దోచుకున్నది దాచుకుని..! నిత్యం దొంగతనాలకు పాల్పడుతున్న నేరగాళ్లు

ABN , First Publish Date - 2021-02-26T05:13:15+05:30 IST

అందరిలో కలిసిపోతారు. ఇళ్లలో ఎవరైనా ఉన్నారా.. లేరా అని తెలుసుకునేందుకు రెక్కీ నిర్వహిస్తారు. పక్కాగా స్కెచ్‌ వేసి మరీ సొత్తును కాజేస్తారు. ఇలా జిల్లాలో దొంగతనాలు పరిపాటిగా మారగా.. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసుశాఖ అధికారులు పీడీ(ప్రీవెంటీవ్‌ డిటెక్షన్‌) యాక్టు ప్రయోగిస్తున్నారు. ఆయా నేరగాళ్ల వివరాలు సేకరించి.. ప్రత్యేక నిఘా పెట్టి చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.

దోచుకున్నది దాచుకుని..!  నిత్యం దొంగతనాలకు పాల్పడుతున్న నేరగాళ్లు
ఇటీవల పీడీ ప్రయోగించిన ఇద్దరు నేరస్తులతో ఖమ్మం అర్బన్‌ సీఐ వెంకన్నబాబు

పోలీసులకు పట్టుబడితే సగమే అప్పగింత 

జైలుకెళ్లి తిరిగొచ్చిన తర్వాత మళ్లీ చోరీల బాట

ఆ తరహా కేడీలకు పీడీ సంకెళ్లువేస్తున్న అధికారులు

ఒకే నెలలో ముగ్గురిపై కేసులు

ఖమ్మం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): అందరిలో కలిసిపోతారు. ఇళ్లలో ఎవరైనా ఉన్నారా.. లేరా అని తెలుసుకునేందుకు రెక్కీ నిర్వహిస్తారు. పక్కాగా స్కెచ్‌ వేసి మరీ సొత్తును కాజేస్తారు. ఇలా జిల్లాలో దొంగతనాలు పరిపాటిగా మారగా.. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసుశాఖ అధికారులు పీడీ(ప్రీవెంటీవ్‌ డిటెక్షన్‌) యాక్టు ప్రయోగిస్తున్నారు. ఆయా నేరగాళ్ల వివరాలు సేకరించి.. ప్రత్యేక నిఘా పెట్టి చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఒకే నెలలో ముగ్గురిపై పీడీ యాక్టు ప్రయోగించారు. కాగా 2019లో 19 మందిపై పీడీ యాక్టు ప్రయోగించిన పోలీసులు గతేడాది మాత్రం కేవలం ముగ్గురిపై మాత్రమే పీడీ నమోదు చేయగా.. మరికొంతమందిపై కూడా నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

దోచుకున్నది దాచుకుంటున్నారా?

దొంగతనాలు చేయడం.. పట్టుబడితే జైలుకెళ్లడం తిరిగి బెయిల్‌ పై వచ్చాక మళ్లీ అదేపనులు చేయడం.. ఎన్నిసార్లు పట్టుబడినా మళ్లీ అదే వృత్తి కొనసాగిస్తున్నారు. ఆయా నేరగాళ్లు దొరికినా వారు చోరీ చేసిన సొత్తు మాత్రం పూర్తిస్థాయిలో తిరిగి ఇవ్వడంలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా వస్తువులు, వస్తువులను అమ్ముకోగా వచ్చిన సొమ్మును ఖర్చు చేశామని మిగిలింది కొంత ఇదేనంటూ పోలీసులకు చెబుతూ వారు దోచుకున్న దాన్ని దాచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వారు చేస్తున్న పనిలో లాభం ఉన్న కారణంగానే జైలు నుంచి వచ్చాక కూడా అదే వృత్తిలో కొనసాగడానికి వెనకాడటంలేదన్న వాదన వినిపిస్తోంది. పోలీసులు కూడా వచ్చినకాడికి రికవరీ చేసి మిగిలిన దాన్ని ఖర్చు చేసినట్టు చూపుతున్నట్టు సమాచారం. అయితే అదేపనిగా చట్టాన్ని చులకన చేస్తూ భయం లేకుండా వ్యవహరిస్తున్న నేరగాళ్లపై పీడీ లాంటి కఠినమైన కేసులను నమోదు చేయాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు ఇలాంటి ప్రయోగానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. ఎన్నిసార్లు పట్టుబడినా బెయిల్‌పై వచ్చి తమ పూర్వపు నేరప్రవృత్తినే కొనసాగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. 

పీడీ ప్రయోగిస్తే ఏమవుతుంది?

