బస్సులో లోపాలు లేవు

ABN , First Publish Date - 2021-12-17T01:44:27+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో పడిన బస్సు ప్రమాదంపై ఆర్టీసీ అధికారులు విచారణకు దిగారు.

బస్సులో లోపాలు లేవు

జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో పడిన బస్సు ప్రమాదంపై ఆర్టీసీ అధికారులు విచారణకు దిగారు.  ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవికుమార్‌, రీజనల్‌ మేనేజర్‌ వీరయ్యచౌదరి, జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ గురువారం ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో ఆర్‌ఎం వీరయ్య చౌదరి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన ఘటన నుంచి జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం వరకు కారులో ప్రయాణించి రహదారి సరిగ్గా లేకపోవడం వలన వాహన రాకపోకలకు ఇబ్బందిగా ఉందని గుర్తించామన్నారు. జల్లేరు వాగులో పడిన బస్సు ప్రమాదం ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి జరిగిన ప్రమాదమే తప్పా బస్సులో ఎటువంటి లోపాలు లేవని తెలుస్తోందన్నారు. బస్సులో ఎటువంటి లోపం ఉన్నా సరే వెంటనే తెలుస్తుందన్నారు. ప్రతీ రోజు అన్ని బస్సులను తనిఖీ చేస్తారని ఏదైనా లోపం ఉంటే ఆ బస్సులను రూట్‌కు పంపకుండా మరమ్మతులు చేస్తారని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడటం సరికాదని, వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. బీఎస్‌ 4 లేటెస్ట్‌ మోడల్‌కు సంబంధించిన ఈ బస్సు 3 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని, బస్సుకు ఇంకా కాలపరిమితి ఉందని వీరయ్యచౌదరి పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-17T01:44:27+05:30 IST