Ross Taylor: ప్రపంచవ్యాప్తంగా 4 వేల పులులు.. ద్రవిడ్ మాత్రం ఒక్కడే: రాస్ టేలర్

ABN , First Publish Date - 2022-08-15T03:30:31+05:30 IST

తన ఆటోబయోగ్రఫీ ‘బ్లాక్ అండ్ వైట్’లో సంచలన విషయాలు వెల్లడించిన కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ టీమిండియా

Ross Taylor: ప్రపంచవ్యాప్తంగా 4 వేల పులులు.. ద్రవిడ్ మాత్రం ఒక్కడే: రాస్ టేలర్

న్యూఢిల్లీ: తన ఆటోబయోగ్రఫీ ‘బ్లాక్ అండ్ వైట్’లో సంచలన విషయాలు వెల్లడించిన కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 2011 ఐపీఎల్‌లో రాహుల్ ద్రవిడ్, షేన్‌వార్న్ వంటి వారితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు.  ఓ మ్యాచ్‌లో డకౌట్ అయిన తనను రాజస్థాన్ రాయల్స్ యజమాని ఒకరు తన ముఖంపై మూడునాలుగుసార్లు కొట్టాడంటూ తన ఆత్మకథలో రాసుకొచ్చాడు. అలాగే, రాహుల్ ద్రవిడ్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. 


ఓసారి రాహుల్ ద్రవిడ్‌తో కలిసి రణతంబోర్ నేషనల్ పార్కులో పులిని చూసేందుకు వెళ్లామని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో ద్రవిడ్‌కున్న ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయినట్టు పేర్కొన్నాడు. ఆ పార్కులో పులిని చూడడం కంటే ద్రవిడ్‌ను చూసేందుకే అభిమానులు ఎగబడ్డారని ఆ పుస్తకంలో రాసుకొచ్చాడు. అప్పుడు తాను ద్రవిడ్‌ను.. ‘పులిని నువ్వెన్నిసార్లు చూశావని’ అడిగానని, అందుకు ద్రవిడ్ ‘ఒక్కసారి కూడా చూడలేదని’ సమాధానం ఇచ్చాడని పేర్కొన్నాడు. తాను 21 సార్లు సఫారీలను సందర్శించినా ఒక్క పులిని కూడా చూడలేదని ద్రవిడ్ చెప్పాడన్నాడు. అతడి  సమాధానం తనను ఆశ్చర్య పరిచిందని, ‘‘ఏంటీ 21సార్లు వెళ్లినా ఒక్కసారి కూడా కనిపించలేదా?’ అని ప్రశ్నించినట్టు పేర్కొన్నాడు.


తానైతే డిస్కవరీ చానల్ చూస్తానని చెప్పానని టేలర్ ఆ పుస్తకంలో రాసుకొచ్చాడు. ‘‘ఆ తర్వాత సఫారీకి వెళ్లాలని అనుకున్నాం. టీవీలో బేస్‌బాల్ గేమ్ చూసే పనిలో ఉండడంతో జేక్ ఓరమ్ మాతో రాలేదు. మధ్యాహ్నం సమయంలో ద్రవిడ్‌తో కలిసి సఫారీకి వెళ్లాం. మా డ్రైవర్‌కి సహోద్యోగి నుంచి రేడియో కాల్ వచ్చింది,   T-17 అని ట్యాగ్ చేసిన పులిని కనుగొన్నామని చెప్పడంతో ద్రవిడ్ థ్రిల్‌కు గురయ్యాడు. 21సార్లు సఫారీకి వెళ్లినా కనిపించని పులి 22వసారి అరగంటలోనే కనిపించింది’’ అని టేలర్ పేర్కొన్నాడు. 


‘‘మేమందరం ఓపెన్ టాప్ ఎస్‌యూవీలు ఎక్కాం. ల్యాండ్ రోవర్ల కంటే కొంచెం పెద్దవి. పులి 100 మీటర్ల దూరంలో ఓ రాయిమీద కనిపించింది. దానిని చూసి ఉలిక్కిపడ్డాం. అయితే, ఇక్కడో విషయం నాకు ఆశ్చర్యం అనిపించింది. మేం పులిని చూస్తుంటే, ఇతర వాహనాల్లో ఉన్నవారు కెమెరాలను రాహుల్ ద్రవిడ్ వైపు గురిపెట్టారు. మేం పులిని చూసినంత ఉత్సాహంగా వారు ద్రవిడ్‌ను చూశారు.  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4000 పులులు అడవిలో ఉంటాయేమో. కానీ అక్కడ ఒక్క రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఉన్నాడు’’ అని టేలర్ తన బయోగ్రఫీలో రాసుకొచ్చాడు. కాగా, టేలర్ ఈ ఏడాది మొదట్లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అతడి ఆటోబయోగ్రఫీ ‘బ్లాక్ అండ్ వైట్’ గురువారం విడుదలైంది.

Updated Date - 2022-08-15T03:30:31+05:30 IST