రౌడీషీట్‌ కన్నా భయంకరమైన చట్టంగా పోలీసులు అభివర్ణిస్తున్న పీడీ యాక్టు అమలుతో నేరాలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. పీడీ యాక్టు కింద ఒక్కసారి కేసు నమోదైతే బయటకు రావడం చాలా కష్టం.  బెయిలు రావడం అంత సులువు కాదు. స్థానిక కోర్టులు, జిల్లాకోర్టుల్లో బెయిల్‌ వచ్చే అవకాశం ఉండదు. ‘నేర ప్రవృత్తి సమీక్ష’ అనే విషయంలో బెయిల్‌ ఇవ్వాలా? వద్దా? అన్న విషయాలను పరిశీలించాక కలెక్టర్‌ నుంచి సరైన సిఫారసు అందితే కానీ హైకోర్టులో బెయిల్‌ వచ్చే అవకాశం ఉండదు. ఇన్నాళ్లు పీడీయాక్టు కింద కేసులు నమోదు చేయడం అరుదు. అయితే బియ్యం అక్రమ రవాణా విషయంలో జిల్లాలో ఒక్క పీడీ కేసు మాత్రమే నమోదైంది. కాగా ప్రస్తుతం పోలీసులు ప్రయోగిస్తున్న ఈ చట్టంతో అన్ని రకాల కేడీలకు బేడీలు బదులు పీడీలే అనే విషయం తేటతెల్లమవుతోంది. 

ఒకే నెలలో ముగ్గురిపై పీడీ.. 

కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామానికి చెందిన తమ్మిశెట్టి నర్శింహరావు కూలీ పనులు చేసుకునేవాడు. జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలన్న యోచనలో నేరాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో రాత్రి పూట చోరీలకు పాల్పడేవాడు. అతడిపై గడిచిన మూడు నెలల్లో ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో 9కేసులు నమోదయ్యాయి. ఖమ్మం ఖానాపురం హవేలీ ప్రాంతానికి చెందిన ఏపూరి చంద్రశేఖర్‌,  గట్టు సింగారానికి చెందిన దాచేపల్లి హనుమారెడ్డి కూడా తాళాలు వేసి ఉన్న ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించి ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడేవారు. ఈ ముగ్గురిపై ఈ నెల వ్యవధిలో పీడీ ప్రయోగించిన పోలీసులు తిరిగి జైలు పంపించారు. 

సొత్తు రికవరీ ఇలా... 

ఖమ్మం జిల్లాలో 2016 నాటికి రూ.2.52కోట్ల సొత్తు చోరీకి గురవగా రూ.1కోటి 61లక్షల 51వేల( 64.09శాతం)ను రికవరీ చేశారు. కొత్తగూడెం జిల్లాలో రూ.2కోట్ల6లక్షల సొత్తు చోరీ అవ్వగా రూ. కోటి44లక్షల సొత్తు(70.4శాతం)ను రికవరీ చేశారు. 2017లో ఖమ్మం జిల్లాలో మొత్తం 395 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు రూ.1.89కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 2019లో 515 దొంగతనాల్లో రూ.4.50కోట్లు సొత్తు చోరీకి అవగా అందులో 285 కేసులను చేధించిన పోలీసులు రూ.1.58కోట్లు రికవరీ చేశారు. 2020లో 333 దొంగతనాలు జరగ్గా రూ.3.41కోట్లు సొత్తు చోరీ జరిగింది. దానిలో 1.93కోట్లు రికవరీ చేశారు. కాగా కొన్నేళ్లుగా జిల్లాలో 50 శాతానికి మించి రికవరీ జరగడంలేదని ఈ లెక్కలను బట్టి తెలుస్తోంది. 

సమగ్ర సర్వేలో స్టేషన్ల వారీగా డేటా సేకరణ?

గతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సమగ్ర నేరస్థుల సర్వే నిర్వహించిన అధికారులు.. పీడీ యాక్టు ప్రయోగించాల్సిన వారు ఎవరున్నారు? వారి గత, ప్రస్తుత చరిత్ర? ప్రస్తుతం వారి తీరులో మార్పు వచ్చిందా? లేదంటే నేరాలకు పాల్పడుతున్నారా? లాంటి పలు వివరాలను సేకరించి.. ఆయా వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగా జిల్లాలో పాతనేరస్థులు మళ్లీ నేరాలకు పాల్పడితే వారిపై ఈ సారి పీడీని ప్రయోగించి కటకటాల వెనక్కు నెడుతున్నారు. 



Updated Date - 2021-02-26T05:13:15+05:30 IST