నాటకాల్లో వివిధ పాత్రలు పోషించాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్వహించిన థియేటర్ ఫెస్టివల్లో ఒకసారి కేఎన్‌వై పతంజలి రాసిన ‘రాజుగోరు’, ‘దెయ్యం ఆత్మకథ’... నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించాను. అదీ కేవలం పదిహేనురోజుల ప్రాక్టీసుతో.! జాన్బషీర్ దర్శకత్వంలోని ‘అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి’ నాటకం రంగస్థల నటిగా నాకు మంచి పేరు తెచ్చింది. అప్పుడు నామీద నాకు మరింత నమ్మకం కుదిరింది. అప్పుడు ఉద్యోగం వదిలేసి నాటకరంగానికే పరిమితమవుతానని ఇంట్లో చెప్పాను. అందరి అమ్మానాన్నలకు మల్లే మా పెద్దలూ మొదట్లో అంగీకరించలేదు. అలా అని నేనూ పట్టువీడలేదు. చివరికి ఒక నాటకంలో నా నటన చూశాక, నాన్నకు నమ్మకం కలిగి ‘నీకు నచ్చినట్టు చేయి’ అన్నారు. ఇక అక్కడ నుంచి నేను వెనక్కి తిరిగి చూడలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్‌లో ఎంఏలో చేరాను. అందులోనూ అమ్మాయిలు అంతగా చొరవచూపని ‘డిజైన్ అండ్ డైరెక్షన్’ కోర్సు తీసుకున్నాను. అదీ స్టీరియోటైప్ ఆలోచనలను బద్ధలు కొట్టాలనే సంకల్పంతోనే.! యూనివర్సిటీ వాతావరణం, మూడేళ్ల చదువు నా జీవితానికి ఒక కనువిప్పు అనే చెప్పాలి.
చిన్నారుల నాటకాలు...
చదువుతూనే మరోవైపు పిల్లల కోసం ప్రత్యేకంగా థియేటర్ వర్క్‌షాప్ ప్రారంభించాను. ఒకటి కాదు, రెండు కాదు సుమారు నలభై శిక్షణా శిబిరాలు నిర్వహించాను. పిల్లలతో పనిచేయడంలో ఉన్న సంతోషం మరెందులోనూ దొరకదు. వాళ్లకు నేను రంగస్థల పాఠాలు చెప్పడమే కాదు, వాళ్ల నుంచి నేనూ చాలా నేర్చుకున్నాను. సినిమా రంగంలో దర్శకురాళ్ల సంఖ్య వేళ్లమీద లెక్కించవచ్చు. ఇక తెలుగు నాటకరంగంలో అయితే, అస్సలు కనిపించరు. అందుకు ఈ రంగంలోని ఆర్థిక అనిశ్చితి ఒక ప్రధాన కారణం కావచ్చు. రంగస్థల ఆధునిక సాంకేతిక అంశాలు, రంగాలంకరణ తదితర అన్నీ అంశాలపై నాకు అవగాహన ఉంది. కనుక నాటకాన్ని డైరెక్టు చేయడం నాకు మరింత సులువు. కానీ నన్ను నమ్మి అవకాశం ఇచ్చేది ఎవరు? పైగా నాటకమంటే కేవలం స్ర్కిప్టు, నటీనటులు మాత్రమే కాదు.! అందుకు కొంత డబ్బూ అవసరమే.! అలాంటి సమయంలో సమాహార రత్నశేఖర్ నా ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆయన సహకారంతో ఇప్పటి వరకు పన్నెండు పిల్లల నాటకాలను డైరెక్టు చేశాను. అందులో ‘ప్లాస్టిసైడ్’, ‘సిండ్రిల్లా సంగీత్’ వంటి నాటకాలకు మంచి పేరొచ్చింది. నా ప్రతి నాటకంలో ఇతివృత్తం, సన్నివేశాలు, సంభాషణలు తదితర విషయాల రూపకల్పనలో పిల్లలను భాగస్వామ్యం చేస్తూ, వాళ్ల ఆలోచనలకు తగినట్టుగా నాటకాన్ని ప్రదర్శిస్తుంటాను. అదే నా ప్రత్యేకత.!
చిలీ దేశస్థురాలు దర్శకత్వంలో...
