అప్పుడు అభివృద్ధి.. ఇప్పుడు హత్యలు

ABN , First Publish Date - 2021-06-19T06:04:33+05:30 IST

‘చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు యూనివర్సిటీలు, పరిశ్రమలను తెచ్చి రాయలసీమను అభివృద్ధి చేశారు.

అప్పుడు అభివృద్ధి.. ఇప్పుడు హత్యలు
నివాళి అర్పిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

  1. జగన్‌రెడ్డి ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు 
  2. టీడీపీ హయాంలో రాయలసీమ అభివృద్ధి
  3. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ 
  4. వడ్డు సోదరుల అంత్యక్రియలకు హాజరు.. 
  5. కుటుంబ సభ్యులకు పరామర్శ


గడివేముల, జూన్‌ 18: ‘చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు యూనివర్సిటీలు, పరిశ్రమలను తెచ్చి రాయలసీమను అభివృద్ధి చేశారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ రెడ్డి ఫ్యాక్షన్‌ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే ప్రవర్తించి ఉంటే వైసీపీ నాయకులు రోడ్లపై తిరిగే వారా?’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో హత్యకు గురైన వడ్డు ప్రతాపరెడ్డి, వడ్డు నాగేశ్వరరెడ్డి అంత్యక్రియలకు శుక్రవారం ఆయన హాజరయ్యారు. భౌతిక కాయాలకు నివాళులర్పించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డిని చూస్తే ఫ్యాక్షన్‌ రెడ్డి గుర్తుకు వస్తున్నారన్నారు. ఆయన నాయకత్వంలో ఎన్నడూ లేనివిధంగా రాయలసీమలో రక్తం పారుతోందన్నారు. సోదరుడి కర్మక్రియలకు వెళుతున్న వడ్డు నాగేశ్వరరెడ్డి, వడ్డు ప్రతాపరెడ్డిని కారుతో ఢీకొట్టి పాశవికంగా నరికి హత్య చేయడం దారుణమన్నారు. 20 సంవత్సరాలపాటు గ్రామంలో అభివృద్ధి పనులు చేయడమే వారు చేసిన తప్పా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేసి ప్రజలకు అండగా నిలవడమే వారు చేసిన పాప మా అని అన్నారు. ఇక్కడ ఓ కుక్క ఉం దని, బాగా మొరుగుతోందని, దమ్ము ధైర్యం ఉంటే జంట హత్యలపై సీబీఐ విచారణ చేయించాలని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ప్రాణహాని ఉందని ప్రతాప్‌రెడ్డి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని అన్నారు. కొంతమంది పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మారణహోమం జరిగి 24 గంటలు గడుస్తున్నా నిందితుల్ని పట్టుకోలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


మీ ప్రమేయం లేకుండానే హత్యలు జరిగాయా?


జంట హత్యలు తమరి ప్రమేయం లేకుండానే జరిగాయా అని పాణ్యం ఎమ్మెల్యేను వడ్డు ప్రతాప్‌రెడ్డి కూతురు ప్రశాంతి ప్రశ్నించారు. ‘మా నాన్న 12 సంవత్సరాలు కాటసాని రాంభూపాల్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఆయనకు రక్షణగా వారింటి బయటే పడుకున్నారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా పోయిందా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్‌గా కాటసాని రాంభూపాల్‌రెడ్డి పోటీ చేసినప్పుడు సపోర్ట్‌ చేయలేదనే మా నాన్న, మా పెదనాన్నను చంపేందుకు శ్రీకాంత్‌రెడ్డి, రాజారెడ్డిలని ప్రోత్సహించారని’ ఆరోపించారు. అన్నం పెట్టిన చేతిని నరికించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.


కడసారి వీడ్కోలు.. కన్నీటి  జోహార్లు


అండగా నిలిచిన నాయకులు ఇకలేరని పెసరవాయి గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. కడసారి తమ నాయకులను చూసుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వడ్డు ప్రతాప్‌రెడ్డి, వడ్డు నాగేశ్వరరెడ్డి భౌతికకాయాలను వాహనంలో ఉంచి గ్రామ వీధుల గుండా తీసుకెళ్లారు. కడసారి చూపుతో కూతుళ్లు కన్నీరుమున్నీరయ్యారు. వడ్డు ప్రతాప్‌రెడ్డికి కూతురు కొడుకు, వడ్డు నాగేశ్వరరెడ్డికి సోదరుడి కొడుకు అంత్యక్రియలు నిర్వహించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ అంత్యక్రియల్లో చివరి వరకూ ఉన్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. 


భారీగా పోలీసుల మోహరింపు


జంట హత్యల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ అంత్యక్రియలకు హాజరవ్వటంతో  పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, 200 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 

Updated Date - 2021-06-19T06:04:33+05:30 IST