షుగర్‌ ఫ్యాక్టరీలో మెటల్‌ రోటార్‌ యూనిట్‌ చోరీ

ABN , First Publish Date - 2021-07-27T05:52:31+05:30 IST

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో నాలుగు రోజుల క్రితం మెటల్‌ రోటార్‌ మాయమైంది.

షుగర్‌ ఫ్యాక్టరీలో మెటల్‌ రోటార్‌ యూనిట్‌ చోరీ
చోరీకి గురైన మెటల్‌ రోటారు యూనిట్‌ (ఫైల్‌)

సెక్యూరిటీ కళ్లుగప్పి ఎత్తుకుపోయిన ఆగంతుకులు

ఓ ప్రైవేటు లారీ యజమాని పాత్రపై అనుమానాలు


చోడవరం, జూలై 26: గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో నాలుగు రోజుల క్రితం మెటల్‌ రోటార్‌ మాయమైంది. సెక్యూరిటీ కళ్లుగప్పి మరీ బాయిలింగ్‌ హౌస్‌కు సంబంధించిన మేగ్మా పంపు గన్‌ మెటర్‌ రోటార్‌ యూనిట్‌ను తరలించుకుపోవడం ఫ్యాక్టరీ వర్గాల్లో కలకలం రేపుతున్నది. దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రత్యేకంగా విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఫ్యాక్టరీ సెక్యూరిటీ విభాగం కూడా ఈ వ్యవహారంపై అంతర్గతంగా విచారణ చేపడుతున్నట్టు తెలుస్తున్నది. వంద కిలోల కంటే బరువైన ఈ యూనిట్‌ను ఒకరిద్దరు బయటకు తీసుకవెళ్లే అవకాశం లేదని, ఇందులో ఫ్యాక్టరీతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రమేయం ఉందని చెబుతున్నారు. సీసీ కెమెరాల విజువల్స్‌ను పరిశీలించిన తరువాత ఓ ప్రైవేటు లారీలో దీన్ని తరలించినట్టుగా భావిస్తున్నారు. అనుమానితుల వివరాలు పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో ఇటువంటి దొంగతనాలు జరగడం, దీనికి కొందరు ఇంటి దొంగలే సహకరించడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-07-27T05:52:31+05:30 IST