‘యాంటీ బాడీస్’ పేరుతో ఆడవాళ్ల శరీరం చుట్టూ జరిగే రాజకీయాలు ఇతివృత్తంగా ఒక నాటకానికి దర్శకత్వం వహించాను. ఇందులో బాడీ షేమింగ్ దగ్గర నుంచి ఆరుబయట ఆడవాళ్లు సహజాతి సహజంగా ఎదుర్కొనే సమస్యలు అనేకం చర్చకు వస్తాయి. కొంతమంది మహిళలతో ప్రత్యేకంగా థియేటర్ వర్క్‌షాప్ చేసి మరీ, ఆ నాటకాన్ని ప్రదర్శించాం. ఇప్పుడు మరొక నాటకం ‘కవరప్’ పేరుతో మహిళల శరీర అవసరాలు ఇతివృత్తంగా ఒక ఏకాంకికను రాశాను. ఈ నాటకాన్ని చిలీ దేశానికి చెందిన రంగస్థల నిపుణురాలు కెరీన్ డైరెక్టు చేస్తున్నారు. సామాజిక సమస్యలు, ముఖ్యంగా స్త్రీవాద దృక్పథంతో భిన్నమైన నాటకాలను రూపొందించడం నాకిష్టం. అలాంటి నాటకాలను మాత్రమే ప్రదర్శిస్తాను కూడా.!
ఒత్తిడికి ఔషధం ‘ఆర్ట్ థెరపీ’
ఇప్పుడు నేను బెంగళూరులో ‘ఎక్స్ప్రెస్సివ్ ఆర్ట్ థెరపీ’ కోర్సు చేస్తున్నాను. ఇప్పుడు మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్న వారెందరో.! వాళ్లకు ఇదొక పెద్ద ఉపశమనం అని చెప్పగలను. ఆర్ట్ థెరపీతో ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలను తగ్గించవచ్చు. దీన్ని ఇప్పటికే బెంగుళూరు, ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లోని మనస్తత్వ నిపుణులు కౌన్సెలింగ్‌లో ఉపయోగిస్తున్నారు. మాటల్లో చెప్పలేని బాధను, ప్రదర్శనా కళల ద్వారా మరొక రూపంలో వ్యక్తీకరించడానికి ఉపకరించేదే ఆర్ట్ థెరపీ. ప్రస్తుతం కొందరికి ఉచితంగా ‘ఎక్స్ప్రెస్సివ్ ఆర్ట్ థెరపీ’లో తరగతులు నిర్వహిస్తున్నాను. థియేటర్ టెక్నిక్స్‌తో భావోద్వేగాలను సమతుల్యం చేయడం, భావ వ్యక్తీకరణను మరింత మెరుగుపరచడం దీనిలో భాగం. ఈ పద్ధతితో జీవన విధానం వల్ల తలెత్తే కొన్ని రకాల మానసిక రుగ్మతలనూ దూరం చేయచ్చు. సైకోథెరపీకి ఆధునిక రంగస్థల నైపుణ్యాలను మిళితం చేసి కొత్త కౌన్సెలింగ్ పద్ధతిని అభివృద్ధి చేయాలనేది నా కోరిక. ఆ దిశగా కొంత అధ్యయనం చేస్తున్నాను.

అమ్మాయిల కన్నీళ్లు చూసి...
థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఆధ్వర్యంలో ఇండ్ల చంద్రశేఖర్ రాసిన ‘మిస్ మీనా’ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నలభైకి పైగా ప్రదర్శనల్లో నటించాను. అందులో నాది ప్రధాన పాత్ర. ప్రేమ పేరుతో వంచనకు లోనైన ఒక అమ్మాయి విజయగాథ ఇతివృత్తంగా ఆ నాటకం సాగుతుంది. కొన్ని కాలేజీల్లో ‘మిస్ మీనా’ నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు, కొందరు అమ్మాయిలు నన్ను వ్యక్తిగతంగా కలిసి తమకు జరిగిన అన్యాయాల్ని చెప్పి కుమిలిపోయిన సందర్భాలున్నాయి. వాళ్ల కన్నీళ్లు ఇప్పటికీ నా కళ్లముందు మెరుస్తున్నాయి. సామాజిక సమస్యలే ప్రధానంగా నాటకాలు రూపొందించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.

విజయవాడలో ఒక పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను. అక్కడ నేనెంతో కులవివక్షను ఎదుర్కొన్నాను. ఆదివాసీ, దళిత విద్యార్థులను సాటి మనుషులుగా కూడా చూడరు. అయితే ఇంజనీరింగ్ చదువులో నేను పోగొట్టుకున్న నా అస్తిత్వాన్ని తిరిగి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొందగలిగాను.
కె. వెంకటేశ్
ఫొటోలు : రేవల్ల కుమార్