వారి మాటే శాసనం!

ABN , First Publish Date - 2022-07-07T05:03:22+05:30 IST

‘ప్రభుత్వం మాది. మా మాటే శాసనం’ అన్నట్టుగా ఉంటున్నారు వైసీపీ నాయకులు.

వారి మాటే శాసనం!
ఇంటి పట్టాలతో ధర్నా చేస్తున్న లబ్ధిదారులు (ఫైల్‌)

  1. స్థలాల పంపిణీలో వైసీపీ నాయకుల జోక్యం
  2. నిబంధనలు పాటించని అధికారులు
  3. మూడేళ్లుగా లబ్ధిదారుల ఎదురు చూపులు 


మద్దికెర, జూలై 6: ‘ప్రభుత్వం మాది. మా మాటే శాసనం’ అన్నట్టుగా ఉంటున్నారు వైసీపీ నాయకులు. అధికారులు కూడా ఆ శాసనాన్నే అమలు చేస్తున్నారు. నిబంధనలు...గతంలో జరిగిన సంఘటనలు...ఇవేమీ పట్టించుకోవడం లేదు. మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల విషయమే దీనికి ఉదాహరణ. ఇది ప్రస్తుత అధికారులకు పట్టడం లేదు. ఆప్పట్లో కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే పేదలకు ఇళ్ల స్థలాలకు పట్టాలను పంపిణీ చేశారు.  వారికి రెవెన్యూ అధికారులు ఇంతవరకు స్థలాలు చూపకుండా కాలయాపన చేస్తున్నారు. ఇదేమని అడిగితే అధికార పార్టీ నాయకులు దీనికి అంగీకరించడం లేదని అంటున్నారు. వివరాల్లోకి వెళ్లితే .. మండలంలోని ఎం.అగ్రహారం గ్రామంలో 117/1ఏ సర్వే నెంబరులో మొత్తం 6 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 4.20 ఎకరాలలో జిల్లా పరిషత్‌ పాఠశాలను నిర్మించారు. 2016లో 2.80ఎకరాలలో అప్పటి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కలెక్టర్‌, ఆదోని ఆర్డీవో ఆధ్వర్యంలో 39 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అయితే వీరిలో కొంతమంది కోర్టుకు వెళ్లారు. 2019లో కోర్టు కేసు తేలిపోయింది. ఆ రోజు నుంచి ఇంటి స్థలాల కోసం పట్టాలు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా అధికారులకు కనికరం కలగలేదు. దీంతో ఆ స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. లబ్ధిదారులు కలెక్టర్‌కు స్పందన కార్యక్రమంలో దాదాపు 10సార్లు అర్జీలు ఇచ్చారు. అయినప్పటికీ అధికారులు అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఇంటి స్థలాలు చూపించలేదు.  అప్పటి నిబంధనల మేరకు ఒక్కొక్క లబ్ధిదారుడికి రెండు సెంట్లు ఇచ్చారు. ఇప్పుడు అధికార పార్టీ నాయకులు వారికి రెండు సెంట్లు ఇచ్చే ప్రసక్తి లేదని చెబుతున్నారు. 1.50 సెంట్లు మాత్రమే ఇస్తామని అంటున్నారు. దీనికి ఒప్పుకోకపోతే ఎవరికీ స్థలాలు ఇవ్వవద్దని అధికారులపైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. ఈ 39 మంది లబ్ధిదారులలో కొంతమంది టీడీపీ సానుభూతిపరులుగా ఉన్నందువల్లే ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనేకసార్లు పత్తికొండ ఆర్డీవో లబ్ధిదారులతో, అధికార పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. అయినా అధికార పార్టీ నాయకులు రెండు సెంట్లు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. 



మూడేళ్లుగా ఎదురు చూస్తున్నాం: శాంతమ్మ, ఎం.అగ్రహారం 

ఇళ్ల పట్టాలు ఇచ్చి ఏడేళ్లు అవుతుంది. ఇంతవరకు స్థలాలు చూపించలేదు. ఇంటి పట్టాలు తీసుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. అయినా అధికారులకు కనికరం కలగడం లేదు. 


ఇంటి పట్టాలకు విలువ లేదా? షరీఫాబీ, ఎం.అగ్రహారం 

అప్పటి ఉపముఖ్యమంత్రి, కలెక్టర్‌ చేతుల మీదుగా ఇచ్చిన పట్టాలకు విలువ లేదా?  మాకు రెండు సెంట్ల వంతున ఇవ్వకుండా 1.50సెంట్లు ఇస్తామని అనడం అన్యాయం.  అధికారులు స్పందించి ఇంటి స్థలాలు చూపాలి.  


ఆర్డీఓకు తెలియజేశాం 

ఈ విషయంపై తహసీల్దార్‌ నాగభూషణం మాట్లాడుతూ.. పత్తికొండ ఆర్డీవో దృష్టికి ఇరువర్గాల వాదనలు తీసుకెళ్లామని చెప్పారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు  ముందుకు పోతామని తెలిపారు. 

Updated Date - 2022-07-07T05:03:22+05:30 IST