బోరుమంటున్న ఉద్దానం!

ABN , First Publish Date - 2022-01-22T04:39:26+05:30 IST

‘నిర్వహణ నిధులు కేటాయింపు ఉండదు. సిబ్బందికి ఏళ్ల తరబడి జీతాలు అందవు. చేసిన మరమ్మతులకు చెల్లింపులు ఉండవు’.. ఇదీ దాదాపు 400 గ్రామాల దాహార్తిని తీర్చుతున్న ఉద్దానం ప్రాజెక్ట్‌ దయనీయ పరిస్థితి. రెండున్నర దశాబ్దాలుగా ఇబ్బందుల నడుమ నెట్టుకొస్తోంది ఈ అపర భగీరథి.

బోరుమంటున్న ఉద్దానం!
కాశీబుగ్గలోని ఉద్దానం రక్షితనీటి పథకం ప్రధాన కార్యాలయం.

అపర భగీరఽథికి అన్నీ అవస్థలే

నిర్వహణకు నిధులు లేవు

సిబ్బందికి జీతాలు రావు

ఉద్దానం ప్రాజెక్ట్‌పై నీలినీడలు

(పలాస)

‘నిర్వహణ నిధులు కేటాయింపు ఉండదు. సిబ్బందికి ఏళ్ల తరబడి జీతాలు అందవు. చేసిన మరమ్మతులకు చెల్లింపులు ఉండవు’.. ఇదీ దాదాపు 400 గ్రామాల దాహార్తిని తీర్చుతున్న ఉద్దానం ప్రాజెక్ట్‌ దయనీయ పరిస్థితి. రెండున్నర దశాబ్దాలుగా ఇబ్బందుల నడుమ నెట్టుకొస్తోంది ఈ అపర భగీరథి. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ఉద్దానం, తీర గ్రామాల్లో నిత్యం దాహం కేకలే. అప్పట్లో తాగునీటి కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరిగాయి. దీంతో అప్పటి ఎంపీ, కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉద్దానం మంచినీటి పథకాన్ని సాధించారు. 1997, జూన్‌ 10న అప్పటి సీఎం చంద్రబాబు ఉద్దానం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. రూ.44 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఉద్దానం ప్రాజెక్ట్‌ పనులు గడువు కంటే ముందుగానే పూర్తయ్యాయి. పథకాన్ని ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. తొలినాళ్లలో పుష్కలమైన నిధులు, నిర్వహణ సక్రమంగా సాగేది. కాలక్రమేణా తరువాత వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్ట్‌పై చిన్నచూపు చూశాయి. దీంతో నిర్వహణ కొరవడి పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. మరోవైపు యంత్రాలు, పరికరాలకు కాలం చెల్లిపోతోంది. వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయాల్సి ఉన్నా నిధులు లేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. 


300 గ్రామాల దాహార్తిని తీర్చుతూ..

ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాల్లో 300కుపైగా గ్రామాలకు ‘ఉద్దానం’ ప్రాజెక్ట్‌ నీరందిస్తోంది. బాహుదా, మహేంద్రతనయ నదుల్లో ఇన్‌ఫిల్టరేషన్‌ బావులు ఏర్పాటుచేసి అక్కడి నుంచి నీరు అందిస్తున్నారు. అయితే 25 సంవత్సరాలు గడుస్తుండడంతో మోటార్లు, ఇతర పరికరాలు మూలకు చేరుతున్నాయి. పైపులైన్లు లీకులకు గురవుతున్నాయి. కానీ కొత్తవి ఏర్పాటుకు నోచుకోవడం లేదు. ఉన్నంతలో సిబ్బంది మరమ్మతులు చేసి పథకాన్ని నడిపిస్తున్నారు. ఒకరోజు ‘ఉద్దానం’ నీరు రాకపోతే విలవిల్లాడిపోయే గ్రామాలున్నాయి. వజ్రపుకొత్తూరు వంటి తీర ప్రాంతాల్లో సముద్రం నీరు చొచ్చుకొని రావడం వల్ల బావులన్నీ కలుషితమయ్యాయి. ఎక్కడా మంచినీరు దొరకని పరిస్థితి ఉంది. ఉప్పునీటినే వినియోగించుకోవాల్సిన దుస్థితి. ఈ తరుణంలో ఉద్దానం మంచినీటి పథకం ఎడారిలో ఒయాసిస్‌గా పని చేస్తుందనడంలో అతిశయోక్తి కాదు.   అటువంటి పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్వహణ భారాన్ని స్థానిక పంచాయతీలకే అప్పగించాయి. ఇప్పటికే నిధులు లేక పంచాయితీలు చేతులు ఎత్తేసాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో పథకం పూర్తిగా పడకేసింది. 


 కొనసాగింపుపై స్పష్టత కరువు

అసలు ఉద్దానం ప్రాజెక్ట్‌ ఉంటుందో..ఊడుతుందో తెలియడం లేదు. తెరపైకి సమగ్ర మంచినీటి పథకం రావడమే ఇందుకు కారణం. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు తాగునీరందించేందుకు రూ.700 కోట్లతో సమగ్ర మంచినీటి పథకాన్ని నిర్మిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన పథకం నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గ్రామాల్లో పైపులైన్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఉపరితల ట్యాంకుల నిర్మాణం సైతం పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఉద్దానం ప్రాజెక్ట్‌ విషయంలో పాలకులు, ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వడం లేదు. ఎవరైనా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తుంటే త్వరలో సమగ్ర మంచినీటి పథకం వచ్చేస్తుందిగా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. వాస్తవానికి ఏటా రూ.3 కోట్ల నిధులు విడుదల చేస్తే అటు పథకం నిర్వహణ, ఇటు 118 మంది సిబ్బందికి నెలనెలా జీతాలు చెల్లించవచ్చు. కానీ ఏడాదికో..ఏడాదిన్నరకో అరకొర నిధుల కేటాయింపుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమగ్ర మంచినీటి పథకం ప్రారంభమైతే అందులో విలీనం చేయాలన్న డిమాండ్‌ అటు ప్రజల నుంచి ఇటు సిబ్బంది నుంచి పెరుగుతోంది. 

Updated Date - 2022-01-22T04:39:26+05:30 IST