
- వ్యవసాయ కరెంట్‌ను వినియోగిస్తున్న ఇటుక బట్టీల నిర్వాహకులు
- జగిత్యాల జిల్లాలో వందకు పైగా బట్టీలు
జగిత్యాల, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్తును అందిస్తోంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఇటుక బట్టీల వ్యాపారులు దర్జాగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. పంట పొలాల్లో ఉన్న బోరుబావుల నీటిని ఇటుక బట్టీల కోసం పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో ఇటీవల ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి ఏర్పాటులో మాత్రం నిబంధనలను పాటించడం లేదు. అనుమతి లేకుండా ప్రధాన రహదారులకు ఆనుకొని బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు వందకు పైగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఇందులో కొందరు అనుమతులు తీసుకోగా మరికొందరు అనుమతులు లేకుండానే తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. అనుమతులు తీసుకున్న వ్యాపారులు కేవలం పదుల్లోపు మాత్రమే ఉంటున్నారు.
- వాల్టా ఉల్లంఘన..
ఇటుక బట్టీ ఏర్పాటుకు కనీసం రెండు నుంచి అయిదు ఎకరాల వరకు భూమి అవసరమవుతుంది. ఆయా పంచాయతీలు, రెవెన్యూ, మైనింగ్ శాఖ, భూగర్భగనుల శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కాలుష్య నియంత్రణ అధికారి కార్యాలయం నుంచి సైతం అనుమతి పొందాల్సి ఉంటుంది. ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారు.. వారికి ఇచ్చే కూలీ ఎంత.. తదితర వివరాలను సమర్పించి కార్మిక శాఖ అధికారి కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ భూముల్లో బట్టీ ఏర్పాటు చేస్తే ముందుగా నాలా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అటవీ ప్రాంతానికి చెందిన భూముల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయరాదు. ఇటుక బట్టీల్లో ఇటుకల తయారీకి మట్టి ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో అధికారులకు ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. కాగా జిల్లాలో వ్యాపారులు ఇలాంటివి ఏవీ పట్టించుకోవడం లేదు. వాల్టాను ఉల్లంఘించి ప్రభుత్వ స్థలాలు, అటవీ ప్రాంతాలు, చెరువుల నుంచి మట్టి తరలిస్తున్నారు.
- విద్యుత్ కనెక్షన్ పొందాల్సిందిలా..
ఇటుక బట్టీలకు ప్రత్యేకంగా విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. బోరు, మోటారు, రాత్రి వేళల్లో లైట్ల కోసం అవసరమైన విద్యుత్ వినియోగానికి ముందుగా దరఖాస్తు చేసుకొని మీటరు పొందాల్సి ఉంటుంది. బట్టీల నిర్వహణకు అవసరమయ్యే నీటితో పాటు పనిచేసే కార్మికుల అవసరాలకు కరెంటు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా పని ప్రదేశంలో అవసరమైన విద్యుత్ కోసం వాణిజ్యం (గృహేతర) కనెక్షన్ తీసుకోవాలి. వినియోగించిన విద్యుత్‌కు 0-100 యూనిట్ల వరకు ఒక్కో యూనిటుకు రూ.7.50 చెల్లించాలి. 101 నుంచి 300 యూనిట్ల వరకు రూ. 8.90లు చెల్లించాలి. 301-500 యూనిట్ల వరకు రూ. 9.40లు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిదంగా 500 యూనిట్లకు పైగా వినియోగిస్తే ఒక్కో యూనిట్‌కు రూ. 10 చార్జీలు వేస్తుంటారు. అయితే ఇటుక బట్టీల వద్ద చాలా విద్యుత్తు వినియోగమవుతుంటుంది. నెలకు రూ. వేలల్లో బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.
- బిల్లులు తప్పించుకోవడానికి..
వాణిజ్య విద్యుత్ కనెక్షన్ తీసుకుంటే రూ. వేలల్లో వచ్చే బిల్లులను తప్పించుకోవడానికి వ్యవసాయ క్షేత్రాలకు ఇచ్చే ఉచిత కరెంటును ఇటుక బట్టీల వ్యాపారులు వాడుకుంటున్నారు. సమీప వ్యవసాయ భూముల బోర్లను లీజుకు తీసుకొని నీళ్లు వాడుకుంటున్నారు. దీనికి ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఇస్తున్న కరెంటును దుర్వినియోగం చేస్తున్నారు. ఇటీవల పలువురు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ నామమాత్రంగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. తాజాగా కథలాపూర్ మండలంలోని దుంపెట, గంబీర్పూర్, చింతకుంట తదితర గ్రామాల్లో ట్రాన్స్‌కో అధికారులు తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్దంగా విద్యుత్ వినియోగిస్తున్న ముగ్గురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. పలు సందర్భాల్లో తనిఖీలు జరుగుతున్నప్పటికీ అక్రమార్కుల్లో మార్పురావడం లేదు.
- ప్రత్యేకంగా పైప్లైన్లు వేసుకుని..
వేసవి, చలికాలంలో ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. పంటలు పండని వదిలేసిన భూములను ఎంపిక చేసుకొని అక్కడ ఉన్న బోరుబావులను ఇందుకు వినియోగించుకుంటున్నారు. సమీపంలో ఉన్న వ్యవసాయ బోరుబావుల నుంచి ప్రత్యేకంగా పైపులైన్లు వేసుకుంటున్నారు. ఇవి బయటకు కనిపించకుండా కొంత మేర భూమిని తవ్వి అందులో నుంచి వేస్తున్నారు. మరికొన్ని చోట్ల పంట పొలాల మధ్యలో నుంచి వేసి మరీ నీటిని మళ్లించుకుంటున్నారు. చాలా చోట్ల ఈ తంతు సాగుతున్నా నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా జిల్లాలోని ఇటుక బట్టీల నిర్వాహకులు అందులో పనిచేస్తున్న కూలీలను ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. సమీపంలోని మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొని వచ్చి గొడ్డుచాకిరి చేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సంబంధిత శాఖల అధికారులు పకడ్బందీగా వ్యవహరించి ఇటుక బట్టీ వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.