Advertisement

చోరీ...కథ మారి!

Sep 16 2020 @ 05:33AM


 కొడుకుతో కలిసి నాటకం

అడ్డంగా దొరికిపోయిన మహిళ

 

బొబ్బిలి సెప్టెంబరు 15: ఇంట్లో చోరీ జరిగిందంటూ... కుమారునితో కలిసి చోరీ నాటకమాడి.. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన మహిళ ఉదంతమిది. బొబ్బిలి పట్టణంలో చోటుచేసుకున్న ఈ సంఘటన  కు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివీ... స్థానిక గొల్లవీధిలో బోగి సురేష్‌కుమార్‌  ఇంట్లో ఈ నెల 12న భారీ చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అందరూ రాత్రి నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి 15 తులాల బంగారం, ఒకటిన్నర కిలోల వెండి, మూడు లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయినట్లు ఇంటి యజమాని భార్య సునీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్‌పీ రాజకుమారి స్పందించి చోరీ కేసును ఛేదించాలని పోలీసులను ఆదేశించారు.


డీఎస్‌పీ నేతృత్వంలో సీఐలు, ఎస్‌ఐలు, క్రైమ్‌ పార్టీలు, క్లూస్‌టీమ్‌ అంతా రంగప్రవేశం చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగించారు. సురేష్‌కుమార్‌ మూగవాడు. అతని భార్య సునీల పోస్టల్‌ ఆర్డీలు, బీమా ప్రీమియంలు వసూలు చేస్తూ ఉపాధి పొందుతోంది. సుమారు 4 లక్షల రూపాయల మేర ఆమెకు అప్పులున్నాయి. గత నెలలో గ్రామీణ వికాస బ్యాంకులో నాలుగు తులాల బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకుంది. ఈ బంగారం కూడా చోరీకి గురైనట్టు ఫిర్యాదు ఇచ్చింది. పోలీసులు సేకరించిన వేలిముద్రల్లో తొమ్మిది ముద్రలు సునీలవిగా.. మూడు వేలిముద్రలు ఆమె కుమారుడివిగా గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా ఆరా తీశారు.


చోరీకి పాల్పడింది వారేనని గుర్తించారు. సునీల భర్త సురేష్‌కుమార్‌ ధరించిన జంధ్యానికి బీరువా తాళాన్ని కట్టుకొని నిద్రించడం అలవాటు. ఆ జంధ్యాన్ని కత్తిరించి తాళం చెవిని అపహరించి బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకుపోయారని ఆమె నమ్మబలకడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను  తమదైన శైలిలో ప్రశ్నించినా వివరాలు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం స్థానిక గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి ఆలయం సమీపంలో బంగారం, వెండి ఆభరణాలు కలిగిన బ్యాగుతో ఆమె తన కుమారునితో కలిసి చోరీ సొత్తును వేరేచోట భద్రపరిచేందుకు వెళుతోంది. అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాన్ని అంగీకరించింది.


నిందితురాలి కుమారుడు   మైనర్‌ కావడంతో బాలనేరస్తుల సంస్కరణాలయానికి పంపుతామని డీఎస్పీ జె.పాపారావు తెలిపారు. కేసును రెండు రోజుల్లో ఛేదించినందుకు డీఐజీ, ఎస్‌పీ అభినందించినట్లు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐలు ఇ.కేశవరావు, బీఎండీ ప్రసాదరావు, ఎస్‌ఐలు వి.ప్రసాదరావు, కేటీఆర్‌ లక్ష్మి, ఏఎస్‌ఐలు బీవీ రమణ, శ్యామ్‌, హెచ్‌సీలు మురళి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.