బీహార్‌లో ‘అతడు’.. అదృశ్యమైన కుమారుడి స్థానంలో 41 సంవత్సరాలుగా మోసగాడి తిష్ట

ABN , First Publish Date - 2022-07-04T23:44:23+05:30 IST

టాలీవుడ్ టాప్ హీరో మహేశ్‌బాబు కథానాయకుడిగా అప్పట్లో వచ్చిన ‘అతడు’ సినిమా ఎంతటి ఘన

బీహార్‌లో ‘అతడు’.. అదృశ్యమైన కుమారుడి స్థానంలో 41 సంవత్సరాలుగా మోసగాడి తిష్ట

పాట్నా: టాలీవుడ్ టాప్ హీరో మహేశ్‌బాబు కథానాయకుడిగా అప్పట్లో వచ్చిన ‘అతడు’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాత తిడతాడన్న కోపంతో చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయిన ‘పార్థు’ తిరిగి వస్తున్న సమయంలో అనూహ్యంగా పోలీసుల చేతిలో హతమవుతాడు. పార్థు స్థానంలో అతడి ఇంటికి వెళ్లిన మహేశ్‌బాబు తానే ‘పార్థు’నని నమ్మించి ఆ కుటుంబం ప్రేమాభిమానాలు పొందుతాడు. స్థూలంగా ఇదీ కథ. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి బీహార్‌లో జరిగింది. తప్పిపోయిన కుమారుడి స్థానంలో ఓ ఇంటికి వచ్చిన మోసగాడు ఏకంగా 41 సంవత్సరాలపాటు తిష్టవేశాడు. మోసం బయటపడడంతో ఇప్పుడతడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. 


నలందా జిల్లాకు చెందిన ఓ పేరుమోసిన జమీందారు కామేశ్వర్ సింగ్ టీనేజ్ కుమారుడు కన్నయ్య సింగ్ ఫిబ్రవరి 1977లో  స్కూలు నుంచి తిరిగి వస్తూ అదృశ్యమయ్యాడు. గాలించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడు కనిపించకపోవడంతో తండ్రి మనోవేదనకు లోనయ్యాడు. దిగులుపడొద్దని, కుమారుడు తిరిగి వస్తాడని గ్రామస్థులు ఆయనను అనునయించారు. అప్పటికి సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అంటే సెప్టెంబరు 1981లో రెండు పదుల వయసులో ఉన్న ఓ కుర్రాడు కాషాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ జీవనోపాధికి భిక్షాటన చేస్తూ ఓ గ్రామానికి వెళ్లాడు. గ్రామస్థులతో మాటలు కలుపుతూ తాను ముర్గావాన్ గ్రామానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి కొడుకునని వారికి చెప్పాడు. విషయం కామేశ్వర్ సింగ్ చెవిన పడడంతో కొందరు గ్రామస్థులతో కలిసి ఆ కుర్రాడిని చూసేందుకు వెళ్లాడు. కామేశ్వర్ సింగ్‌‌కు కళ్లు స్పష్టంగా కనిపించకపోవడంతో ఆ కుర్రాడిని గుర్తుపట్టలేకపోయాడు. అయితే, ఆయనతో వెళ్లిన గ్రామస్థులు మాత్రం అతడు తప్పిపోయిన కన్నయ్య సింగేనని చెప్పడంతో కామేశ్వర్ సింగ్ అతడిని ఇంటికి తీసుకొచ్చాడు. 


కుమార్తె విద్యతో కలిసి పాట్నా వెళ్లిన కామేశ్వర్ సింగ్ భార్య రామసఖి దేవికి నాలుగు రోజుల తర్వాత ఈ వార్త తెలిసి వెంటనే ఇంటికి చేరుకుంది. ఇంటికొచ్చిన యువకుడిని చూసిన ఆమె.. అతడు తన కుమారుడు కాదని తెలుసుకుంది. తన కుమారుడి తలపై ఎడమైపున ఉండాల్సిన కట్ మార్కు ఇంటకొచ్చిన ‘కొడుకు’లో లేదని గుర్తించింది. అలాగే, చదువుకున్న పాఠశాల ఉపాధ్యాయులను అతడు గుర్తించలేకపోయాడు. దీంతో అతడు కచ్చితంగా తన కుమారుడు కాదని తల్లి తేల్చి చెప్పింది. అయితే కామేశ్వర్ సింగ్‌కు మాత్రం అతడు తన కొడుకేనన్న నమ్మకం కలిగింది. 


ఇంటికొచ్చిన యువకుడు తన కొడుకు కాదని, మోసగాడని రామసఖి దేవి కేసు పెట్టగా, అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. నెల రోజుల తర్వాత అతడు బెయిలుపై బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతడు కొత్త గుర్తింపు కోసం పాకులాడాడు. కాలేజీకి వెళ్లి చదువుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. పలు తప్పుడు గుర్తింపు కార్డులు సంపాదించాడు. మూడు ఐడీ కార్డులు సంపాదించాడు. ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ట్యాక్సులు చెల్లించాడు. ఆధార్ కార్డు సంపాదించాడు. తుపాకి లైసెన్స్ కూడా తీసుకున్నాడు. కామేశ్వర్ సింగ్‌కు చెందిన 37 ఎకరాలు అమ్మేశాడు. డీఎన్ఏ శాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరించిన యువకుడు నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో తన అసలు ఐడెంటిటీని తుడిచిపెట్టేందుకు ప్రయత్నించాడు. చివరికి 41 సంవత్సరాల తర్వాత అతడి పాపం పండింది. కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. అతడి అసలు పేరు దయానంద్ గోసైన్ అని, కామేశ్వర్ సింగ్ స్వగ్రామానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జముయి జిల్లాకు చెందినవాడని తేలింది. మోసం, కుట్ర తదితర అభియోగాలపై ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, రామసఖి దేవి 1995లో మరణించింది. 


కాగా, ఈ కేసులో పలు సమాధానం లేని ప్రశ్నలు వేధిస్తున్నాయి. దోషి దయానంద్‌కు శిక్ష పడింది సరే.. నకిలీ ఐడీతో అతడు అమ్మేసిన 37 ఎకరాల సంగతేంటి? ఆ భూమిని వెనక్కి తీసుకుని కామేశ్వర్ సింగ్-రామసఖి దంపతుల కుమార్తెలకు సమానంగా పంపిణీ చేస్తారా? అతడి నకిలీ గుర్తింపుల సంగతేంటి? అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. దోషి జైలుకెళ్లాడు సరే.. మరి కన్నయ్య ఏమయ్యాడు? అన్నవి అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలాయి. భారతీయ చట్టం ప్రకారం.. అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ ఏడేళ్లకుపైగా లభ్యం కాకపోతే మరణించినట్టే భావిస్తారు? అలాంటప్పుడు పోలీసులు ఈ కేసును ఇంకా ఎందుకు క్లోజ్ చేయలేదు? ఇప్పుడీ ప్రశ్నలు బీహార్ వాసులను వేధిస్తున్నాయి. 


Updated Date - 2022-07-04T23:44:23+05:30 IST