అప్పుడు వద్దని.. మళ్లీ Adani.. వచ్చీ రాగానే YSRCP రివర్స్‌ ప్లాన్‌..!

ABN , First Publish Date - 2021-10-29T09:18:11+05:30 IST

వైసీపీ అధికారంలోకి తర్వాత అదానీ సంస్థ కృష్ణపట్నం రేవును, గంగవరం పోర్టునూ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే....

అప్పుడు వద్దని.. మళ్లీ Adani.. వచ్చీ రాగానే YSRCP రివర్స్‌ ప్లాన్‌..!

  • విశాఖలో రూ.14,634 కోట్ల పెట్టుబడి
  • గతంలో రూ.70వేల కోట్లకు ఒప్పందం
  • అలిగి వెనక్కి పోయిన అదానీ
  • ఆ తర్వాత పోర్టులు అదే సంస్థ పరం
  • ఇప్పుడు విశాఖ డేటా సెంటర్‌కూ ఓకే
  • వైజాగ్‌ టెక్‌ పార్క్‌ పేరుతో ఎస్‌పీవీ


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి) : ఎట్టకేలకు విశాఖలో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టీడీపీ హయాంలో కుదిరిన ఒప్పందాన్ని తిరగదోడి, భారీ పెట్టుబడికి బ్రేకులు వేసిన వైసీపీ సర్కారు.. చివరికి అదే అదానీని విశాఖకు రప్పిస్తోంది. వైసీపీ అధికారంలోకి తర్వాత అదానీ సంస్థ కృష్ణపట్నం రేవును, గంగవరం పోర్టునూ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు టీడీపీ హయాంలో ఇదే సంస్థ ఇరవై ఏళ్లలో రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెడతామని ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీకి విశాఖపట్నంలో 500 ఎకరాలు ఇవ్వడానికి ముందుకురాగా, 1.1 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ఆ గ్రూపు అధినేత గౌతం అదానీ ప్రకటించారు.


ఒక గిగావాట్‌ డేటా సెంటర్‌ ద్వారా రూ.40 వేల కోట్లు, 5 గిగావాట్ల సోలార్‌ పార్క్‌ ద్వారా రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే, వైసీపీ ప్రభుత్వం పారిశ్రామిక ఒప్పందాలను తిరగదోడింది. అదానీకి విశాఖలో కేటాయించిన 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది. తమకు 20 ఏళ్ల ప్రణాళిక అవసరం లేదని, ఐదేళ్లలో ఏం చేస్తారో చెబితే.. దాని ప్రకారం భూమి ఇస్తామని మెలిక పెట్టింది. దాంతో అదానీ వెనక్కి వెళ్లిపోయింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో పరిశ్రమల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు ఆ సంస్థ ప్రతినిధులను కలిసి చర్చలు జరిపారు.  ‘భూమి ఇస్తాం. పెట్టుబడులు పెట్టండి’ అని అనేకసార్లు కోరడంతో అదానీ గ్రూప్‌ అలక వీడింది. ప్రభుత్వం మధురవాడలో 130 ఎకరాలు ఇస్తామని చెప్పడంతో ఆ మేరకు తన ప్రాజెక్టును కుదించుకుంది. అందులో 82 ఎకరాల్లో 200 మెగావాట్ల డేటా సెంటర్‌ పార్క్‌, మరో 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొంది.  మిగిలిన 20 ఎకరాల్లో 11 ఎకరాలను స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌కు, 9 ఎకరాలను రిక్రియేషన్‌ సెంటర్‌కు వినియోగిస్తామని ప్రతిపాదించింది. వీటన్నింటికీ దశల వారీగా రూ.14,634 కోట్లు పెట్టుబడి పెడతామని... 24,990 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది.


పేరు మార్చుకుంది..

అదానీకి మధురవాడలో 130 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలోనే ఉత్తర్వులు జారీచేసింది. అదంతా కొండ ప్రాంతం. అదానీయే అభివృద్ధి చేసుకోవాలి. విశాఖపట్నంలో ప్రాజెక్టు కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు చేస్తామని అదానీ పేర్కొంది. వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌ (వీటీపీఎల్‌) పేరుతో ఏర్పాటయ్యే ఈ కంపెనీ అదానీకి అనుబంధ సంస్థగా నడుస్తుందని తెలిపింది.

Updated Date - 2021-10-29T09:18:11+05:30 IST