అప్పుడలా...ఇప్పుడిలా!

ABN , First Publish Date - 2021-12-01T04:47:44+05:30 IST

‘ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీహెచఎంఎస్‌, బీఏఎంఎస్‌, ఎండీఎస్‌ పూర్తిచేశారా? అయితే కరోనా వైరస్‌ బాధితులకు సేవలందిస్తే రెగ్యులర్‌ ఉద్యోగ నియామకాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తాం. మార్కుల్లో వెయిటేజీ ఇస్తాం’ అంటూ అప్పట్లో చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చడంపై కరోనా వారియర్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడలా...ఇప్పుడిలా!
కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్యులు(ఫైల్‌)

రెగ్యులర్‌ వైద్యుల భర్తీలో అన్యాయం

 ఆరు నెలలు పూర్తయితేనే వెయిటేజీ మార్కులట

 ప్రభుత్వ తీరుపై మండి పడుతున్న అప్పటి వైద్యులు


‘ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీహెచఎంఎస్‌, బీఏఎంఎస్‌, ఎండీఎస్‌ పూర్తిచేశారా? అయితే కరోనా వైరస్‌ బాధితులకు సేవలందిస్తే రెగ్యులర్‌ ఉద్యోగ నియామకాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తాం. మార్కుల్లో వెయిటేజీ ఇస్తాం’ అంటూ అప్పట్లో చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చడంపై కరోనా వారియర్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా ఆరు నెలలు సర్వీసు పూర్తయితేనే ఐదు మార్కులు వెయిటేజీని వర్తింపజేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఐదు రోజుల వరకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. చాలా మంది ఆరు నెలలకు అటుఇటుగా పది రోజులు, 15 రోజులు తక్కువగా పనిచేసిన వారున్నారు. వారంతా నేడు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

(పార్వతీపురం)

వైద్య విద్యను పూర్తి  చేసిన వారు కొవిడ్‌ సమయంలో సేవలందిస్తే... ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. వారికి మార్కుల్లో వెయిటేజీ ఇస్తామని ప్రకటించింది. తీరా నియామకాలకు వచ్చేసరికి చేయిచ్చింది. కొత్త కొర్రీలతో వారి ఆశలపై నీళ్లు చల్లింది. వైద్యశాఖలో రెగ్యులర్‌ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 21న నోటిఫికేషన విడుదల చేసింది. ఆ తేదీకి ఆరు నెలల సర్వీసు(కొవిడ్‌ బాధితులకు వైద్యం) పూర్తి చేసుకున్న వారికి మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగ నియామకాల్లో ఐదు మార్కుల వెయిటేజీ నిబంధన విధించింది. నోటిఫికేషన ఇచ్చిన సమయానికి ఆరు నెలల సర్వీసు పూర్తికాని వైద్యులకు ఇది అశనిపాతంగా మారింది. రెండో దశలో కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపడం... అనేకమంది ప్రాణాలు కోల్పోవడంతో అప్పట్లో బాధితులకు సేవలు అందించే వైద్యుల కొరత ఏర్పడింది. దీంతో వైద్య కోర్సులు పూర్తి చేసుకున్న వారితో పాటు హౌస్‌ సర్జన (చివరి సంవత్సరం) చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఓ భరోసా ఇచ్చింది. కరోనా వైరస్‌ బాధితులకు సేవలందిస్తే రెగ్యులర్‌ ఉద్యోగ నియామకాలు చేపట్టినప్పుడు మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఆశ కల్పించింది. దీంతో ప్రాణాలను ఫణంగా పెట్టి చాలా మంది వైద్య సేవలందించేందుకు ముందుకు వచ్చారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వేలాది మంది వైద్యులు విధుల్లో చేరి రాత్రి, పగలు తేడా లేకుండా కొవిడ్‌ బాధితులకు వైద్య సేవలందించారు. వైరస్‌ సోకిన వారికి కుటుంబ సభ్యులే దూరంగా ఉన్న సమయంలో.. వారు విశేష సేవలందించారు. రెగ్యులర్‌ ఉద్యోగాల నియామకాల్లో కొవిడ్‌ వీరులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కొత్త కొర్రీలు పెట్టింది. దీనిపై అనేకమంది జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (జీడీఎంవో)లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనీసం 15 రోజులైనా ఉండాలి

ఆరు నెలల కాలం సర్వీసుకు సంబంధించి కనీసం 15 రోజులు తక్కువగా ఉన్న వారికి కూడా వెయిటేజీ మార్కులు ఇవ్వాలన్నది కరోనా వైద్యుల విన్నపం. అలా కాకపోయినా నెల సర్వీసుకు ఒక్క మార్కు చొప్పున అందించినా తమ సేవలకు ప్రభుత్వం గుర్తించినట్లు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అప్పట్లో మే నెల వరకు వేతనాలు అందించిన ప్రభుత్వం తరువాత  ప్రత్యేక వైద్యులకు వేతనాలు ఇవ్వలేదు. అనేకమంది ఇతర జిల్లాల నుంచి వచ్చి సేవలు అందించారు. వారికి వేతనాలు ఇవ్వకుండా.. ఇప్పుడు వెయిటేజ్‌ మార్కులు కేటాయించకుండా అన్యాయం చేస్తోందని వాపోతున్నారు. 

జిల్లాలో ఇదీ పరిస్థితి 

జిల్లాలో కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు అనేక మందిని తీసుకున్నారు. వైద్య కోర్సులు పూర్తి చేసిన వారికి రూ.70 వేలు, హౌస్‌ సర్జన (చివరి సంవత్సరం) చదువుతున్న వారికి రూ.30 వేలు గౌరవ వేతనం నిర్ణయించారు. ఈవిధంగా జిల్లాలో 231 మందిని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమించారు. వారిలో  182 మంది మాత్రమే విధుల్లో మిగిలారు. కొంతమందికి ఆరు నెలల సర్వీసు కన్నా నెల నుంచి వారం రోజుల వరకు తక్కువగా ఉంది. ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల ప్రకారం ఆరు నెలల సర్వీసులో 5 రోజులు తక్కువగా ఉన్న వారికి మాత్రమే వెయిటేజ్‌ మార్కులు అందిస్తారు. దీనివల్ల అటుఇటుగా తక్కువ ఉన్నవారికి అన్యాయం జరుగుతోంది. 


నిబంధనల ప్రకారమే నియామకాలు

ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం నియామకాలు జరుగుతాయి. ఆరు నెలల్లో 5 రోజులు తక్కువగా ఉన్న వారికి వెయిటేజ్‌ మార్కులు కలుస్తాయి. జిల్లాలో వారం లేదా అంతకన్నా తక్కువ పనిచేసిన వారు తమ సమస్యను మా దృష్టికి తీసుకువస్తున్నారు.  కలెక్టర్‌ సూర్యకుమారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం.

- డాక్టర్‌ జి.నాగభూషణరావు, డీసీహెచవో



Updated Date - 2021-12-01T04:47:44+05:30 IST