ఖాళీలున్నా మిగులేనట!

ABN , First Publish Date - 2022-06-16T07:55:12+05:30 IST

ఖాళీలున్నా మిగులేనట!

ఖాళీలున్నా మిగులేనట!

టీచర్‌ పోస్టుల భర్తీ మానేసి మిగులు చూపుతున్న విద్యాశాఖ

జీవో 117లో నిబంధనల మార్పు

దీంతో భారీగా పోస్టుల కుదింపు

 ప్రకాశంలో 1400 పోస్టులు ఖాళీ

కానీ, కొత్త నిబంధనల ప్రకారం 

2,358 మిగిలాయన్న అధికారులు

రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి

భర్తీ లేకుంటే బోధనపై ప్రభావం

నేడు సీఎం ముందుకు లెక్కలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీని అటకెక్కించిన సర్కారు.. ఉన్నవారిని కూడా పక్కన పెట్టేలా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మిగులు పోస్టులు చూపిస్తున్న తీరు సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం మీద సుమారు 14 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే, గత నాలుగేళ్లనుంచీ ఉపాధ్యాయుల భర్తీ లేకపోవడంతో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారు 1400 ఉపాధ్యాయ పోస్టులను ఒక్క ఆ జిల్లాలోనే భర్తీ చేయాల్సి ఉంటుందని లెక్కతేల్చారు. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలే ఈ లెక్కలు చెప్పారు. కానీ ఇప్పుడు జీవో 117 ప్రకారం లెక్కలు మార్చేశారు. ఉపాధ్యాయ పోస్టుల లోటు నుంచి మిగులుకు లెక్కతేల్చారు. 1,400 పోస్టులను భర్తీ చేయాల్సింది పోయి 2,358 పోస్టులను మిగులు జాబితాలో చేర్చారు. వీటిలో ఎస్‌జీటీలు 1,897 మంది, ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు 358 మంది, పీఎస్‌ స్కూల్‌ అసిస్టెంట్లు 11, హిందీ స్కూల్‌ అసిస్టెంట్లు 92 మిగులు పోస్టులుగా పేర్కొన్నారు. ఇదే పద్ధతిలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోను మిగులు లెక్కలే చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 25 వేల టీచర్‌ పోస్టుల భర్తీని పక్కన పెట్టి.. ఇప్పుడు మిగులు పోస్టులు ఉన్నాయనే వాదనను తెరపైకి తెస్తున్నారు. మిగులు పోస్టుల్లో ఉన్న ఎస్‌జీటీలలో కొందరికి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇస్తారు. మిగిలిన ఖాళీ పోస్టులన్నీ వాటంతట అవే రద్దయిపోనున్నట్లు సమాచారం.


100శాతం రివర్స్‌!

ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల లెక్కలు తేల్చే విషయంలో నిబంధనలు మార్చడం ద్వారా ప్రభుత్వం పరిస్థితిని వందశాతం రివర్స్‌ చేసింది. ఉపాధ్యాయ ఖాళీల లెక్కలను తారుమారు చేసేలా జీవో 117లోని నిబంధనలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 25వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయనుకుంటే.. ఇప్పుడు కొత్త జీవో నిబంధనల ప్రకారం 10-15 వేల పోస్టులు మిగులు తేలే పరిస్థితి ఉందని అంటున్నారు. ఉదాహరణకు గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టులు భారీగా ఖాళీలున్నా.. అందులో కొంతమాత్రమే తీసుకుని వందల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. దానిపై నిరుద్యోగులు భగ్గుమనడంతో కొన్ని పోస్టులు పెంచారు. అక్కడా పూర్తిస్థాయిలో ఖాళీలు భర్తీచేసేలా చర్యలు తీసుకోలేదు. ఉపాధ్యాయుల విషయంలో ఇది పూర్తిగా రివర్స్‌ అయింది. 25 వేల ఖాళీలుంటే అసలు ఖాళీలే లేవని 100శాతం రివర్స్‌ చేశారు. అంతేకాదు.. ఏకంగా మిగులు ఉన్నాయని ప్రకటించడంతో ఉపాధ్యాయ సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడైనా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు మాత్రం ఈ నిష్పత్తిని 1:20 నుంచి 1:30కి మార్చారు.ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:35 నిష్పత్తి ఉండగా.. ఇప్పుడు 1:53కు పెంచారు. ఉన్నత పాఠశాలల్లో గతంలో ఉన్న నిబంధనలను పక్కనపెట్టి ఏకంగా తరగతికి 60మంది విద్యార్థులు ఉండాలనే నిబంధన విధించారు. ప్రభుత్వ పాఠశాలను పర్యవేక్షించాల్సిన ప్రధానోపాధ్యాయులు, పీఈటీలను చాలాచోట్ల లేకుండా చేశారు. 


మీడియం ఒకటే!

3వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు తెలుగు మీడియం ఉండదు. ఒకవేళ తెలుగు మీడియం ఉంటే ఆంగ్ల మీడియం ఉండదు. ఏదో ఒక మీడియంలో మాత్రమే తరగతులు ఉంటాయని నిబంధన విధించారు. మరోవైపు ప్రాథమికోన్నత పాఠశాలల్లో అసలు ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టులే లేకుండా చేశారు. దీంతో మిగులు పోస్టులు పెరిగిపోయాయని కొత్త లెక్కలు తెరమీదికి తెచ్చారు. వారానికి 32 తరగతులు తీసుకునే ఉపాధ్యాయులకు ఈ సంఖ్యను 42 నుంచి 48కి పెంచారు. ఇలాంటి నిర్ణయాలతో చదువులు చట్టుబండలు కావడం ఖాయమని ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో విద్యావ్యవస్థలో తీసుకున్న మార్పులు, జీవో 117పై గురువారం ముఖ్యమంత్రి జగన్‌ సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఉపాధ్యాయుల మిగులు లెక్కలను ఆయనకు సమర్పించే అవకాశం ఉంది.

Updated Date - 2022-06-16T07:55:12+05:30 IST